లోకల్ పాలిటిక్స్ కి తెరపడినట్లేనా ?

విశాఖపట్నం అంటే ఘనమైన నగరంగా చెప్పుకుంటారు. సాంస్కృతికంగానే కాదు, రాజకీయంగా ఎంతో పేరున్న ప్రాంతం ఇది. ఇక్కడ నుంచే ఒక తెన్నేటి విశ్వనాధం జాతీయ రాజకీయాల్లో చక్రం [more]

;

Update: 2020-10-14 03:30 GMT

విశాఖపట్నం అంటే ఘనమైన నగరంగా చెప్పుకుంటారు. సాంస్కృతికంగానే కాదు, రాజకీయంగా ఎంతో పేరున్న ప్రాంతం ఇది. ఇక్కడ నుంచే ఒక తెన్నేటి విశ్వనాధం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. నెహ్రూ, గాంధీల అంతేవాసిగా చరిత్ర పుటలలో కనిపిస్తారు. అలాగే మరో రాజకీయ దిగ్గజం భాట్టం శ్రీరామమూర్తి ఒక సమయంలో జిల్లా రాజకీయాలను శాసించారు. ఆ తరువాత వచ్చిన ద్రోణం రాజు సత్యనారాయణ దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఉత్తరాంధ్రా రాజకీయాలను గుప్పిట పట్టారు. ఆయన వారసుడిగా శ్రీనివాస్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక గుడివాడ అమ్మన్న, మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు వంటి వారు కూడా రాజకీయాల్లో విశాఖ వాణిని బలంగా వినిపించినవారే. ప్రత్యేకించి వీరంతా విశాఖ వాణిని, బాణినీ బలంగా లోకానికి చాటారు. వీరు పక్కా లోకల్స్. వీరు పేరు చెబితే విశాఖ నేల గుర్తుకు వచ్చేది. సిసలైన భూమిపుత్రులుగా నిలిచారు.

ఆయనతో ఆగేనా….?

తాజాగా జరిగిన రాజకీయ విషాదం ద్రోణం రాజు శ్రీనివాస్ అస్తమయం. ఆయన వయసు కూడా చిన్నదే. రాజకీయంగా ఇపుడిపుడే రాటుతేలుతున్న వేళ కరోనా మహమ్మారి కాటేసింది. దాంతో ఇపుడు ఆయన కుటుంబం శోకసంద్రమైంది. అంతే కాదు, ద్రోణం రాజు శకం అంతరించింది అన్న మాట వింటేనే అభిమానులు సైతం ఉలిక్కిపడుతున్నారు. అలా కాకూడదు అని గట్టిగా చెబుతున్నారు. శ్రీనివాస్ ఇటు వైపు తండ్రికి మాత్రమే వారసుడు కాడు ఆయన సతీమణి మాజీ స్పీకర్, రాజకీయ దిగ్గజం అయిన కోన ప్రభకరరావు మనవరాలు. దాంతో కోన వంశం రాజకీయానికి కూడా శ్రీనివాసే వారధి. మరి ఆయన ఇలా ఆకస్మికంగా కన్నుమూయడంతో రాజకీయంగా పెద్ద కుటుంబాల చరిత్ర ముగిసింది అన్న ఆవేదన నగరవాసుల్లో ఉంది.

వారంతా అలాగే…..

విలువలకు పెద్ద పీట వేసే తెన్నేటి విశ్వనాధం తన రాజకీయ వారసులను తయారు చేశారు కానీ కుటుంబం నుంచి ఎవరినీ తీసుకురాలేదు. ఆయన అనుచరులు తరువాత కాలంలో చెట్టుకొకరుగా చెదిరిపోయారు. భాట్టం శ్రీరామమూర్తి విశాఖ నుంచి ఎంపీగా గెలిచిన తరువాత ఎమ్మెల్యేగా 1989లో పోటీ చేసి టీడీపీ వ్యతిరేకతలో ఓటమి చవిచూశారు. ఆ తరువాత ఆయన రాజకీయాల నుంచే విరమించుకున్నారు. ఆయన వారసులు కూడా రాజకీయాల్లోకి రాలేదు. ఇపుడు ద్రోణం రాజు కుటుంబంలో రెండవతరం అస్తమించడంతో విశాఖ మూలాలు తెలిసిన వారు పక్కా లోకల్స్ కి కాలం చెల్లిందని అంటున్నారు.

ఆ భరోసాతోనే ….

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్ శ్రీనివాస్ మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు శ్రీనివాస్ విలువలు, నిజాయతీ బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఎందరో మహామహులు పోటీ పడినా క్యాబినెట్ ర్యాంక్ లాంటి వీఎమ్మార్డీయే చైర్మన్ పదవిని పిలిచి మరీ శ్రీనివాస్ కి కట్టబెట్టారు. ఆయనకు ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. ఇపుడు ఆయన లేకపోవడంతో జగన్ సైతం ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ కుటుంబానికి ఫోన్ చేసి మరీ జగన్ ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీనివాస్ కుమారుడు శ్రీవాత్సవతో మాట్లాడి ఓదార్చారు. దాంతో ద్రోణం రాజు అభిమానుల్లో కొత్త ఆశలు కలుగుతున్నాయి. శ్రీ వాత్సవ్ కి పార్టీలో సముచితమైన స్థానం కల్పించాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్ ని వారు ఇప్పటికే మంత్రుల ముందు కూడా పెట్టారు. ఒకనాడు ద్రోణం రాజు సత్యనారాయణ మరణిస్తే శ్రీనివాస్ ని వైఎస్సార్ చేరదీసి రెండు సార్లు ఎమ్మెల్యేను చేశారు. ఇపుడు అదే కుటుంబంతో విశేష అనుబంధం ఉన్న వైఎస్సార్ వారసుడు జగన్ మూడవ తరాన్ని ముందుకు తీసుకువస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. అది జరిగితేనే విశాఖ రాజకీయాల్లో లోకల్స్ కి కొంత అయినా విలువా మర్యాదా దక్కుతాయని సగటు జనం కూడా అంటున్నారు.

Tags:    

Similar News