కాలక్షేపం చేయడమేనా?

డీఎల్ రవీంద్రారెడ్డి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. తాను పార్టీల వద్దకు వెళ్లకూడదని, పార్టీలే తన వద్దకు వస్తాయని డీఎల్ రవీంద్రారెడ్డి భ్రమించారు. ఆరుసార్లు మైదుకూరు [more]

Update: 2019-10-13 14:30 GMT

డీఎల్ రవీంద్రారెడ్డి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. తాను పార్టీల వద్దకు వెళ్లకూడదని, పార్టీలే తన వద్దకు వస్తాయని డీఎల్ రవీంద్రారెడ్డి భ్రమించారు. ఆరుసార్లు మైదుకూరు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం డీఎల్ రవీంద్రారెడ్డిది. ఆయను అనుభవాన్ని ఏ పార్టీ అయినా ఉపయోగించుకోవాలని చూస్తుంది. అలాగే ఆయనకున్న క్యాడర్ కూడా బలమైనదే. కానీ డీఎల్ రవీంద్రారెడ్డికి కాలం కలసి రావడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014లోనూ ఏ పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు.

కాంగ్రెస్ లోనే ఉండి…..

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించరని తెలిసి కూడా దాదాపు ఐదేళ్లు ఆ పార్టీలో్నే కాలక్షేపం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా డీఎల్ రవీంద్రారెడ్డి 2014 నుంచి 2019 వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు లెక్క. ఇక ఐదేళ్ల పాటు మౌనంగానే ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకున్నారు. అదీ నాన్చినాన్చి నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి తనకు మైదుకూరు టిక్కెట్ వస్తుందేమోనని భావించారు. చంద్రబాబునాయుడిని కలిశారు. కానీ పుట్టా సుధాకర్ యాదవ్ ఉండటంతో చంద్రబాబు డీఎల్ కు నో చెప్పారు.

చివరకు వైసీపీలోకి….

ఇక ఎన్నికలు సమీపిస్తుండంగా వైసీపీ నేతలు అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు కలసి డీఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. వారి కోరిక మేరకు డీఎల్ వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. అధికారంలోకి వస్తే తాను ఖచ్చితంగా పదవి ఇస్తానని జగన్ డీఎల్ రవీంద్రారెడ్డికి మాట ఇచ్చారు. దీంతో రవీంద్రారెడ్డి మైదుకూరులో వైసీపీ విజయానికి కృషి చేశారు. కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఎన్నికలకు ముందు వైసీపీలో అనేక మంది నేతలు చేరారు. వారిలో ఒకరిగా డీఎల్ రవీంద్రారెడ్డి మిగిలిపోయారు.

అన్నీ అడ్డంకులే…..

డీఎల్ రవీంద్రారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్నా ఇటీవలే జగన్ చల్లా రామకృష్ణారెడ్డి సీమ కోటాలో ఇచ్చేశారు. రెడ్డి సామాజికవర్గం నుంచి ఇక ఇప్పట్లో పదవులు జగన్ ఇవ్వనట్లే. ముఖ్యంగా కడప జిల్లాలో పదవులు ఇవ్వాల్సిన జాబితా చాంతాండంత ఉంది. అనేక మంది నేతలు జగన్ పై ఇప్పటికే ఆశలు పెంచుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో డీఎల్ రవీంద్రారెడ్డికి ముఖ్యమైన పదవి వచ్చే అవకాశం లేనట్లే కన్పిస్తుంది. మొత్తం మీద సీనియర్ నేతను జగన్ ఇప్పట్లో పట్టించుకునే అవకాశాలే కన్పించడం లేదు. అయితే జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న ఏకైక ఆశ డీఎల్ లో ఇంకా మిగిలి ఉండటం విశేషం.

Tags:    

Similar News