బాబుకు మళ్లీ ఊపిరి పోస్తున్నారా..?

రాజకీయ పార్టీలు స్వయంకృతాపరాధాలతోనే కొంప కొల్లేరు చేసుకుంటాయి. నాయకులూ అంతే. అందుకే రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే అంటుంటారు. దీనికి ఎవరూ అతీతం కాదు. జగన్ మోహన్ రెడ్డి [more]

;

Update: 2021-03-19 15:30 GMT

రాజకీయ పార్టీలు స్వయంకృతాపరాధాలతోనే కొంప కొల్లేరు చేసుకుంటాయి. నాయకులూ అంతే. అందుకే రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే అంటుంటారు. దీనికి ఎవరూ అతీతం కాదు. జగన్ మోహన్ రెడ్డి పదేళ్లనాడు కాంగ్రెసులోనే కొంత వేచి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు. ఈనాటి కేసులు, కేంద్రం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితులు ఉండేవి కాదు. చంద్రబాబు నాయుడు బీజేపీని దూరం చేసుకోకుండా సంయమనం పాటించి ఉంటే ఇంతటి దయనీయమైన నేటి పరిస్థితులు ఉండేవి కాదు. పవన్ కల్యాణ్ తన సొంతబలం తెలుసుకుని ప్రధాన పార్టీలతో తొలి నుంచి జట్టు విడిచిపెట్టకుండా ఉంటే ఈపాటికే రాష్ట్రంలో ఒక ప్రధానమైన శక్తిగా ఆవిర్భవించి ఉండేవారు. నేతలు తమ బలాన్ని అతిగా అంచనా వేసుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి చెడ్డలు బేరీజు వేసుకోవడంలో పొరబడుతుంటారు. చాన్సు దొరికింది కదా అని ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాలని చూస్తారు. ఫలితంగా ప్రజా మద్దతు కోల్పోతారు. ప్రత్యర్థికి సానుభూతి వచ్చేలా చేజేతులారా అవకాశం కల్పిస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామమిదే. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసులు న్యాయసమీక్షకు నిలుస్తాయో లేదో తెలియదు. కానీ ప్రభుత్వ అత్యుత్సాహాన్ని చాటి చెబుతున్నాయి.

కక్ష సాధింపు కరెక్టేనా..?

అమరావతి రాజధానిని తరలించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. దానికి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. 29 గ్రామాల్లో ఆందోళన సాగుతోంది. నిజంగానే వికేంద్రీకరణ లక్ష్యంతో సర్కారు ముందుకు వెళ్లాలని ఆశిస్తే చకచకా నిర్ణయాలు తీసుకోవాలి. న్యాయపరమైన అవరోధాలు అధిగమిస్తూ కార్యాచరణలోకి దిగిపోవాలి. మరో మూడేళ్లు మాత్రమే సమయం ఉంది. మూడు రాజధానుల కలను సాకారం చేసి ప్రజలకు ఫలితాలను అందివ్వాలి. అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. అమరావతిని ప్రజారాజధానిగా అభివర్ణించిన చంద్రబాబు నాయుడు ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. గ్రాఫిక్ డిజైన్లతో స్వర్గాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ప్రజలను కలల్లో తేలియాడించాలనుకున్నారు. ఒక శాశ్వత నిర్మాణం కానీ, ఐకానిక్ భవనం కానీ నిర్మించలేదు. దాంతో ప్రజలు చంద్రబాబు పై విశ్వాసం కోల్పోయారు. జగన్ ను గెలిపించారు. ఇప్పుడు మూడు రాజధానులంటూ జగన్ మరో కల కంటున్నారు. దానిని సాకారం చేయకపోతే చంద్రబాబు తరహాలోనే ప్రజావిశ్వాసం దెబ్బతింటుంది. సమర్థుడైన నాయకుడు తాను చేయదలచుకున్న పనిపై దృష్టి పెట్టాలి. గతంలో జరిగి పోయిన పనులను నిరంతరం తవ్వి పోయడం అనవసరం. చంద్రబాబు నాయుడిపై కక్ష సాధింపునకు దిగడం అవివేకం.

బాబుకు సానుభూతి పుడుతుంది..

