బాబు ఆ ఎత్తుగడ…ఫలిస్తే…?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డైలమాలో ఉన్నారు. బీజేపీతో సఖ్యతగా ఉండటమా? తీవ్రస్థాయిలో ఇప్పటి నుంచే విభేదించడమా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీతో జనసేన పొత్తు ఉండటంతో చంద్రబాబు [more]

Update: 2021-08-05 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డైలమాలో ఉన్నారు. బీజేపీతో సఖ్యతగా ఉండటమా? తీవ్రస్థాయిలో ఇప్పటి నుంచే విభేదించడమా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీతో జనసేన పొత్తు ఉండటంతో చంద్రబాబు నిర్ణయం తీసుకునేందుకు వెనకాడుతున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తుతో పోటీ చేయాల్సిందే. మళ్లీ ఒంటరిగా పోటీ చేసే సాహసాన్ని చంద్రబాబు చేయరు.

వారిద్దరినీ విడదీసి….

అయితే ఇప్పటివరకూ బీజేపీతోనే కలసి వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. బీజేపీ, జనసేన తనతో కలిస్తే జగన్ ను సులువుగా ఓడించవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. కానీ బీజేపీ మాత్రం కలసి వచ్చేట్లు కనపడటం లేదు. జనసేనను బీజేపీ నుంచి విడగొడితే తన లక్ష్యం చాలా వరకూ నెరవేరుతుందన్నది చంద్రబాబు వ్యూహం. ఆ వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది.

అసంతృప్తిగా ఉండటంతో….

జనసేన కూడా బీజేపీ వ్యవహారం పట్ల సంతృప్తికరంగా లేదు. మోదీ ఇమేజ్ క్రమంగా తగ్గుముఖం పడుతుండటం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల వంటి వాటి విషయంలో పవన్ కల్యాణ్ అసంతృప్తికరంగా ఉన్నారు. అందుకే బీజేపీతో సంబంధం లేకుండా జాబ్ క్యాలెండర్ పై నిరసనకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. దీనిని చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు.

ఒరిగేదేమీ లేదని….?

నిజానికి ఏపీలో బీజేపీతో పెద్దగా ఒరిగేదేమీ లేదు. దాని ఓటింగ్ శాతం కేవలం ఒకటి నుంచి రెండు శాతమే. తాము కలుపుకోకపోయినా తమ ఓట్లు చీల్చే శక్తి బీజేపీకి లేదన్నది చంద్రబాబు భావన. సాధ్యమయినంత వరకూ జనసేనను బీజేపీకి దూరం చేసి తమతో కలుపుకోవాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారు. జాతీయ పార్టీల రెండింటిని దూరం పెట్టి రెండు ప్రాంతీయ పార్టీలుగా కలసి పోటీ చేస్తే సత్ఫలితాలుంటాయని చంద్రబాబు భావిస్తున్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ కు ఈ మేరకు ఆహ్వానం పంపనున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News