పక్కా లోకల్ అంటున్నాడే

విశాఖ జిల్లా రాజకీయాల్లో ద్రోణంరాజు కుటుంబానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఎంతలా అంటే అయిదు దశాబ్దాలుగా రాజకీయం చేస్తోంది ఆ కుటుంబం. స్వాతంత్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాధాన్ని [more]

;

Update: 2019-10-03 12:30 GMT

విశాఖ జిల్లా రాజకీయాల్లో ద్రోణంరాజు కుటుంబానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఎంతలా అంటే అయిదు దశాబ్దాలుగా రాజకీయం చేస్తోంది ఆ కుటుంబం. స్వాతంత్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాధాన్ని లోక్ సభ ఎన్నికల్లో ఓడించడం ద్వారా సింహద్వారం గుండా ఢిల్లీ రాజకీయాల్లోకి ప్రవేశించిన దివంగత ద్రోణంరాజు సత్యనారాయ‌ణ నాలుగు దశాబ్దాల పాటు విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పారు. మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులే కాదు ఏకంగా ప్రధానులతో కూడా సావాసం చేసి తన మార్క్ పాలిటిక్స్ ని సృష్టించుకున్న అరుదైన నేత ద్రోణంరాజు. ఇక ఆయన రాజకీయ వారసుడుగా పాతికేళ్ళుగా జనంలో ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచి అనేక పదవులు చేపట్టిన ఘనత తనయుడు ద్రోణంరాజు శ్రీనివాస్ దక్కించుకున్నారు. సౌమ్యుడు, వివాదరహితుడు అయిన ద్రోణంరాజు శ్రీనివాస్ ఇపుడు వైసీపీలో జగన్ మద్దతు సాధించి విశాఖ మెట్రో రీజియన్ డెవలెప్ మెంట్ అధారిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు.

మంత్రితో విభేదాలు….

ఎన్నికల ముందు ఇద్దరు ఉద్దండులు ఒకేసారి వైసీపీలో చేరారు. ఒకరు అవంతి శ్రీనివాస్. ఆయన భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పట్టేశారు. మరొకరు ద్రోణంరాజు శ్రీనివాస్. ఆయనకు విశాఖ సౌత్ ఎమ్మెల్యే సీటు ఇచ్చినా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా ద్రోణంరాజు శ్రీనివాస్ మీద నమ్మకంతో జగన్ మెచ్చి మరీ కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఇదిలా ఉండగా మంత్రి అవంతికి ద్రోణంరాజు శ్రీనివాస్ కి అసలు పడడంలేదన్నది బహిరంగ రహస్యంగా ఉంది. ఈ ఇద్దరూ కలసినట్లు ఉన్నా లోపల ఒకరి మీద ఒకరికి అనుమానం, ఆగ్రహం ఎక్కువగానే ఉందని అంటారు. అది రుజువు చేస్తూ విశాఖ జరిగిన ఓ మీటింగులో ఇద్దరు నేతలు ఒక్కసారిగా బయటపడిపోయారు. ద్రోణంరాజు శ్రీనివాస్ ని మొదట కవ్వించింది మంత్రి అవంతి అయితే దానికి గట్టిగా బదులిచ్చిన ద్రోణంరాజు శ్రీనివాస్ తాను పక్కా లోకల్ అంటూ చెప్పుకున్నారు. గ్రామాల సమస్యలు ఏవీ ద్రోణంరాజు శ్రీనివాస్ కు తెలియవంటూ మంత్రి అవంతి దెప్పిపొడిస్తే తాను జుత్తాడ గ్రామం నుంచి వచ్చానని, పక్కా లోకల్ అని, విశాఖ జిల్లా రాజకీయాల పట్ల మంత్రి కంటే ఎక్కువ అవగాహన ఉన్నవాడినని గట్టిగా ద్రోణంరాజు శ్రీనివాస్ బదులివ్వడంతో ఇద్దరి మధ్య రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది.

వలసనేత అవంతి…

అవంతి ఎక్కడ నుంచి వచ్చారో ఎవరికీ తెలియదని, ఆయన వ్యాపారం నిమిత్తం విశాఖకు వలస వచ్చారంటూ అదే వేదిక మీదనే ద్రోణంరాజు శ్రీనివాస్ అనడం విశేషం. ఇక ప్రజలకు సేవ చేయాలని, విమర్శలు చేయడం కాదని అంటూ కౌంటర్ ఇచ్చారు. తాను తన కుటుంబం ప్రజల కోసం పనిచేస్తామని, తనకు ఏ పదవి అవసరం లేదని ద్రోణంరాజు శ్రీనివాస్ ఫైర్ అవడంతో వైసీపీలో ఇంతకాలం ఉన్న రాజకీయం ఒక్కసారిగా బయటపడినట్లైంది. జగన్ కి తాను బద్దుడిగా ఉంటానని, పార్టీ కోసం అంతా కలసి పనిచేయాలని సూచించిన ద్రోణంరాజు శ్రీనివాస్ పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలంటూ మంత్రి అవంతికి పరోక్షంగా సూచించడంతో వైసీపీలో వర్గ పోరు ఎటు దారితీస్తుందోనని అంతా కలవరపడుతున్నారు. మొత్తానికి ద్రోణంరాజు శ్రీనివాస్ ని గిల్లడం ద్వారా అవంతి తన టార్గెట్ ఎవరో చెప్పకనే చెప్పేశారు.

Tags:    

Similar News