బాబు చేతిలోని బ్రహ్మాస్త్రం ఇదేనా..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒక్క నిమిషం కూడా వృధా చేసేందుకు సిద్ధంగా లేరు. ఎన్నికల వరకు ఉన్న అన్ని అవకాశాలను [more]

;

Update: 2019-01-25 09:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒక్క నిమిషం కూడా వృధా చేసేందుకు సిద్ధంగా లేరు. ఎన్నికల వరకు ఉన్న అన్ని అవకాశాలను టీడీపీకి అనుకూలంగా ఉపయోగించుకోవడంతో పాటు అన్ని అస్త్రాలను వదిలేందుకు ఆయన వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీపై ఉన్న వ్యతిరేకత తీసుకువచ్చి, ఆ వ్యతిరేకతను పూర్తిగా క్యాష్ చేసుకునే దిశగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక మోదీని ఆంధ్రప్రదేశ్ పాలిట విలన్ గా చూపించడంలో సక్సెస్ అయిన టీడీపీ ఇప్పుడు మోదీని ఢీకొట్టేది చంద్రబాబు ఒక్కరే అని, ఈసారి చంద్రబాబు కీలకంగా ఉండే మహాకూటమి అధికారంలోకి వస్తుందనే ఒక ఇమేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక పక్షాలతో రాజధాని అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కలకత్తాలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన మొదటి ర్యాలీలో… ‘తర్వాతి ర్యాలీ అమరావతిలో’ అంటూ చంద్రబాబు ప్రకటించేశారు.

కలకత్తా తరహాలో ర్యాలీ…

కలకత్తాలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ద్వారా దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేకులంతా ఒక్కతాటిపైకి వచ్చినట్లయ్యింది. ప్రధాని పదవిపై ఆశతో ఉన్న మమతా ఈ ర్యాలీని బాగా ఉపయోగించుకున్నారు. ఈ ర్యాలీ ద్వారా పశ్చిమ బెంగాల్ లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే ప్లాన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో మోదీ పట్ల వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కలకత్తా తరహా ర్యాలీ నిర్వహించడం ద్వారా చంద్రబాబు ‘దేశవ్యాప్తంగా అందరినీ ఏకం చేస్తున్నారు’ అనే ఒక ఇమేజ్ కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలోనే అమరావతిలో భారీ సభ జరపనున్నారు.

మోదీ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా…

ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా జనసమీకరణ చేయాలని టీడీపీ భావిస్తోంది. సుమారు 10 లక్షల మంది బహిరంగ సభ నిర్వహించాలనుకుంటోంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు మిగతా విపక్ష నేతలను కూడా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ కి ప్రధాని మోదీ, బీజేపీ చేసిన అన్యాయం, ప్రత్యేక హోదా డిమాండ్ ను వారిచే వినిపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 12 జిల్లాల్లో ధర్మపోరాట దీక్షలు పూర్తయినందున చివరి ధర్మ పోరాట దీక్షనే మోదీ వ్యతిరేక పక్షాల సభగా నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల వేళ టీడీపీకి ఊపు రావడం ఖాయమని టీడీపీ భావిస్తోంది. ఇది కచ్చితంగా రానున్న ఎన్నికల్లో కలిసివచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకతనే చంద్రబాబు తన ప్రధాన బలంగా, బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News