ప్రభుత్వాలకు సిగ్గు చేటు…?

తాము కోరుకున్న చోట వైద్య వసతి పొందలేకపోవడం ప్రాథమిక హక్కుల నిరాకరణే. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కరోనా రోగులను హైదరాబాద్ కు అనుమతించకపోవడం, హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి [more]

Update: 2021-05-16 15:30 GMT

తాము కోరుకున్న చోట వైద్య వసతి పొందలేకపోవడం ప్రాథమిక హక్కుల నిరాకరణే. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కరోనా రోగులను హైదరాబాద్ కు అనుమతించకపోవడం, హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి రావడం ప్రభుత్వాలు తల దించుకోవాల్సిన పరిణామం. ఈ చర్యకు పూనుకున్న తెలంగాణ ప్రభుత్వం, తన ప్రజలకు మౌలిక వసతులు కల్పించలేకపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్రాలను సమన్యయం చేయకుండా గాలికి వదిలేసిన కేంద్ర ప్రభుత్వం మూడింటికీ సిగ్గు చేటు ఈ పరిణామం. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు రాజ్యాంగస్ఫూర్తిని తుంగలో తొక్కేశారు. సొంత రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లైనా వైద్య వసతులు మెరుగు పరుచుకోకుండా మీనమేషాలు లెక్కించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. భారతదేశం మొత్తం ఒక యూనిట్ గానే పరిగణనలోకి తీసుకునేలా గైడ్ లైన్స్ ఇవ్వడంలో కేంద్రమూ విఫలమైంది. తాజా పరిణామాలు ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాల్సిన ఘట్టాలు.

వివాదాస్పదం.. విభేదాలు..

ప్రభుత్వమంటే రాజకీయ పార్టీలే. తమ ప్రజలకు, తమకు ఓట్టు వేసేవారికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తాయి. రాజ్యాంగం చెప్పిందని చిత్త శుద్ధితో అమలు చేస్తాయనుకోవడం భ్రమే. ఏదో రకంగా సాకు చూపిస్తూ తమ ప్రజల పట్ల పక్షపాతం చూపించుకోవడం సహజం. పైపెచ్చు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తన్నుమాలిన ధర్మం ప్రదర్శించాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ధనిక వర్గాలకు చెందిన కొందరు కార్పొరేట్ వైద్యం హైదరాబాద్ లో బాగుంటుందనే భావనతో ఎగబడుతున్నారు. ఆయా సంస్థల్లో ఉన్న సత్సంబంధాలు, తమ పలుకుబడితో హెచ్చు మొత్తాల్లో చెల్లించి పడకలను సైతం రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇది నిజంగానే తెలంగాణ లోని ప్రజలకు ఇబ్బందికరం. అయితే ఈ వివాదం ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు. పునర్విభజన చట్టం ప్రకారం 2024 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పరిగణనలో ఉంటుంది. అమరావతిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ సచివాలయంలోని 70శాతం పైగా ఉద్యోగులు తమ మకాం ఆంధ్రప్రదేశ్ కు మార్చలేదు. కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వమూ ఒత్తిడి చేయడం లేదు. ఇప్పటికే రెండు రాస్ట్రాల మధ్య జలవనరులు, ఆస్తుల పంపకం వంటి వివాదాలున్నాయి. తాజా పరిణామాలు మొత్తం వ్యవహారాలకు పీట ముడి వేసే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు రాస్ట్రాల ప్రజల్లో సెంటిమెంటు పెరిగితే ప్రాంతీయ పోకడలు ముదురుతాయి.

