విశాఖ మీద మావోల పడగ ?

విశాఖపట్నానికి మరో పేరు సిటీ ఆఫ్ డెస్టినీ. జీవితకాలంలో ఎవరైనా ఒకసారి విశాఖ రావాలనుకుంటారు. విశాఖ అందాలను చూడాలనుకుంటారు. ఇక విశాఖకు అధికారులు ఎవరైనా వస్తే రిటైర్మెంట్ [more]

;

Update: 2020-10-01 00:30 GMT

విశాఖపట్నానికి మరో పేరు సిటీ ఆఫ్ డెస్టినీ. జీవితకాలంలో ఎవరైనా ఒకసారి విశాఖ రావాలనుకుంటారు. విశాఖ అందాలను చూడాలనుకుంటారు. ఇక విశాఖకు అధికారులు ఎవరైనా వస్తే రిటైర్మెంట్ లైఫ్ ఇక్కడే ఉండాలని కొంత స్థలాన్ని కొనుక్కోవడం కూడా జరుగుతుంది. టూరిజం, సినీ, ఐటీ హబ్ గా విశాఖ ఉండడాన్ని అంతా ఆందిస్తారు, అస్వాదిస్తారు. అయితే ఇదంతా ఒక వైపే చెప్పాలి. రెండవవైపు చూసుకుంటే విశాఖలో పేదరికం ఉంది. సిటీ తప్పించి మొత్తం డెబ్బై శాతం జిల్లా అంతా కూడా అభివ్రుద్ధికి నోచుకోని గ్రామీణ‌ వాతావరణం కనిపిస్తుంది. మరో వైపు చూసుకుంటే ఏజెన్సీ విశాఖ జిల్లాలోని తొమ్మిది మండలాల‌ను ఆనుకుని ఉంది. అంటే పాతిక శాతం పైగా మన్యం విశాఖ జిల్లాను కమ్మేసింది అన్నమాట.

తీవ్రవాదమేనా….?

విశాఖలో వామపక్ష తీవ్రవాదానికి దశాబ్దాల చరిత్ర ఉంది. తొంబై దశకంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుని మావోయిస్టులు కిడ్నాప్ చేసి కొన్ని రోజుల పాటు నాటి విజయభాస్కరరెడ్డి ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టారు. ఇక ఆ తరువాత వరసగా టీడీపీ ఎమ్మెల్యేలను హత్య చేశారు, చివరగా 2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని మాజీ ఎమ్మెల్యే శివేరు సోమను దారుణంగా హత్య చేశారు. ఇపుడు కూడా మావోయిస్టుల ప్రాబల్యం ఏజెన్సీలో అంతటా కనిపిస్తుంది. వారు బలంగానే ఉనికిని చాటుకుంటున్నారు.

ఏపీలో ఒక్కటే….

ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు జిల్ల్లాలో చూసుకుంటే విశాఖలో ఒక్క చోటే వామ‌పక్ష తీవ్రవాదం బలంగా ఉందని కేంద్ర హోం శాఖ నివేదికలు చెబుతున్నాయి. వాటిని అణచేందుకు కేంద్రం ఏపీకి గత అయిదేళ్ల కాలంలో దాదాపుగా 96 కోట్ల రూపాయల ఆర్ధిక సాయంగా నిధులను విడుదల చేసినట్లుగా అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇక మరో వైపు తీసుకుంటే జన జీవన స్రవంతిలో కలవాలనుకునే మావోలకు పెద్ద ఎత్తున అర్ధిక సాయాన్ని ఈ నిధుల నుంచి కేటాయిస్తున్నారు. ఎంత చేసినా కూడా మావోల ఆగడాలు మాత్రం అణగడంలేదు. ఈ మధ్యనే ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో మావోల కదలికలను పోలీసులు అమర్చిన సీసీ కెమెరాలు చూపించాయి. అదే విధంగా ఏడాది మొత్తంగా అమర వీరుల వారోత్సవాలు, ఇతర కార్యక్రమాలు విశాఖ మన్యం వేదికగా జరుగుతూంటాయి.

టార్గెట్ చేస్తున్నారా….?

ఇక వైసీపీ సర్కార్ మీద గిరిజనులు సానుకూలంగానే ఉన్నారు. దాంతో మావోలకు స్థానిక గిరిపుత్రుల నుంచి పెద్దగా సాయం అందడంలేదని అంటున్నారు. అయినా కూడా మావోలు తమ విధానాలకు అనుగుణంగా కార్యకలాపాలు విస్తరించాలనే చూస్తున్నారు. అంతే కాదు, ఈ మధ్య విశాఖ ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు మీద మావోలు గురి పెట్టినట్లుగా కూడా ఏపీ ఇంటలిజెన్స్ విభాగం గుర్తించి అప్రమత్తం అయింది. ఆయనకు ప్రత్యేక భద్రతను కూడా కల్పించారు. ఇవన్నీ ఇల్లా ఉంటే విశాఖ చుట్టూ మావోల పడగనీడ బలంగానే ఉందన్న వార్తలు మాత్రం ప్రజాప్రతినిధులను, రాజకీయాన్ని కలవరపెడుతున్నాయి. ఏది ఏమైనా ప్రజాస్వామ్యం పట్ల మావోలు నమ్మకం లేదన్నపుడు సమాంతరంగా వారు ఉద్యమం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందేమో.

Tags:    

Similar News