వారసుడు సరైనోడు కాకపోతే ఇంతే?

ప్రాంతీయపార్టీలు ఎంతకాలమో మనుగడ సాగించలేవు. పార్టీ వ్యవస్థాపకుడు తదనంతరం పార్టీని నడిపే వారిపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా అంతే. తమిళనాడులో కరుణానిధి [more]

;

Update: 2021-06-24 16:30 GMT

ప్రాంతీయపార్టీలు ఎంతకాలమో మనుగడ సాగించలేవు. పార్టీ వ్యవస్థాపకుడు తదనంతరం పార్టీని నడిపే వారిపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా అంతే. తమిళనాడులో కరుణానిధి తర్వాత స్టాలిన్ డీఎంకేను అధికారంలోకి తెచ్చారు. అలాగే బీహార్ లో ఆర్జేడీ గత ఎన్నికల్లో ఓటమి పాలయినా మెరుగైన ఫలితాలను సాధించారు. జార్ఖండ్ లో హేమంత్ సోరెన తన పార్టీని అధికారంలోకి తేగలిగారు. వారసులు సరైనోళ్లయితే ప్రాంతీయ పార్టీల మనుగడ ఉంటుంది. ఇందుకు ఉదాహరణ లోక్ జన్ శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్.

పాశ్వాన్ ఉన్నంత కాలం….

లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ జీవించి ఉన్నంత కాలం ఆ పార్టీకి అంతో ఇంతో క్రేజ్ ఉండేది. ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడల్లా రామ్ విలాస్ పాశ్వాన్ కేంద్రమంత్రిగా ఉండేవారు. దళిత నేతగా ఆయనకు జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యత ఉండేది. రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ పార్టీ బాధ్యతలను చేపట్టారు. బీహార్ ఎన్నికల్లోనే తప్పటడుగు వేశారు. ఒంటరిగా పోటీ చేసి చేయి కాల్చుకున్నారు.

తొలి అడుగే తప్పటడుగు…

జేడీయూ అధినేత నితీష్ కుమార్ తో విభేదాలు పెంచుకుని చివరకు ఎన్డీఏకు దూరమయ్యారు. ఎన్డీఏలో కొనసాగి ఉంటే కేంద్ర మంత్రి పదవి అయినా చిరాగ్ పాశ్వాన్ కు దక్కేది. ఇక పార్టీని నడపడంలోనూ చిరాగ్ పాశ్వాన్ ఫెయిలయ్యారు. సొంత బాబాయితోనే విభేదాలు పెంచుకున్నారు. లోక్ జనశక్తి పార్టీకి ఆరుగురు ఎంపీలున్నారు. అందులో ఐదుగురు ఎంపీలు వేరు కుంపటి పెట్టుకుని పార్టీ తమదేనంటున్నారు.

సొంత బాబాయి….

చిరాగ్ పాశ్వాన్ బాబాయి పశుపతి పరాస్ ఐదుగురు ఎంపీలతో కలసి పార్టీని చీల్చారు. దీని వెనక నితీష్ కుమార్ ఉన్నారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఐదుగురు ఎంపీలతో పార్టీని నడపలేని చిరాగ్ పాశ్వాన్ వైఫల్యం గురించే ప్రముఖంగా చెప్పుకోవాల్సి ఉంది. తండ్రి వ్యూహాలు కొరవడటం, దూకుడు రాజకీయాలు చిరాగ్ పాశ్వాన్ కు చిక్కులు తెచ్చిపెట్టాయనే చెప్పాలి. రామ్ విలాస్ పాశ్వాన్ ఎల్జేపీని స్థాపించి దశాబ్దాల పాటు పార్టీని సమర్థవంతంగా నడిపితే నెలల్లోనే చిరాగ్ పాశ్వాన్ పార్టీ కనుమరుగయ్యేలా చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News