అధికార పార్టీ శృతి మించి వ్యవహరిస్తే ప్రజలు ప్రతిపక్షం పట్ల సానుభూతి పెంచుకుంటారు. గతంలో జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెసు, తెలుగుదేశం న్యాయస్థానాల వ్యాజ్యాలతో ఇబ్బంది పెట్టాలని చూశాయి. ఫలితంగా జగన్ కు ప్రజల్లో ఎనలేని క్రేజ్ వచ్చింది. సింపతీ వెల్లువెత్తింది. అధికారానికి బాటలు పరిచింది. వైసీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని జగన్ మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయాలని చంద్రబాబు యోచించారు. ఫలితం ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. కొన్ని నిర్ణయాల మంచి చెడ్డలను ప్రజలకు వదిలేయాలి. చట్టం చేతిలో ఉంది కదా అని చర్యలకు దిగితే అది రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడికి ప్రజల్లో రాజకీయ స్వార్థపరుడనే నెగటివ్ ముద్రతో పాటు ఒక రకమైన పాజిటివ్ ఇమేజ్ కూడా ఉంది. దూరదృష్టి కలిగిన నేతగా ఆయనకు మంచి మార్కులే పడుతుంటాయి. 2014లో జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో ఎంతో పలుకుబడి ఉంది. గెలవాల్సిన సందర్భమే. అయినప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ను ఒక దారికి తెచ్చేందుకు అనుభవజ్ణుడైన చంద్రబాబు అవసరమని ప్రజలు విశ్వసించారు. అందుకే జగన్ ను కాదని , చంద్రబాబుకు అధికారం అప్పగించారు. ఆ స్థాయి నాయకుడి పట్ల ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోందనే భావన కలిగితే వైసీపీకే నష్టం. రాజకీయ పార్టీగా మేలు చేయదు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు డీలా పడ్డాయి. నైతిక స్థైర్యం దెబ్బతింది. కొంతకాలం పాటు మౌనాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. ఆ స్తబ్ధత నుంచి ప్రభుత్వమే బయటపడేస్తోంది. మళ్లీ సర్కారుపై పోరాటానికి ప్రతిపక్ష నేతపై కేసులు ఆస్కారం కలిగిస్తున్నాయి.

బలం తగ్గిపోలేదు..

తాడిపత్రిని మినహాయించి,మొత్తం నగరపాలక, పురపాలక సంస్థలన్నిటిలోనూ అధికారపార్టీ విజయం సాధించడం చరిత్రాత్మకమే. అంతమాత్రాన ప్రతిపక్షాల పని అయిపోయిందనుకోలేం. లభించిన ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే తెలుగుదేశం పట్టణాల్లో తన స్థిర ఓటు బ్యాంకును కాపాడుకుందనే చెప్పాలి. అధికార పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో 51 శాతం ఓట్లు సాధించింది. ప్రస్తుతం మరో ఒకటిన్నర శాతం ఓట్లను మాత్రం పెంచుకోగలిగింది. అధికారంలో ఉండటం వల్ల అడ్వాంటేజ్ కు తోడు సామదాన భేద దండోపాయాలు ఎలాగూ ఉంటాయి. అందువల్ల పది శాతం వరకూ జనరల్ ఓటింగులో తేడా వస్తుందని అంచనా. తెలుగుదేశం పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో 39 శాతం ఓట్లు తెచ్చుకుంటే ఇప్పుడు 30 శాతానికి పరిమితమైంది. తొమ్మిది శాతం ఓట్లు కోల్పోయింది. అప్పట్లో అధికారంలో ఉన్న కారణంగా పసుపు కుంకుమ, ఇతర ప్రలోభాలతో పది పన్నెండు శాతం ఓటింగును తనకు అనుకూలంగా మలచుకున్నట్లుగా ఒక అనధికార అంచనా. నిజానికి టీడీపికి శాశ్వత ఓటు బ్యాంకు గడచిన 20 ఏళ్లలో 25 నుంచి 28 శాతం మాత్రమే. మిగిలినవి పరిస్థితులు కారణంగా ఇతర పార్టీల మద్దతు, న్యూట్రల్, స్వింగ్ ఓటర్ల మార్పుతో లభిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే అధికారపార్టీ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా టీడీపీ తన ఓటు బ్యాంకును ఈ సారి కూడా నిలుపుకోగలిగింది. అదే విధంగా జనసేన, బీజేపీ శాసనసభ ఎన్నికల్లో తమకు లభించిన ఏడు శాతం ఓటింగును కలిసికట్టుగా నిలుపుకున్నాయి. జనసేనకు 4.5 శాతం, బీజేపీకి 2.5 శాతం వరకూ లభించాయి. మొత్తమ్మీద చూస్తే వైసీపీ పీక్ స్థాయి పర్ పామెన్స్ చూపగలిగింది. ఇది ఇక తగ్గడమే తప్ప పెరగడం ఉండదు. సాధారణ ఎన్నికల నాటికి ప్రతిపక్షాలు ఇంకా పుంజుకునే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారపార్టీ పాలననే ప్రధాన కర్తవ్యంగా తీసుకుంటూ ముందడుగు వేయడం మంచిది. చిల్లరమల్లర వ్యవహారాలతో ప్రతిపక్షాలకు అవనసర ప్రచారం కల్పించడం రాజకీయ నష్టాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News