కాంగ్రెస్ పెద్దలు చేతులెత్తేశారా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి వరుసగా నేతలు జారిపోతున్నారు. మొదట ఇద్దరు ఎమ్మెల్సీలు [more]

;

Update: 2019-03-09 03:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి వరుసగా నేతలు జారిపోతున్నారు. మొదట ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ మారి ఏకంగా పార్టీ శాసనమండలి పక్షాన్నే టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మరోసారి ఫిరాయింపులు ప్రారంభమయ్యాయి. అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రేగా కాంతారావు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పుడు తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సైతం పార్టీని వీడుతున్నారు. ఆయన 10వ తేదీన టీఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసి మూడు నెలలు కాకముందే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో లోపం ఎవరిది ? నాయకత్వం వలసలను ఎందుకు ఆపలేకపోతోంది ? అనే చర్చ జరుగుతోంది.

ఇప్పటికే అనుభవం ఉన్నా…

పార్టీ ఫిరాయింపులు ఈసారి కొత్తేమీ కాదు. గత అసెంబ్లీలోనూ పార్టీ ఫిరాయింపులు పెద్ద ఎత్తున జరిగాయి. అన్ని పార్టీల నుంచీ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే జరిగింది. 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకున్న అధికార పార్టీలు వారిని తమ వైపు తిప్పుకుంటున్నాయి. కేసులు ఉన్నవారు, నియోజకవర్గంలో గడ్డు పరిస్థితి అన్నవారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు, పదవిపై హామీ ఉన్నవారు సహజంగా పార్టీ మారటం చూస్తున్నాం. ఈ విషయం అన్ని పార్టీలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అనుభవం కూడా అయ్యింది.

ఫిరాయింపులు ఆపే వారే లేరా..?

గతసారే ఈ విషయంలో దెబ్బతిన్న తెలంగాణ కాంగ్రెస్ అనుభవం నుంచి ఎటువంటి పాఠాలూ నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. పార్టీ ఫిరాయించకుండా ఎమ్మెల్యేలను నాయకత్వం కాపాడుకోలేకపోతోంది. ఎవరు పార్టీ మారే అవకాశం ఉందో గుర్తించి ముందే వారిలో భరోసా కల్పించకలోపోతోంది. ఈ విషయంలో పూర్తిగా రాష్ట్ర నాయకత్వం వైఫల్యం చెందిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఐదేళ్లుగా ఫిరాయింపుల తంతు జరుగుతున్నా పీసీసీ పెద్దలు నామమాత్రంగా సమీక్ష చేయడం తప్ప కారణాలను విశ్లేషించుకొని ఫిరాయింపులను నిలువరించే ప్రయత్నం మాత్రం జరగలేదు. ప్రాంతీయ పార్టీ నుంచి వలసలు పోతున్నారని తెలిస్తే ఆ పార్టీ అధినేత స్వయంగా అయినా, మధ్యవర్తులను పంపించి అయినా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదు. ఇండే వారు ఉంటారు, పోయేవారు పోతారు, మేమేమి చేయగలం అన్నట్లుగా ఉంది పీసీసీ పెద్దల పరిస్థితి. మరి, ఇప్పటికైనా ఈ వలసలను కంట్రోల్ చేసుకోకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ఉందా అంటే ఉంది అన్నట్లు తయారయ్యే పరిస్థితి రావడానికి ఎంతో సమయం పట్టేలా లేదు.

Tags:    

Similar News