నేపాల్ లో ప్రజాస్వామ్యం నవ్వుల పాలేనా?
రాచరికం నుంచి గణతంత్రంలోకి అడుగుపెట్టినా హిమాలయ పర్వత రాజ్యం నేపాల్ లో ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవడం లేదు. రాజకీయ నాయకుల చేతిలో ప్రజాతంత్రం నవ్వులపాలవుతోంది. నాయకుల స్వార్థ చర్యల [more]
;
రాచరికం నుంచి గణతంత్రంలోకి అడుగుపెట్టినా హిమాలయ పర్వత రాజ్యం నేపాల్ లో ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవడం లేదు. రాజకీయ నాయకుల చేతిలో ప్రజాతంత్రం నవ్వులపాలవుతోంది. నాయకుల స్వార్థ చర్యల [more]
రాచరికం నుంచి గణతంత్రంలోకి అడుగుపెట్టినా హిమాలయ పర్వత రాజ్యం నేపాల్ లో ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవడం లేదు. రాజకీయ నాయకుల చేతిలో ప్రజాతంత్రం నవ్వులపాలవుతోంది. నాయకుల స్వార్థ చర్యల కారణంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. ప్రజాతంత్రం ప్రారంభమైన 2008 నుంచి 2017 వరకు పది మంది ప్రధాన మంత్రులు మారడమే ఇందుకు నిదర్శనం. చట్టసభ, ప్రధాని పదవీకాలం అయిదేళ్లయినా ఏ ఒక్క చట్టసభ, ఏ ప్రధానీ అయిదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేయకపోవడం అక్కడి రాజకీయ సంక్షోభానికి నిదర్శనం.
పార్లమెంటును రద్దు చేసి….
తాజాగా ప్రధాని ఖడ్డ ప్రసాద్ శర్మ ఓలీ పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడం హిమాలయ పర్వత రాజ్యంలో కొనాసాగుతున్న రాజకీయ క్రీడకు అద్దం పడుతుంది. ప్రధాని ఓలీ, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని పుష్ప కమాల్ దహల్ అలియాస్ ప్రచండ అధికారం కోసం జరుపుతున్న పోరాటం ఫలితమే పార్లమెంటు రద్దు నిర్ణయం. హిమాలయ పర్వత రాజ్యమైన నేపాల్ లో మొదటినుంచీ రాచరికం కొనసాగుతోంది. రాచరికాన్ని రద్దు చేసేందుకు మావోయిస్టు నాయకుడైనప్రచండ సుదీర్ఘ కాలం పోరాడారు. చివరకు నాడు భారత్ మధ్యవర్తిత్వంతో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఓటేశారు. నాటి భారత ప్రధాని సూచన మేరకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖట్మాండు వెళ్లి ఇరుపక్షాలతో చర్చలు జరిపారు.ఫలితంగా రాచరికానికి మంగళం పాడారు.
ఒప్పందం ప్రకారం…..
గణతంత్రం ప్రారంభమైంది. తొలి ప్రధానిగా ప్రచండ అధికార పగ్గాలు చేపట్టారు. కాలక్రమంలో అధికార క్రీడలో భాగంగా ఏ ఒక్క ప్రధాని పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు. ప్రస్తుతం ఓలీ పరిస్థితీ ఇదే. 2017లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓలీ నాయకత్వంలోని పార్టీ విజయం సాధించింది. తరవాత రోజుల్లో 2018లో ఓలీ సారథ్యంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యుఎంఎల్- యూనిఫైడ్ మార్క్సిస్టు లెనినిస్టు), ప్రచండ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) విలీనమై నేపాల్ కమ్యూనిస్టు పార్టీగా ఆవిర్భవించాయి. ఈ రెండూ భారత వ్యతిరేక పార్టీలు. చైనా సూచన మేరకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. అప్పట్లో అధికారాన్ని చెరి కొద్దికాలం పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. కాలక్రమంలో ఈ ఒప్పందానికితూట్లు పొడవటం మొదలుపెట్టారు. దీంతో ఓలీ అవినీతికి పాల్పడుతున్నారని, ఆయన పదవి నుంచి దిగిపోవాలని ప్రచండ వర్గం డిమాండ్చేస్తూ వచ్చింది. దీనిని ఓలీ తిరస్కరిస్తూ వస్తున్నారు. చివరకు ఓలీ మంత్రివర్గంలోని ప్రచండ వర్గీయులైన ఏడుగురు మంత్రులు రాజీనామా చేశారు.
ఓలీ సిఫార్సుతో….
దీంతో ప్రచండతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న ఓలీ పార్లమెంటు రద్దుకు సిఫార్సు చేశారు. దీనిని రాష్ర్టపతి విద్యాదేవి భండారీ ఆమోదించి రెండు దఫాలుగా ఎన్నికల నిర్వహణకు ప్రకటన చేశారు. ఏప్రిల్ 30న తొలిదశ, మే 10న మలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై ప్రచండ వర్గం మండిపడుతోంది. అధికార పార్టీలోని ఓ వర్గం కూడా తప్పు పడుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్ సైతం నిరసించింది. పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పుడు రద్దు చేయడాన్ని రాజ్యంగం అనుమతించదని, ఈ నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయవచ్చని న్యాయ, రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఓలీకే అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉందని మరికొందరు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అందరూ న్యాయస్థానం వైపు చూస్తున్నారు. మున్ముందు ఏమి జరుగుతుందో చూడాలి మరి.
-ఎడిటోరియల్ డెస్క్