మౌలిక వసతులు శూన్యం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు. విద్య, వైద్యం విషయంలో స్వయసమృద్ధి సాధించాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మౌలిక వసతులు పెంపొందించుకోవాలి. ఇతర రాష్ట్రాల మీద ఆధారపడటం ప్రజలకు భారంగా మారుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి అటు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లపై ఒత్తిడి పెరిగింది. సొంత రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దిపై దృష్టి పెట్టకుండా ఆరోగ్య శ్రీ వంటి స్కీములను హైదరాబాద్; బెంగుళూరు, చెన్నై వంటి నగరాలకూ విస్తరించింది. ఏపీకి చెందిన ప్రజలు ఆయానగరాల్లో చికిత్సలు తీసుకున్నప్పటికీ ఖర్చులు భరించేలా గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య ఇతర రాస్ట్రాలలోని కార్పొరేట్ ఆసుపత్రులకు నిధులను దోచిపెట్టడమే. ఇంతటి బాధ్యతారహితమైన నిర్ణయం కారణంగానే ప్రస్తుత పరిస్తితి ఉత్పన్నమవుతోంది. కరోనా వంటి తీవ్ర సంకట స్థితిలో పొరుగు రాష్ట్రాలు కాదంటే దీనంగా ఎదురుచూడాల్సి వస్తోంది. న్యాయస్థానాల ముందు చేతులు జోడించి ప్రార్థించాల్సి వస్తోంది. అయిదు కోట్ల జనాభాతో కూడిన రాష్ట్రం ఆధునిక వైద్య వసతులు కల్పించుకోకుండా సంక్షేమ పథకాల సంతర్పణతోనే సంతృప్తి పడిపోతే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో మేలుకొని తన కాళ్లపై తాను నిలబడటానికి ప్రయత్నించాలి. పొరుగు రాష్ట్రాల దయాదాక్షిణ్యాలకు తన ప్రజల ప్రాణాలను బలిపెట్టకూడదు.

రాజ్యాంగం చెప్పినా..

రాజ్యాంగం లో ఏమి చెప్పినా దానిని అమలు చేసేవారిపైన ఆధారపడి మాత్రమే ఫలితాలుంటాయని అంబేద్కర్ తొలి రోజుల్లోనే చెప్పారు. రాజకీయ పార్టీలు ఓట్ల స్వార్థంతోనే ప్రతి అంశాన్ని చూస్తుంటాయి. రాజ్యాంగం ఏమి చెబుతోంది? పొరుగు వాళ్లు ఏమనుకుంటారనేది పార్టీలకు అనవసరం. తనను అధికారంలోకి తెచ్చే ఓటర్లు ఏమనుకుంటున్నారనేదే ఆయా పార్టీలకు ముఖ్యం. తన ప్రజల్లో సానుకూలత ఉంటుందని భావిస్తే ఎంతవరకైనా ప్రభుత్వాలు తెగిస్తాయి. గతంలో నీటి ఉద్యమాల విషయంలో సుప్రీం కోర్టు తీర్పులను సైతం ఉల్లంఘించేందుకు ప్రభుత్వాలు తెగించాయి. మతపరమైన విషయాల్లోనూ కోర్టుల తీర్పులు అమలు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రజలలో తమ పరపతి పెంచుకోవాలనే దురుద్దేశమే. కరోనా రోగుల వాహనాలు హైదరాబాద్ రాకుండా నిరోధిస్తే ఏపీ ప్రజల్లో కోపం వస్తుంది. కానీ తెలంగాణ ప్రజల్లో సానుకూలత ఉంటుంది. ప్రభుత్వానికి కావాల్సింది అదే. అందువల్ల హైకోర్టు చెప్పిందని తాత్కాలికంగా అనుమతించినా మళ్లీ ఏవో అడ్డంకులు సష్టించరని గ్యారంటీ లేదు. దీనికి పరిష్కారం రాస్ట్రాల వారీగా వైద్య వసతుల అభివద్ధి, ఇటువంటి క్లిష్లసమయంలో కార్పొరేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాలే పర్యవేక్షణ వహించాలి. డబ్బున్న వారికి మాత్రమే మెరుగైన వైద్యం అందే దుస్థితికి అప్పుడే కళ్లెం పడుతుంది. కార్పొరేట్ ఆసుపత్రులు కేవలం ధనికుల కోసమేనన్న భావన తొలగిపోతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News