దగ్గుబాటి మళ్లీ దగ్గరవుతున్నారా?

దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నారా? వైసీపీలో తిరిగి యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. పర్చూరు నియోజకవర్గానికి ఆమంచి కృష్ణమోహన్ ను ఇన్ ఛార్జిగా [more]

;

Update: 2021-03-11 05:00 GMT

దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నారా? వైసీపీలో తిరిగి యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. పర్చూరు నియోజకవర్గానికి ఆమంచి కృష్ణమోహన్ ను ఇన్ ఛార్జిగా పంపాలని వైసీపీ భావించింది. ఆయనతో చర్చలు జరిపింది. కానీ ఆమంచి అందుకు అంగీకరించలేదు. అయితే ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరిగి వైసీపీలో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. తాను కాకుండా తన కుమారుడు హితేష్ చెంచురామ్ కు ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోరనున్నారని తెలుస్తోంది.

ఓటమి పాలయిన తర్వాత…..

దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019 ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమికి స్వయంకృతాపరాధమే. ప్రచారం సరిగా నిర్వహించక పోవడం, అతి విశ్వాసం దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొంపముంచిదనడం ఖాయం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలిచి ఉంటే ఖచ్చితంగా స్పీకర్ అయ్యేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఓటమి తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు పూర్తిగా సైలెంట్ అయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

బీజేపీకి సీన్ లేకపోవడంతో…..

కానీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేష్ చెంచురామ్ భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారట. తన సతీమణి బీజేపీలో జాతీయ స్థాయి నేతగా ఉన్నప్పటికీ ఆ పార్టీ ఏపీలో భవిష‌్యత్ లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణతో ఉన్న కాస్త ఆశలూ అడుగంటాయి. దీంతో పురంద్రీశ్వరికి కేంద్రంలో ఏదో ఒక పదవి వచ్చినా, తన కుమారుడి భవిష‌్యత్ పైనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు బెంగ పట్టుకుంది.

తన డైరెక్షన్ లోనే….

తాను సహాయ సహకారాలు, డైరెక్షన్ అందిస్తానని, తన కుమారుడు హితేష్ చెంచురామ్ ను వైసీపీ ఇన్ ఛార్జిగా పర్చూరు నియోజకవర్గానికి నియమించాలని జిల్లా మంత్రి ద్వారా వైసీపీ అధినాయకత్వానికి రాయబారం పంపినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నా హితేష్ చెంచురామ్ కు అమెరికా పౌరసత్వం అడ్డంకిగా మారింది. ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడటంతో వచ్చే ఎన్నికల్లో పర్చూరు నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉవ్విళ్లూరుతున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం దగ్గుబాటి వెంకటేశ్వరరావు మొర ఆలకిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News