విశాఖకి శాపమేనా?

మనుషుల్లో మాదిరిగానే ప్రాంతాల్లోనూ శాపగ్రమైనవి ఉంటాయి. వాటికి అన్ని యోగ్యతలు ఉన్నా కూడా అయిదోతనం ఉండదు. అందువల్లనే అవి రాజయోగానికి ఎపుడూ ఆమడ దూరంగా ఉంటాయి. విశాఖ [more]

;

Update: 2020-01-24 08:00 GMT

మనుషుల్లో మాదిరిగానే ప్రాంతాల్లోనూ శాపగ్రమైనవి ఉంటాయి. వాటికి అన్ని యోగ్యతలు ఉన్నా కూడా అయిదోతనం ఉండదు. అందువల్లనే అవి రాజయోగానికి ఎపుడూ ఆమడ దూరంగా ఉంటాయి. విశాఖ విషయానికి వస్తే సరిగ్గా అటువంటి శాపమే తగిలిందా అన్న చర్చ సాగుతోంది. నిజానికి విశాఖ అందాలు సహజసిధ్ధమైనవి. విశాఖ అభివృధ్ధి కూడా అలాగే జరిగింది. బ్రిటిష్ వారు ఎక్కువగా విశాఖను మెచ్చి అభివృధ్ధి చేశారు. ఆ తరువాత కూడా అలా కోరకుండానే అన్నీ వచ్చి చేరాయి. పేరుకు మహానగరం కానీ ఎక్కడా హోదా మాత్రం లేదు.

అప్పట్లోనే….

ఇక విశాఖను రాజధాని చేయాలన్నది ఇప్పటిమాట కాదు. 1953లోనే దానికి అంకురార్పణ జరిగిందని చరిత్రకారులు అంటారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు అయ్యాక కర్నూలు తొలి రాజధాని అయింది. అయితే అక్కడ ఎటువంటి సదుపాయాలు లేకపోవడం ఒక కారణమైతే అప్పటికే విశాఖ పెద్ద పట్టణంగా ఉండడంతో విశాఖను రాజధానిగా చేసుకోవాలని చాలామంది అధికార పార్టీ సభ్యులకు ఉండేదట. వారిలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే రొక్కం లక్ష్మీ నరసింహ దొర దీని మీద ఒక అధికార తీర్మానం సభలో ప్రవేశపెట్టారు. ఇది రెండు ఓట్ల తేడాతో నెగ్గడం విశేషం. అంటే నాడు విశాఖ శాశ్వత రాజధాని అన్న దానికి మెజారిటీ సభ్యుల అంగీకారం ఉందని తెలుస్తోంది.

అందుకే ఆగింది….

మరో వైపు నాటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంకి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మీద చాలా ఆశలు ఉండేవి. ఆయన విశాలాంధ్ర కోసం స్వయంగా కృషి చేశారు. అందువల్ల ఆయన ఎప్పటికైనా హైదరాబాదే రాజధాని అవుతుందని భావించి కర్నూలు లోని గుడారాల్లోనే రాజధానిని నిర్వహించారని చెబుతారు. అనుకున్నట్లుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడం హైదరాబాద్ రాజధాని అవడంతో విశాఖకు వచ్చిన చాన్స్ అలా తప్పిపోయింది.

మళ్ళీ విశాఖ….

ఇవన్నీ ఇలా ఉంటే 2000 సంవత్సరంలో టీడీపీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణా సాధన కోసం పోరాడుతున్నపుడు అందరి మదిలో మెదిలిన ఏకైక రాజధాని విశాఖ. అంతెందుకు కేసీఆర్ లాంటి వారే మీకు హైదరాబద్ తో ధీటుగా విశాఖ ఉంది. అక్కడ రాజధాని పెట్టుకోండని సలహాలు కూడా ఇచ్చారు. ఇక మేధావులు, పెద్దలు కూడా విశాఖ రాజధాని అయితేనే బాగుంటుంది అన్నారు. వీటికి మించి చంద్రబాబు తొలి మంత్రివర్గం సమావేశం విశాఖలో పెట్టి మరీ కొత్త ఆశలు రేపారు. చివరికి అమరావతిని నిర్ణయించి విశాఖకు అన్యాయమే చేశారన్న మాట ఉంది.

వరమిచ్చినా….

ఇపుడు జగన్ సర్కార్ విశాఖ పరిపాలనా రాజధాని అంటోంది. ఒక విధంగా విశాఖకు వరమే ఇచ్చింది. అంతా అనుకున్నట్లుగా సాగుతుందని భావిస్తున్న వేళ శాసనమండలిలో ఒక్కసారిగా బ్రేక్ పడిపోయింది. సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్ళింది. మూడు నాలుగు నెలల సమయంలో ఎన్ని రాజకీయ పరిణామాలు జరుగుతాయో, విశాఖకు రాజధాని యోగం ఉందో లేదోనని గత‌ చరిత్ర అంతా చూసిన వారు వాపోతున్నారు. మొత్తానికి విశాఖకు రాజయోగం ఉందా లేదా అన్నది ఈ దెబ్బతో శాశ్వతంగా తేలనుంది.

Tags:    

Similar News