షర్మిలనే ఎందుకు టార్గెట్ చేశారు…?

సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరీ అట్టడుగు స్థాయికి దిగజారిపోయాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ పోరు కాస్తా వ్యక్తిగత దాడులకు, వ్యక్తిత్వాలపై [more]

;

Update: 2019-01-14 11:00 GMT

సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరీ అట్టడుగు స్థాయికి దిగజారిపోయాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ పోరు కాస్తా వ్యక్తిగత దాడులకు, వ్యక్తిత్వాలపై దాడులకు కారణమవుతోంది. ముఖ్యంగా కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉండేవారు బయటకు కనపడకుండా సోషల్ మీడియా వేదికగా ఆడవారిపై తప్పుడు ప్రచారాలు చేసే చిల్లర పనులకు దిగుతున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలతో ఎక్కువ బాధపడింది ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ సోదరి షర్మిళ. ఆమెకు ఓ హీరోతో సంబంధం ఉందంటూ గత ఐదేళ్ల నుంచే ఒక ప్లాన్ ప్రకారం ప్రచారాన్ని ప్రారంభించారు. ఒకరిని చూసి ఒకరు ఈ ప్రచారాన్ని వ్యాప్తి చేశారు. ఆమెను అసభ్యంగా దూషిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ లు, యూట్యూబ్ లో వీడియోలు పెట్టారు. అయితే, ఆమె ఇంతకుముందే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు హీరో కూడా ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

మహిళలనే టార్గెట్ చేస్తూ

ఈ ప్రచారాన్ని ఖండించినా ఇటీవలి కాలంలో మళ్లీ పెద్దఎత్తున జరుగుతోంది. ప్రత్యర్థులెవరైనా కుట్రపూరితంగా చేస్తున్నారో లేదా ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులు స్వంతంగా చేస్తున్నారో కానీ మరోసారి ఈ వందతులను వ్యాప్తి చేస్తున్నారు. మొదట ఈ పుకార్లను ఒక్క పార్టీ సానుభూతిపరులే చేసినా… ఇటీవల జగన్ మరో పార్టీ అధ్యక్షుడిపై చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ అభిమానులు కూడా షర్మిళను కించపరిచే చర్యలకు దిగారు. తీవ్రస్థాయిలో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సాధారణ ప్రజలు ఈ ప్రచారాన్ని చీత్కరించుకుంటున్నారు. ఈ తప్పుడు ప్రచారంపై షర్మిళ ఇవాళ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. కేవలం షర్మిళనే కాదు వైసీపీలోని ఓ మహిళా నేతను కూడా ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులు ఇలానే కించపరుస్తున్నారు.

టీడీపీ నాయకురాలికీ తప్పలేదు…

ఇక, టీడీపీలోనూ ఇటువంటి తప్పుడు ప్రచారాల ద్వారా ఇబ్బంది పడిన మహిళా నేతలున్నారు. ఇటీవల ఓ నాయకురాలు ప్రత్యర్థి పార్టీ నేతపై చేసిన వ్యాఖ్యలతో రంగంలోకి దిగిన ఆ పార్టీ శ్రేణులు ఆమెను తీవ్రస్థాయిలో అసభ్యంగా దూషిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్లు, యూట్యూబ్ లో వీడియోలు పెట్టారు. ఓ పార్టీకి అభిమానిగా చెప్పుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే సాటి మహిళలు అని కూడా చూడకుండా ఇతర పార్టీల్లోని మహిళలను దారుణంగా చిత్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. ఈ ప్రచారాన్ని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎక్కువ చేసి చూపిస్తున్నాయి. ఇక, ఓ పార్టీ అధినేతను విమర్శించే క్రమంలో కూడా ప్రత్యర్థి పార్టీల అభిమానులు ఇతర మహిళలకు కించపరుస్తున్నారు. ఆయనతో వారికి సంబంధం ఉందంటూ కొన్ని పేర్లను ప్రస్తావించి నీచ ప్రచారానికి దిగుతున్నారు.

పిల్లలపై ప్రమాణం చేసిన షర్మిళ

ఇటువంటి తప్పుడు ప్రచారాలతో మానసికంగా క్షోభ అనుభవిస్తున్న షర్మిళ ఇవాళ ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసి, మీడియా ముందుకు వచ్చింది. ఒక మహిళ స్వయంగా తన పిల్లలపై ప్రమాణం చేసి తానే తప్పూ చేయలేదని మీడియా ముందు సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే పరిస్థితిని ఇతర పార్టీల్లోని కొందరు మహిళా నేతలు కూడా ఎదుర్కొంటున్నారు. తమ పార్టీ వారిపై తప్పుడు ప్రచారానికి కౌంటర్ గా ఆ పార్టీ వారు ఇతరులపైకి ఇదే తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ఐడీలతో ఇలాంటి ప్రచారాలు చేస్తే ఎవరికీ దొరకమనే ఒక ధైర్యంతో ఈ తరహా చర్యలకు ఆకతాయిలు దిగుతున్నారు. ఏదేమైనా కనీసం కుటుంబాలు, పిల్లలు ఉన్నారనే కనీస ఇంగితం కూడా లేకుండా మహిళలను తమ నీచ రాజకీయాల కోసం కించపర్చడం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మరకగానే భావించాలి. నేతలే చేయిస్తున్నారో లేదా పార్టీలపై పిచ్చి అభిమానంతో శ్రేణులే చేస్తున్నారో కానీ మహిళలను కించపరిచే ఈ చిల్లర రాజకీయాలకు స్వస్థి పలకాల్సిన అవసరం ఉంది. పోలీసులు సైతం ఇటువంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News