అందరూ ఎదురు తిరిగే వాళ్లేనా?
అధికారం ఒక్కటే రాదు. దానితో పాటు కొన్ని అవలక్షణాలను కూడా తీసుకొస్తుంది. వాటిల్లో ముఖ్యమైనవి…అసమ్మతి, అసంతప్తి, అభిజాత్యం, అహంకారం. వీటి వల్లే ఎంతో కష్టపడి తెచ్చుకున్న అధికారం [more]
;
అధికారం ఒక్కటే రాదు. దానితో పాటు కొన్ని అవలక్షణాలను కూడా తీసుకొస్తుంది. వాటిల్లో ముఖ్యమైనవి…అసమ్మతి, అసంతప్తి, అభిజాత్యం, అహంకారం. వీటి వల్లే ఎంతో కష్టపడి తెచ్చుకున్న అధికారం [more]
అధికారం ఒక్కటే రాదు. దానితో పాటు కొన్ని అవలక్షణాలను కూడా తీసుకొస్తుంది. వాటిల్లో ముఖ్యమైనవి…అసమ్మతి, అసంతప్తి, అభిజాత్యం, అహంకారం. వీటి వల్లే ఎంతో కష్టపడి తెచ్చుకున్న అధికారం చివరికి పార్టీకి తలనొప్పులు, చికాకులు తెప్పిస్తుంది. అంతిమంగా అధికారం కనుమరుగవుతుంది. సుదీర్ఘకాలం అటు కేంద్రంలో, ఇటు రాష్రాల్లో అధికారంలో కొనసాగిన హస్తం పార్టీకి ఈ ఇబ్బందులు బాగా తెలుసు. వివిధ రాష్టాల్లో ఏర్పడిన అంతర్గత కలహాలను చక్కబెట్టేందుకు గతంలో జి.కె.మూపనార్, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ వంటి ట్రబుల్ షూటర్లు ఉండేవారు. వీరికి ప్రజాబలం పెద్దగా లేనప్పటికీ తెరచాటు వ్యవహారాలను చక్కబెట్టగల నైపుణ్యం ఉండేది. అందుకే వారికి పార్టీలో ప్రాధాన్యం లభించేది.
యోగికి, మోదీకి మధ్య…?
ఇప్పుడు కమలం పార్టీ ఇలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఇటు హస్తినలో, అటు వివిధ రాష్టాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతానికి అయితే నరేంద్ర మోదీ నాయకత్వానికి ఎదురులేదు. కానీ అదే సమయంలో అధికారంలో ఉన్న కీలక రాష్టాల్లో అసమ్మతి గళాలు బలంగానే వినపడుతున్నాయి. కొన్నిచోట్ల అధిష్టానమే అసమ్మతిని పరోక్షంగా ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు లేకపోలేదు. దేశానికి, పార్టీకి కీలకమైన గుండెకాయ వంటి యూపీలో పార్టీ పరిస్థితి సజావుగా లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనితీరుపై మోదీకి భిన్నాభిప్రాయం ఉంది. ఆయనను పదవి నుంచి తొలగించాలన్న యోచన సైతం మోదీకి ఉందని చెబుతున్నారు. మోదీ-యోగి ఎడమొహం పెడమొహం అన్నట్లుగా పరిస్థి ఉంది.ఇటీవల జూన్ 5న యోగి పుట్టినరోజు సందర్భంగా యోగికి మోదీ కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు.
యడ్యూరప్ప విషయంలోనూ….
తాజాగా గతంలో గుజరాత్ లో తన వద్ద పని చేసిన ఐఏఎస్ అధికారిని యూపీ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించడం యోగికి పుండు మీదకారం చల్లినట్లయింది. ఆయనను అప్పటికప్పుడు శాసనమండలికి నామినేట్ చేయించారు. ఇది యోగికి మింగుడుపడని పరిణామమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్షిణాదిన బీజేపీకి గుండెకాయ వంటి కర్ణాటకలోనూ కమలం కష్టాలు ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అధిష్టానం పొగ పెడుతోంది. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు నళిన్ నాయకత్వ మార్పు ఉండదని చెబుతున్నా, సీనియర్ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. సీఎం వ్యతిరేక వర్గానికి బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ మద్దతిస్తున్నారు. దాదాపు 17 శాతం గల లింగాయత్ వర్గానికి నాయకుడైన యడియ్యూరప్పను తొలగించడం అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ హైమాండ్ ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతూనే ఉంది.
మధ్యప్రదేశ్ లోనూ….
అతిపెద్ద రాష్టాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్ పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. హోంమంత్రి సరోత్తం మిశ్రా సీఎంకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మరో మంత్రి వి.డి.శర్మ సైతం ఇదే బాటలో ఉన్నారు. రాష్రానికి చెందిన కేంద్ర మంత్రులు నరేందర్ సింగ్ తోమర్, ధావర్ చంద్ గెహ్లాత్ కూడా సీఎంకు
వ్యతిరేకంగా దిల్లీలో చక్రం తిప్పుతున్నారు.పార్టీ జాతీయ కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ పేరును కొందరు కొత్త సీఎం పదవికి ప్రచారం చేస్తున్నారు. ఇక ఈశాన్య రాష్ర్టమైన త్రిపురలో దశాబ్దాల సీపీఎం పాలనకు చరమగీతం పాడి అధికారం అందుకున్న కమలం పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ పై ఏకంగా ఆరుగురు శాసనభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. మాజీ మంత్రి సుదీప్ రాయ్ బర్మన్ నాయకత్వంలో వీరు హస్తిన వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాను కలిశారు. సీఎం పనితీరుపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దీంతో అక్కడ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ కు బీజేపీ నాయకత్వం అప్పగించింది. వచ్చే ఏడాది ఎన్నికలను ఎదుర్కోనున్న ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలోనూ బీజేపీ పరిస్థితి పైకి అనుకున్నంతగా గొప్పగా ఏమీ లేదు. అసమ్మతి గళాలు వినపడుతూనే ఉన్నాయి. ఇవి కమలనాథులకు కంటిమీద కునుకు లేకుండా చేయిస్తున్నాయి.
– ఎడిటోరియల్ డెస్క్