బాబు రాజకీయం ఇక క్లైమాక్స్ కేనా?

చంద్రబాబునాయుడు. ఇందిరా కాంగ్రెస్ అభ్యర్ధిగా చంద్రగిరి నుంచి తొలిసారి 1978లో గెలిచి ఆ తరువాత రెండేళ్ళు తిరగకుండానే మంత్రి పదవిని చేపట్టి యువ నేతగా రికార్డులకు ఎక్కారు. [more]

;

Update: 2021-03-15 02:00 GMT

చంద్రబాబునాయుడు. ఇందిరా కాంగ్రెస్ అభ్యర్ధిగా చంద్రగిరి నుంచి తొలిసారి 1978లో గెలిచి ఆ తరువాత రెండేళ్ళు తిరగకుండానే మంత్రి పదవిని చేపట్టి యువ నేతగా రికార్డులకు ఎక్కారు. ఆ మీదట ఎన్టీయార్ కుమార్తెతో వివాహం అయ్యాక రాజకీయంగా మరో మెట్టు ఎక్కారు. కాంగ్రెస్ ఓడిన తరువాత టీడీపీలో చేరి అన్న గారి అల్లుడిగా చక్రమే తిప్పారు. మామ చాటునే ఉంటూ సరైన సమయంలో టీడీపీని టోటల్ గా తన వైపునకు లాగేసుకున్నారు. ఇక సొంతంగా చరిష్మా లేకపోయినా ఏపీని ఎక్కువగా పాలించిన సీఎం గా కూడా పేరు సంపాదించారు. పొత్తులు ఎత్తులు వ్యూహాలు అన్నీ పూర్తిగా చిత్తు అయిపోయిన చోట చంద్రబాబు రాజకీయం కూడా క్లైమాక్స్ కి చేరింది అనిపిస్తోంది.

ఇంకా దిగజారినా …?

చంద్రబాబు మాకు అవసరం లేదు అని ఏపీ ప్రజలు తేల్చి చెప్పారు. 2919 ఎన్నికల్లో జగన్ ది గాలివాటం గెలుపు అని చంద్రబాబు ప్రచారం చేశారు. ఈవీఎంలను మ్యానేజ్ చేయడం వల్లనే గెలిచారు అని గేలిచేశారు. ఇపుడు చూస్తే పంచాయతీల నుంచి పట్టణాల దాకా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏపీ ప్రజలకు చంద్రబాబు నాయకత్వం అవసరం లేదు అని చెప్పేసిన పరిస్థితి. టీడీపీకి రెండేళ్ళు తిరగకుండానే మరింత దారుణమైన అపజయం దక్కింది.

తప్పుకోవడమే …?

ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు చంద్రబాబు తెలివైన రాజకీయ నేత అయితే టీడీపీని మూసేయాల్సిన అవసరం లేదు కానీ తాను మాత్రం పక్కకు తప్పుకోవడమే హుందా అయిన పని అని అంతా అంటున్నారు. చంద్రబాబుకు వయసు సహకరించడంలేదు. ఆయన పాలిటిక్స్ అవుట్ డేటెడ్ అయింది. తరాలు మారాయి. చంద్రబాబు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేద్దామనుకునే రొడ్డకొట్టుడు రాజకీయం కూడా జనాలకు రోత పుట్టిస్తోంది. ప్రజలు తన కన్నా తెలివైన వారు అని ఇకనైనా చంద్రబాబు గ్రహిస్తే మాత్రం ఆయన గత రెండేళ్ళలో టీడీపీ ఇంతలా అధపాతాళానికి దిగజారిపోవడానికి బాధ్యతగా తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం మేలు అన్న సలహాలు వినిపిస్తునాయి.

ఆ ముచ్చట మిగిలిందా …?

ఇంకా చంద్రబాబు పంతానికి పోయి టీడీపీ ఓడలేదు, అధికార పార్టీ అరాచకాలు అంటూ ఎవరినైనా మభ్యపెట్టాలనుకున్నా అసలు కుదిరేది కాదు, ఇప్పటికే ఆయన్ని ఏడు సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గం నీవు వద్దు బాబూ అని ముఖం మీద చెప్పేసింది. జూనియర్ ఎన్టీయార్ ని తెచ్చి పార్టీని నిలబెట్టుకోండి అని ఒక బహిరంగ సభలోనే జనం సలహా ఇచ్చేశారు. అయినా వారి మాట కూడా వినకుండా చంద్రబాబు కంటిన్యూ అయితే 2024లో కుప్పంలో ఓడి మాజీ ఎమ్మెల్యేగా ఆ ముచ్చట కూడా తీర్చుకోవాల్సి వస్తుందేమో అన్న మాట కూడా ఉంది. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అయితే చంద్రబాబు ఇక తన రాజకీయాలకు ముగింపు పలికి విశ్రాంతి తీసుకోవాలని కోరడం ఈ సందర్భంగా విశేషం.

Tags:    

Similar News