చేరినోళ్లు చేరినట్లే.. ప్రయారిటీ లేదా?

ప్రస్తుతం వైసీపీలో చేరిన వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లు 2024 ఎన్నికల వరకూ వైసీపీ లో ఉంటారా? తిరిగి టీడీపీ వైపు వెళతారా? అన్న చర్చ పార్టీలో [more]

;

Update: 2020-12-07 05:00 GMT

ప్రస్తుతం వైసీపీలో చేరిన వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లు 2024 ఎన్నికల వరకూ వైసీపీ లో ఉంటారా? తిరిగి టీడీపీ వైపు వెళతారా? అన్న చర్చ పార్టీలో మొదలయింది. వైసీపీ ప్రభుత్వానికి భయపడి కొందరు, అధికారం కోసం మరికొందరు టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలు కాకుండా చేరిన వారికి వైసీపీలో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. పార్టీ నేతలే కాదు క్యాడర్ కూడా వారిని పట్టించుకోవడం లేదు. దీంతో వారంతా చివరి నిమిషంలో మళ్లీ టీడీపీ వైపు వెళతారన్న ప్రచారం జరుగుతోంది.

పదహారు నెలల్లో….

వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ఇతర పార్టీల నేతలను చేర్చుకోమని చెప్పిన జగన్ ఆ తర్వాత పార్టీని బలోపేతం చేసేందుకు చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను కూడా పార్టీలో చేర్చుకున్నారు. అనేక చోట్ల తమ ఆర్థిక మూలాలు దెబ్బతినడం, టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతో అనేక మంది టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు.

వీరందరినీ పట్టించుకోకుండా…..

వీరిలో జూపూడి ప్రభాకర్ రావు, శిద్ధారాఘవరావు, పంచకర్ల రమేష్ బాబు, తోట త్రిమూర్తులు, రామసుబ్బారెడ్డి, శమంతకమణి, దేవినేని అవినాష్, కదిరి బాబూరావు తదితరులు టీడీపీని ఎన్నికల తర్వాత వీడి వైసీపీలో చేరిపోయారు. అయితే వారందరికీ ఇప్పుడు పార్టీలో ప్రయారిటీ లేదు. నేతలే వారిని పట్టించుకోవడం లేదు. పార్టీలో చేరేటప్పుడు చూపిన శ్రద్ధ ఇప్పుడు నేతలు చూపించడం లేదు. వాళ్లు ఇటు టీడీపీ క్యాడర్ కు దూరమయ్యారు. అలాగే వైసీపీ క్యాడర్ కూడా వారిని దరిచేరనివ్వడం లేదు.

తిరిగి సొంత గూటికి….

దీంతో పార్టీ మారిన నేతలంతా ఎటూ కాకుండా పోయినట్లయింది. వీరందరినీ జిల్లా మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులే పట్టించుకోవడం లేదు. ఇక జగన్ వద్దకు వెళ్లే సీన్ వీరికి లేదు. వీళ్లందరికీ కండువా కప్పడమే తప్ప ఎటువంటి పదవులు ఇవ్వలేదు. దీంతో వీరంతా వచ్చే ఎన్నికలకు ముందు టీడీపీ గూటికి చేరుతారని తెలుస్తోంది. వీరిలో చాలామంది ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలకు టచ్ లో ఉంటుండటం, తాము పార్టీ మారిన కారణాలను చెప్పడంతో వారిని తిరిగి చేర్చుకునేందుకు కూడా అవకాశాలున్నాయి. దీంతో వైసీపీలోకి వచ్చిన వారిలో ఎక్కువ మంది భయపడి వచ్చినవారేనని, తిరిగి తమ పార్టీలోకి వారు వస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News