నిరాశపరిచిన జి20 పర్యావరణ ప్రకటన

జి20 కూటమికి అధ్యక్ష స్థానంలో భారత గత ఏడాది నుంచి ఉన్న నేపధ్యంలో పర్యావరణం మీద ఒక 4 సమావేశాలు జరిగినాయి. చివరి, నాలుగవ సమావేశంలో సభ్య దేశాల పర్యావరణ మంత్రులు, ఇంకా ఇతరులు పాల్గొని ఒక ఉమ్మడి ప్రకటన చేశారు.;

Update: 2023-09-15 04:40 GMT
g20, environment notice, g20 summit ,2023,disappointment
  • whatsapp icon

ప్రాథమిక విషయాల విస్మరణ

జి20 కూటమికి అధ్యక్ష స్థానంలో భారత్ గత ఏడాది నుంచి ఉన్న నేపధ్యంలో పర్యావరణం మీద ఒక 4 సమావేశాలు జరిగాయి. చివరి, నాలుగవ సమావేశంలో సభ్య దేశాల పర్యావరణ మంత్రులు, ఇంకా ఇతరులు పాల్గొని ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వార ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు ఒక కూటమిగా తమ లక్ష్యాలను, తీసుకునే చర్యలను, చేపట్టే కార్యక్రమాలను ఆమోదించారు. ప్రపంచ దేశాల మధ్య ఉండే రాజకీయాల నేపధ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటి? అనే ప్రశ్న సహజంగా వస్తుంది.

ఇదివరకు, మూడు రియో ఒప్పందాలలో ఉన్న లక్ష్యాల ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ, వాటిని సాధించడం కోసం, వాతావరణ మార్పులు, జీవవైవిధ్య నష్టం, కాలుష్యం, ఎడారీకరణ, అటవీ నిర్మూలన, నీరు, భూమి మరియు సముద్రాల విధ్వంసంతో సహా పర్యావరణ సంక్షోభాలు, సవాళ్లను పరిష్కరించడానికి, తీసుకునే చర్యలను అత్యవసరంగా వేగవంతం చేయడానికి జి 20 పర్యావరణ మరియు వాతావరణ మంత్రులు 2023 జూలై 28 న చెన్నైలో సమావేశమయ్యారు. ఈ సమస్యలు పరస్పరంగా ముడిపడి ఉన్నాయని గుర్తిస్తూ, ఆర్థిక మందగమనం, పేదరికం, ఆహారం మరియు ఇంధనంతో సహా ద్రవ్యోల్భణం, వస్తువుల అధిక ధరలు, కోవిడ్ -19 మహమ్మారి ప్రభావాలతో సహా ఇతర అత్యవసర ప్రపంచ సవాళ్లను పరిష్కరించే ప్రయత్నాలతో పాటు మా చర్యలను పరిపూర్ణమైన రీతిలో ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాము అని ప్రకటించారు.

ఈ 31-పేజీల ప్రకటనల అనేక విషయాలు, ఒప్పందాలు, వివిధ అంతర్జాతీయ ఉమ్మడి ఆలోచనలు ప్రస్తావించినా కూడా, కీలకమైన అంశాల మీద ఏకాభిప్రాయం మాత్రం రాలేదు. స్వయంగా, భారత పర్యావరణ మంత్రి నాలుగు విషయాల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని ప్రకటించారు. అవి: ప్రపంచ ఉద్గారాలను 2025 నాటికి గరిష్ఠ స్థాయిగా గుర్తించడం, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని మూడింతలు పెంచడం, శిలాజ ఇంధనాలను, ముఖ్యంగా బొగ్గును, దశలవారీగా నిర్మూలించడం లేదా తగ్గించడం. కర్బన ఉద్గారాలను 2025 నాటికి గరిష్ఠ స్థాయిగా పరిగణిస్తే దానికి తగిన విధానాలు అవసరం. దానిని లక్ష్యంగా గుర్తించడం మీద ఏకాభిప్రాయం కుదరలేదు. ఉద్గారాలను తగ్గించే మార్గంగా స్వచ్ఛమైన ఇంధనాల ఉపయోగం మీద, కర్బన ఉద్గారాలపై పన్ను విధించడం వంటి అంశాల మీద కూడా ఒకే మాట రాలేదు.

