రెండేళ్లకే చింత‌మ‌నేని ట్రాక్‌లోకి వ‌చ్చేశాడే ?

చింత‌మ‌నేని ప్రభాక‌ర్ రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ప్రత్యేకంగా ప‌రిచ‌యం అక్కర్లేని పేరు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ విఫ్‌. కాంట్రవ‌ర్సీ కింగ్‌… వివాదంతోనే ఆయ‌న సావాసం [more]

Update: 2021-03-06 13:30 GMT

చింత‌మ‌నేని ప్రభాక‌ర్ రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ప్రత్యేకంగా ప‌రిచ‌యం అక్కర్లేని పేరు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ విఫ్‌. కాంట్రవ‌ర్సీ కింగ్‌… వివాదంతోనే ఆయ‌న సావాసం చేస్తారు. ప‌దేళ్ల పాటు దెందులూరును ఏక‌చ‌క్రాధిపత్యంగా పాలించిన చింత‌మ‌నేని ప్రభాక‌ర్ గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా జూనియ‌ర్ అయిన కొఠారు అబ్బయ్య చౌద‌రి చేతిలో 17 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ప‌వ‌న్‌, జ‌గ‌న్ వ‌చ్చి పోటీ చేసినా గెలుపు త‌న‌దే అన్న చింత‌మ‌నేని ప్రభాక‌ర్ ఓడిపోవ‌డం టీడీపీ శ్రేణుల్లోనే చాలా మందికి మింగుడు ప‌డ‌లేదు. ఎందుకంటే దెందులూరు టీడీపీకి అంత కంచుకోట‌. ప‌దేళ్లలో ప్రభాక‌ర్‌పై ఉన్న కేసుల‌న్ని జ‌గ‌న్ ప్రభుత్వం తిర‌గ‌దోడ‌డంతో మనోడు రెండు నెల‌ల పాటు జైలు సావాసం చేయాల్సి వ‌చ్చింది.

వన్ సైడ్ కాకుండా….?

జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్న చింత‌మ‌నేని ప్రభాక‌ర్ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ముందు మ‌ళ్లీ స్పీడ్ అయ్యాడు. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో కొన్ని ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీల‌తో పాటు స‌ర్పంచ్ స్థానాలు కూడా ఏక‌గ్రీవం కావ‌డంతో చింత‌మ‌నేని ప్రభాక‌ర్ ప‌నైపోయిందా ? దెందులూరులో కూడా టీడీపీకి అంత సీన్ లేదా ? అన్న సందేహాలే వ‌చ్చాయి. అయితే ఎన్నిక‌ల్లో మాత్రం చింత‌మ‌నేని ప్రభాక‌ర్ స‌త్తా చాటాడు. త‌న ప‌ట్టు నిలుపుకున్నాడు. దెందులూరు కోట పునాదులు క‌ద‌ల‌కుండా కాపాడుకున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కూడా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వార్ పూర్తిగా వ‌న్ సైడ్ అయినా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు కీల‌క పంచాయ‌తీల్లో టీడీపీ పాగా వేసింది.

ఎక్కువ పంచాయతీలు…

చింత‌మ‌నేని ప్రభాక‌ర్ కు, అబ్బయ్య చౌద‌రికి సొంత మండ‌లం అయిన పెద‌వేగిలో మేజ‌ర్ పంచాయ‌తీలు అన్ని టీడీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. మండ‌ల కేంద్రాలు అయిన పెద‌వేగి, దెందులూరుతో పాటు కీల‌క పంచాయ‌తీలు అయిన వేగివాడ‌, మొండూరు, టీ గోక‌వ‌రం, రామ‌చంద్రాపురం, రామ‌సింగ‌వ‌రం, కొవ్వలి, బాపిరాజు గూడెం, కొప్పాక‌, గాలాయ‌గూడెం, గంగ‌న్నగూడెం, జోగ‌న్నపాలెం, టీ క‌న్నాపురం లాంటి కీల‌క పంచాయ‌తీలు టీడీపీ కైవ‌సం చేసుకుంది. ఓవ‌రాల్ లెక్కల ప్రకారం వైసీపీ ఖాతాలో ఎక్కువ పంచాయ‌తీలు క‌న‌ప‌డుతున్నా… అందులో న్యూట్రల్ గా గెలిచిన స‌ర్పంచ్‌లు కూడా ఉన్నారు.

మరింత స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్….

వైసీపీ సానుభూతిరులు చిన్న చిన్న పంచాయ‌తీలు గెలిస్తే… టీడీపీ పెద్ద పంచాయ‌తీలు.. దెందులూరు రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పే పంచాయ‌తీల్లో పాగా వేసింది. ఈ విజ‌యాలు దెందులూరు టీడీపీ శ్రేణుల్లోనే కాకుండా… ఓవ‌రాల్‌గా ప‌శ్చిమ గోదావ‌రిలో దెందులూరుతో అనుసంధానమై ఉండే మెట్ట ప్రాంతంలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల పార్టీ కేడ‌ర్లో కూడా ఆత్మస్థైర్యాన్ని నింపాయి. చింత‌మ‌నేని ప్రభాక‌ర్ ఇప్పటికే జైలులో ఉండి రావ‌డంతో పాటు తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్రచారంలో ఉన్న చింత‌మ‌నేని ప్రభాక‌ర్ ను అరెస్టు చేయ‌డం కూడా టీడీపీకి క‌లిసొచ్చింది. జిల్లాలోనే టీడీపీ ఈ రేంజ్‌లో పుంజుకున్న నియోజ‌క‌వ‌ర్గం ఏదీ లేదు. ఇక నియోజ‌క‌వ‌ర్గ జ‌నాలు గ‌త ప‌దేళ్లలో జ‌రిగిన అభివృద్ధిని.. ఈ రెండేళ్లలో జ‌రిగిన అభివృద్ధిని కూడా కంపేరిజ‌న్ చేసుకుంటున్నారు. చింత‌మ‌నేని ప్రభాక‌ర్ ఈ ప‌ట్టును ఇలాగే కొనసాగిస్తే వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి టీడీపీ మ‌రింత స్ట్రాంగ్ అవ్వడం ఖాయం.

Tags:    

Similar News