“మా”లో వైసీపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్‌.. ఏం జ‌రుగుతుంది..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా)కు త్వర‌లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు సార్వత్రిక స‌మ‌రాన్ని త‌ల‌పిస్తున్నాయి. బ‌హుభాషా న‌టుడు ప్రకాశ్ రాజ్‌తోపాటు.. మంచు విష్ణు, జీవితా రాజశేఖ‌ర్ వంటి ఉద్దండులు [more]

;

Update: 2021-07-01 12:30 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా)కు త్వర‌లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు సార్వత్రిక స‌మ‌రాన్ని త‌ల‌పిస్తున్నాయి. బ‌హుభాషా న‌టుడు ప్రకాశ్ రాజ్‌తోపాటు.. మంచు విష్ణు, జీవితా రాజశేఖ‌ర్ వంటి ఉద్దండులు పోటీ ప‌డుతున్నారు. ఇక హేమ‌, తెలంగాణ వాదంతో సీనియ‌ర్ న‌టుడు సీవీఎల్‌. న‌ర‌సింహారావు సైతం రంగంలోకి దిగారు. అయితే.. కేవ‌లం ఇది “మా” కు మాత్రమే సంబంధించిన అంశంగా కాకుండా రాజ‌కీయంగా రూపాంత‌రం చెందింది. “మా” ఎన్నిక‌ల్లో ఎప్పుడూ లేనంత‌గా ఇప్పుడు రాజ‌కీయ వాస‌న‌లు జోరుగా వ్యాపిస్తున్నాయి. “మా” లో ఉన్న న‌టుల్లో ఎక్కువ మంది.. ఏపీలోని వైసీపీకి.. అనుకూలంగా ఉన్నవారు.. అదేవిధంగా తెలంగాణ‌లోని కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నవారు ఉండ‌డంతోపాటు.. వ్యక్తిగ‌తంగా కూడా న‌టుల‌కు నేత‌ల నుంచి స‌పోర్టు ఉండ‌డం ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది.

ఇద్దరి మద్దతుతో…?

ప్రకాశ్ రాజ్‌ను తీసుకుంటే..ఈయ‌న‌కు టీఆర్ఎస్ కీల‌క నేత‌, మంత్రి కేటీఆర్‌తో అనుబంధం ఎక్కువ‌. కేసీఆర్ ప్రభుత్వానికి ఎప్పుడూ స‌పోర్ట్ చేస్తూ ఉంటారు. పైగా మోడీ వ్యతిరేక భావ‌జాలం ఉన్న ప్రకాష్ రాజ్ అంటే కేసీఆర్‌, టీఆర్ఎస్ వాళ్లు బాగా లైక్ చేస్తూ ఉంటారు. ఇక‌, మెగా ఫ్యామిలీ మొత్తంగా ప్రకాశ్‌రాజ్‌కు మ‌ద్దతుగా నిలుస్తోంది. ఇప్పటికే ప్ర‌కాష్ రాజ్‌కు మెగాస్టార్‌తో పాటు కేసీఆర్ స‌పోర్ట్ ఉంద‌న్న ప్రచారం బాగా చేస్తున్నారు. ఇక‌,మాలోని తెలంగాణ వాదులు అంద‌రూ కూడా ప్రకాశ్ వెంటే న‌డిచే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో మంచు కుటుంబాన్ని తీసుకుంటే.. వీరికి, ఏపీలోని వైసీపీకి మ‌ధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది. స్వయంగా మంచు విష్ణు.. వైఎస్ కుటుంబానికి బంధువు కూడా.

మంచు కుటుంబానికి…..

ఈ నేప‌థ్యంలో వైసీపీని స‌మ‌ర్ధించే పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆలీ, పృథ్వీ, హేమ వంటివారు కూడా మంచు వెనుక నిల‌బ‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. హేమ ప్రస్తుతం పోటీలో ఉన్నాన‌ని చెపుతున్నా ఆమె చివ‌రి క్షణంలో అయినా పోటీ నుంచి త‌ప్పుకునే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. టీఆర్ఎస్‌లోనే మంత్రిగా ఉన్న త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స‌హా.. కొంద‌రికి మంచు మోహ‌న్‌బాబు కుటుంబంతో అనుబంధం ఉంది. ఈ నేప‌థ్యంలో వీరు మంచు వైపు నిల‌బ‌డ‌తారా ? లేక పార్టీ తీసుకునే అంత‌ర్గత నిర్ణయం మేర‌కు న‌డుచుకుంటారా ? అనేది ఆస‌క్తిగా మారింది.

సినీ పెద్దల సపోర్ట్……

వాస్తవానికి ద‌శాబ్దం కింద‌టి వ‌ర‌కు కూడా ఎలాంటి రాజ‌కీయ జోక్యం లేకుండానే “మా” ఎన్నిక‌లు జ‌రిగేవి. అయితే.. రాను రాను.. న‌టుల‌కు నేత‌ల‌కు మ‌ధ్య సంబంధాలు పెరుగుతుండ‌డంతో మా” ఎన్నిక‌లు ఉత్కంఠ‌గా మారాయి. ఇదిలావుంటే.. సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ ఎవ‌రి వైపు నిల‌బ‌డుతుంద‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. వీరు టీడీపీ మ‌ద్దతుగా ఉన్నారు. ఇక ప్రకాష్ రాజ్ గెలుపు కోసం మెగా బ్రద‌ర్ నాగ‌బాబు స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టారు. మ‌రోవైపు విష్ణు గెలుపు కోసం మోహ‌న్‌బాబు రంగంలోకి దిగి… సూప‌ర్‌స్టార్ కృష్ణ, కృష్ణంరాజును క‌లిశారు. ఇక బాల‌య్య స‌పోర్ట్ జీవిత‌కు ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు ఎటు మొగ్గు చూపుతారో చూడాలి. ఏదేమైనా మా” ఎన్నిక‌లు ఉత్కంఠ‌గా మారాయి.

Tags:    

Similar News