ఇంత పగపడుతున్నారా… కానీయకుండా చేయాలనేనా ?

విశాఖ. ప్రశాంత నగరం. ప్రగతి నగరం. తన మానాన తాను ఎదిగిన నగరం. ఈ నగరానికి ఇపుడు రాజకీయ సెగ తగులుతోంది. అలా ఇలా కాదు, రెండు [more]

Update: 2020-07-26 13:30 GMT

విశాఖ. ప్రశాంత నగరం. ప్రగతి నగరం. తన మానాన తాను ఎదిగిన నగరం. ఈ నగరానికి ఇపుడు రాజకీయ సెగ తగులుతోంది. అలా ఇలా కాదు, రెండు వైపుల నుంచి పగ పట్టినట్లుగా ఘాటు తగులుతోంది. విశాఖను ఏం చేద్దామని రాష్ట్రంలోని పార్టీలు అనుకుంటున్నాయో తెలియదు కానీ విశాఖకు మునుపటి కళా కాంతులు కూడా లేకుండా చేసేలా కుట్ర రాజకీయం మాత్రం పక్కాగా నడుస్తోంది అంటున్నారు. లేకపోతే విశాఖకే అన్ని అనర్ధాలు కూడబలుక్కుని వచ్చేస్తాయా.

నరమానవుడికి వణుకు ….

విశాఖలో నరమానవుడు సంచరించడానికి లేనంత ప్రమాదం పొంచి ఉందని కొన్ని శక్తులు చేస్తున్న ప్రచారం కానీ వండివారుస్తున్న రాతలు కానీ బయట నుంచి చూసే వారిని తెగ‌ భయపెడుతున్నాయి. విశాఖలో కాలుమోపితే కాలం తీరినట్లే అన్నట్లుగా కనికట్టు కధలు అల్లుతున్నారు. విశాఖ సిటీ అంతా భయానకమే. అక్కడ ఓ వైపు ప్రమాద‌కర రసాయన పరిశ్రమలు, మరో వైపు తరచూ వచ్చే హుదూద్ తుఫాన్లు, వీటన్నిటికీ మించి సునామీ ముప్పు ఏకంగా విశాఖ సిటీకే గురిపెట్టి ఉందని చేస్తున్న ప్రచారంతో తాము మృత్యువు ఒడిలో ఉన్నామా అన్న భ్రాంతి, వణుకూ నగర వాసుల్లో కలుగుతోంది.

ఒక్క మాటతో ….

విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని ఏడెనిమిది నెలల క్రితం నిండు శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించడం తప్పు అయినట్లుంది. నిజంగా జగన్ ప్రకటించారు కానీ ఆ దిశగా ఒక్క అడుగు ముందుకుపడలేదు, అది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ఇంతలోనే కొంప మునిగిపోయినట్లుగా విశాఖ మా చెడ్డ నరకం లాంటి నగరమంటూ కొన్ని రాజకీయ పక్షాలు, వాటికి సంబంధించిన అనుకూల మీడియా మోతుబరులు కధలు కధలుగా వండి వార్చేస్తున్నారు. నిజంగా అంత ప్రమాదకరమైన సిటీ అయితే ఇక్కడ వ్యాపారాలు ఎందుకు చేస్తారు, పాతిక ముప్పయి లక్షల జనాభా ఎందుకు జీవిస్తారు, ఆసియా ఖండంలోనే అతి వేగంగా ఎదిగే నగరంగా విశాఖ ఎందుకు ఉంటుంది. విశాఖ మీద బురద జల్లుతున్న మేధావుల బుర్రలకు బహుశా ఇది తట్టినట్లుగా లేదేమో.

నోరూ వాయీ లేని …..

నిజంగా విశాఖ చిన్న పల్లెకారు ప్రాంతం. వందేళ్ళ నుంచి తీసుకుంటే మెల్లగా ఎదుగుతూ చివరికి ఇంతలా తన ఖ్యాతిని, పరపతినీ పెంచుకుంది. విశాఖ ప్రగతి గురించి గత మూడు దశాబ్దాలుగా ఒక గొంతు కూడా నిలిచి ప్రభుత్వాలను నిలదీసింది లేదు. ఎందుకంటే అంతా వలసపాలకులదే ఇక్కడ హవా. దాంతో మౌనంగానే విశాఖ ఉంటూ వచ్చింది. అయితే ఇపుడు విశాఖను రాజధాని చేస్తామని అంటోంది అతి బలమైన అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయన పట్టుదలతో విశాఖ దశ ఏమైనా మారుతుందేమోనని అంతా అనుకుంటున్న వేళ సాక్ష్తాత్తూ ఒక సీఎంని సైతం అడ్డంగా నెట్టేస్తూ ఆయన మాటను కొట్టేస్తూ సాగుతున్న విష రాజకీయం చూసి నగరవాసులే ఆశ్చర్యపోతున్నారు. నిజంగా విశాఖ పరిశ్రమలు కూడా ఇంతటి విషాన్ని చిమ్మడంలేదు, హుదూద్ తుఫాన్లు కూడా ఈ చిల్లర రాజకీయం ముందు వెలవెలబోతున్నాయి. పడగెత్తిన సునామీ కూడా ఈ రాజకీయ సునామీని చూసి తాను సరిపోనంటోంది విశాఖ మీద పగపట్టిన తీరున సాగుతున్న ఈ దారుణ రాజకీయానికి జన చైతన్యమే తిరుగులేని జవాబు చెప్పాలేమో ఇక.

Tags:    

Similar News