మంత్రి అనిపించుకోవాలని తపించినా ….?

ఎంత సమర్ధత ఉన్నా, మరెంత ప్రతిభా పాటవాలు ఉన్నా కూడా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అది లేని నాడు మొత్తం నిష్ప్రయోజనమే అవుతుంది. విశాఖ జిల్లాకు [more]

Update: 2021-06-02 08:00 GMT

ఎంత సమర్ధత ఉన్నా, మరెంత ప్రతిభా పాటవాలు ఉన్నా కూడా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అది లేని నాడు మొత్తం నిష్ప్రయోజనమే అవుతుంది. విశాఖ జిల్లాకు చెందిన ముగ్గురు సీనియర్ నాయకులు ఆ విధంగా మంత్రి పదవి కోసం జీవితలమంతా పరితపించి చివరికి తనువులు విడిచారు కానీ కోరికను ఈడేర్చుకోలేకపోయారు. వారంతా ఒకే గూటి పక్షులు. ఒకానొక సమయంలో ఒకే పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారు. వారే దివంతరులైన ద్రోణంరాజు సత్యనారాయణ, శ్రీనివాస్, సబ్బం హరి.

అన్నీ చేతిలో ఉండి…?

ఉత్తరాంధ్ర కాంగ్రెస్ కి పెద్దాయనగా చెప్పుకునే ద్రోణంరాజు సత్యనారాయణకు అన్నీ అర చేతిలోనే ఉన్నాయి. ఆయనే చాలా మందిని మంత్రులుగా చేశారు. అనేక మంది శిష్యులను అమాత్య కుర్చీలో చూసి ఆనందించారు. తాను మాత్రం ఆ కుర్చీ ఎక్కడానికి ఎపుడు తాపత్రయపడినా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ వచ్చింది. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా. ఒకసారి లోక్ సభ సభ్యుడిగా ద్రోణం రాజు పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఉన్న టైమ్ లో పీవీ నరసింహారావు ప్రధాని. ఆయనతో ద్రోణంరాజుకు ఎంతో చనువు. కేంద్ర క్యాబినేట్ విస్తరణ ఎపుడు జరిగినా ఆయనకు బెర్త్ ఖాయమని అంతా అనుకునేవారు. కానీ చివరికి వచ్చేసరికి రాజకీయ సామాజిక సమీకర్ణలు ఎవరో అడ్డుపడి ద్రోణంరాజు మంత్రి కాలేకపోయారు. ఇక రాష్ట్ర మంత్రి పదవి కూడా ఆయన్ని అలాగే ఊరించి వెనక్కిపోయింది. రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ రెండు సార్లూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆయన మంత్రి కాలేకపోయారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా 2004లో ద్రోణంరాజుకు మంత్రి పదవి తృటిలో తప్పిపోయింది. ఆ మరుసటి ఏడాది ఆయన ఈ లోకాన్నే వీడారు.

వారసుడికీ బ్యాడ్ లక్ ….

ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ విషయానికి వస్తే అలాగే జరిగింది. 2009లో రెండవసారి వైఎస్సార్ అధికారంలోకి వచ్చినపుడు తమ మొత్తం టెర్మ్ లో ఏదో సమయంలో మంత్రిని చేయాలనుకున్నారు. కానీ ఆయన వెంటనే పోవడంతో శ్రీనివాస్ ఆశ ఆవిరి అయింది. ఆ తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలకు ద్రోణంరాజు ఫ్యామిలీతో మంచి రిలేషన్లు ఉన్నా కూడా మంత్రి పదవిని మాత్రం ఇవ్వలేకపోయారు. ఇక 2019 ఎన్నికల వేళ వైసీపీలో శ్రీనివాస్ చేరారు. జగన్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు, కానీ ఆయన స్వల్ప తేడాతో గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో మంత్రి పదవి చాన్స్ అలా వెనక్కిపోయింది. ఇక గత ఏడాది ఆయన కరోనాతో మృతి చెందారు.

హరి ఆశపడినా…?

ఇక కాంగ్రెస్ లోనే దాదాపు మొత్తం రాజకీయ జీవితాన్ని గడిపిన సబ్బం హరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెండు సార్లూ ఓడిపోయారు. ఆయన 2024 ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, తాను ఎమ్మెల్యే అయితే మంత్రి కావచ్చు అనుకున్నారు. దాని కోసం ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నారు. కానీ ఇంతలోనే కరోనా మహమ్మారి బారిన పడి ఆయన మరణించారు. మొత్తానికి చూస్తే ద్రోణంరాజు సత్యనారాయణ, శ్రీనివాస్, సబ్బం మరి అన్నీ ఉండి కూడా అదృష్టం రివర్స్ గేర్ వేయడంతో అమాత్యులు కాలేకపోయారు అంటున్నారు.

Tags:    

Similar News