బాబు ఆరాటమే కానీ…?

వెనకటికి ఒక ముతక సామెత ఉంది. అప్ప ఆరాటమే కానీ బావ బతికేట్టు లేడు అని. ఇపుడు హైదరాబాద్ నుంచి జూమ్ యాప్ ద్వారా తెల్లారి లేచిన [more]

Update: 2021-02-10 00:30 GMT

వెనకటికి ఒక ముతక సామెత ఉంది. అప్ప ఆరాటమే కానీ బావ బతికేట్టు లేడు అని. ఇపుడు హైదరాబాద్ నుంచి జూమ్ యాప్ ద్వారా తెల్లారి లేచిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు గొంతు చించుకుంటున్నప్పటికీ తమ్ముళ్లకు మాత్రం అసలు ఇదేదీ పట్టడంలేదు. ఇపుడు చంద్రబాబుకు అవసరం. దాంతో తమ్ముళ్ళు కాళ్ళు జాపేస్తున్నారు. తాను అధికారంలో ఉన్నపుడు క్యాడర్ ని పక్కన పెట్టిన పాపానికి ఫలితాన్ని ఇపుడు చంద్రబాబు అనుభవించాల్సివస్తోందని అంటున్నారు.

ఎదురు నిలిచినా …?

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉంది. గతంలో అధికార పార్టీలకు వైసీపీకి స్వరూపంలో చాలా తేడా ఉంది. అప్పట్లో పాలకులకు విపక్షాల దగ్గరకు వచ్చేసరికి కొన్ని రాజకీయ సంప్రదాయాలు మొహమాటాలూ ఉండేవి. ఇపుడు జగన్ విషయంలో అవేమీ లేవు. ఆయన ఏకంగా అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయించగలరు, కళా వెంకటరావుని కూడా పోలీస్ స్టేషన్ కి రప్పించగలరు. మరి ఈ సంగతులు కళ్ళ ముందు జరిగాక టీడీపీ క్యాడర్ బోర విడుచుకుని వైసీపీకి ఎదురు నిలుస్తుంది అనుకుంటే పొరపాటే అవుతుంది. మరో వైపు చూస్తే గెలిచినా అధికార పార్టీ నాయకులు వారిని అలా ఉండనిస్తారా అన్నది కూడా తమ్ముళ్లలో ఇంకో చర్చ. దాంతో ఎందుకొచ్చిన పంచాయతీ అనేస్తున్నారు.

చావో రేవో అయినా…?

తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకూ చంద్రబాబుకు ఈ ఎన్నికలు చావో రేవో అనే చెప్పాలి. రెండేళ్ళల్లో టీడీపీ బలం పెరిగిందా లేదా అన్నది తమ్ముళ్ళల ద్వారా రాజకీయ ప్రపంచానికి చూపించాలి. ఆ విధంగా బలంగా ఉనికి చాటుకుంటేనే రేపటి రోజున ఎన్నికల్లో నిలిచేది గెలిచేది. దాంతో చంద్రబాబు ఎంతగా తాపత్రయ‌పడుతున్నా కూడా క్యాడర్ మాత్రం కదలడంలేదు. గత ఏడాది ఎంపీటీసీ జెడ్పీటీసీలకు నామినేషన్లు వేయాల్సివస్తే టీడీపీకి కంచుకోట లాంటి శ్రీకాకుళం జిల్లాలో డెబ్బై నుంచి ఎనభై చోట్ల అభ్యర్ధులే దొరకలేదు. ఇపుడు కూడా అలాగే సీన్ ఉంది అంటున్నారు.

సీరియస్ గా లేరా…?

ఇక తమ్ముళ్ల వైఖరి పూర్తిగా విరుధ్ధంగా ఉంది. చంద్రబాబు పంచాయతీ ఎన్నికలను అన్నీ అనుకూలించే విధంగా ఇపుడు జరిగేలా పావులు కదిపారు. మరో వైపు చూస్తే ఎన్నికల అధికార నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ప్రభుత్వానికి బాగా చెడింది. దాంతో క్యాడర్ ఉత్సాహంతో పోటీకి దిగితే మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు ఆలోచిస్తున్నారు కానీ పల్లెల్లో మాత్రం అంత సీన్ లేదనే అంటున్నారు. చొక్కాలు చింపుకుని వీరోచితంగా పోరాడే పరిస్థితి అయితే ఇపుడు ఎక్కడా లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి గట్టిగా రెండేళ్ళు కూడా కాలేదు, ఇపుడు బోర విడిచి ఎదురు తిరిగినా మరో మూడేళ్లకు పైగా కాలామంతా పోరాటం అంటే తాము రెడీగా లేమని తమ్ముళ్ళు తలాక్ అనేస్తునారుట. మరి చంద్రబాబు ఆరాటం తీరేదేలా అన్నదే ప్రశ్న.

Tags:    

Similar News