అడ్డం తిరుగుతున్న నేతలు… బాబుకు తలనొప్పి

చంద్రబాబు నిర్ణయాన్ని అనేక మంది పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా గందరగోళం ఏర్పడింది. [more]

;

Update: 2021-04-03 11:00 GMT

చంద్రబాబు నిర్ణయాన్ని అనేక మంది పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా గందరగోళం ఏర్పడింది. అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని తాము సమర్థించలేమని గట్టిగా చెబుతున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని తాము అమలు చేయబోమంటూ అనేక చోట్ల బరిలో ఉంటామని, పోటీ నుంచి వెనక్కు తగ్గబోమని నేతలు ప్రకటించడం చంద్రబాబు నిర్ణయం ఏ మేరకు అమలవుతుందో చెప్పకనే తెలుస్తోంది.

ఆచితూచి నిర్ణయం తీసుకున్నా…..

చంద్రబాబు ఆచితూచి, తప్పనిసరి పరిస్థితుల్లో బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు పదే పదే చెబుతున్నప్పటికీ నేతలు మాత్రం అంగీకరించడం లేదు. ప్రధానంగా పార్టీకి లాయల్ గా ఉండే నేతలే చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. తొలుత జ్యోతుల నెహ్రూ ఉపాధ్యక్ష పదవికి రాజీనామాతో మొదలయిన వ్యవహారం ఇప్పుడు అన్ని జిల్లాలకు చుట్టుకుంది. విజయనగరంలో తాము బరిలోకి దిగుతున్నట్లు ఆదితి గజపతి రాజు ప్రకటించారు.

పార్టీ విధేయులు కూడా….

ఇక విశాఖలో సీనియర్ నేత, పార్టీకి అత్యంత విధేయుడు బండారు సత్యనారాయణ మూర్తి సయితం తమ అభ్యర్థులు బరిలో ఉంటారని ప్రకటించారు. ఇక నారాలోకేష్ పోటీ చేసిన మంగళగిరిలోనూ టీడీపీ నేతలు ఎదురుతిరిగారు. తాము దుగ్గిరాల ఎంపీపీ పదవిని కైవసం చేసుకుంటామని స్థానిక నేతలు చెబుతున్నారు. అనేక మంది పోటీ లో ఉన్న అభ్యర్థులు నేతల వద్దకు వచ్చి తమ పరిస్థిితి ఏంటని ప్రశ్నిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు సయితం అంగీకరించక తప్పలేదు.

క్యాడర్ అంగీకరించక పోవడంతో….

చంద్రబాబు నిజానికి ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదు. సీనియర్ నేతలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ టీడీపీ క్యాడర్ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. రెండేళ్ల పాటు వైసీపీ నుంచి తాము వత్తిళ్లు ఎదుర్కొన్నా నిలబడగలిగామని, ఇప్పుడు సడెన్ గా బహిష్కరణ నిర్ణయం తీసుకుంటే ఎలా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నామినేషన్లు వేసిన వాళ్లంతా పోటీలో ఉండేందుకే ఇష్టపడుతుండటంతో నేతలు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని థిక్కరించేందుకు సిద్ధమయ్యారు. అశోక్ గజపతి రాజు ఇప్పటికే పరిషత్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పొలిట్ బ్యూరోలో ఉండే సభ్యులే అడ్టంతిరగడంతో చంద్రబాబుకు తలనొప్పిలా మారింది. మొత్తం మీద చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పార్టీలో గందరగోళానికి తెరతీసిందనే చెప్పాలి.

Tags:    

Similar News