అయితే, ఇంత చర్చించి ఇంత ఖర్చు పెట్టినా కూడా ఆశించిన ఫలితం రాలేదు. 1995 నుంచి క్లైమేట్ చేంజ్ మీద అంతర్జాతీయ సమావేశాలు ఉమ్మడి ఆలోచనల మూకుమ్మడి చర్యలు చేపట్టటానికి చర్చలు జరుగుతున్నాయి. 28 ఏండ్లలో అనేక నివేదికలు, శాస్త్రీయ అధ్యయనాలు వచ్చాయి. అంతర్జాతీయ శాస్త్రవేతల బృందం (IPCC) యే ఏటికి కి ఏడు భూమి ఉష్ణోగ్రత పెరుగుతున్నది, వాతావరణ మార్పుల తీవ్రత పెరుగుతున్నది, ప్రకృతి వైపరిత్యాలు మానవాళి మనుగడకు, పుడమి మీద జీవనానికి కష్టతరం అవుతాయని నివేదికల ద్వార హెచ్చరిస్తూనే ఉన్నారు. దేశాధినేతలు తమ రాజకీయాలలో మునిగిపోయి పట్టించుకోవడంలేదు. కార్బన్ ఉద్గారాలను తగ్గించుకునే పరిమాణ లక్ష్యాలను ప్రతి దేశం స్వచ్చందంగా ప్రకటించాలని 2015 పారిస్ సమావేశంలో ఒప్పందం కుదిరినాక ఇంకా అడుగులు వేగంగా పడతాయని అందరూ భావించారు. దాదాపు దేశాలు ప్రకటించినా ఆచరణ మాత్రం మందకొడిగానే ఉన్నది. కార్బన్  ఉద్గారాలకు ప్రధాన కారణమైన అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలు ఇటీవల కొన్ని నిర్ణయాలు ఆచరణలోకి తీస్కోచ్చారు . అయితే, వర్ధమాన దేశాలు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు తమతో పాటు అడుగులు వెయ్యాలని వారు భిష్మించి కూర్చున్నారు 

కోవిడ్-19 మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాల మీద ఆంక్షలు విధించిన సందర్భంలో ఉత్పత్తి, వ్యాపారం, రవాణా రంగాలు తీవ్ర ఒత్తిడికి  లొన్నయాయి

 అంతర్జాతీయ వ్యాపారంలో నష్టాలు పెరిగాయి. ప్రజలకు కష్టాలు పెరిగాయి. వివిధ దేశాల మధ్య జరిగే ఆహార, ఇతర నిత్యావసర వస్తువుల వాణిజ్యం కొన్నిసార్లు నిలిచిపోయింది. పర్యవసానంగా, ఆహార, ధరలు పెరిగాయి. జీవన ఖర్చులు పెరిగాయి. ఆ నేపధ్యంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రావడం, అమెరికా రష్యా మీద ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. ప్రత్యామ్నాయ ఇంధనాల మీద ఐరోపా, అమెరికా దేశాలలో పెట్టుబడులు కొంత బలహీనపడ్డాయి.

ప్రకృతి వైపరిత్యాల సంఖ్య, వాటి వలన జరుగుతున్న నష్టాలూ పెరిగాయి. 1970 నుంచి 2021 మధ్య వాతావరణం, దాదాపు 12,000 వాతావరణం, నీటి సంబంధిత వైపరిత్యాలు సంభావించినాయని ప్రపంచ వాతావరణ సంస్థ లెక్క. ప్రతి 10 మరణాలలో తొమ్మిది, 60 శాతం ఆర్థిక నష్టాలు జరుగుతున్నాయి.వీటి ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలు మీద తీవ్రంగా  ఉందని  అర్థం అయ్యింది. అంటే, భూమి ఉష్ణోగ్రత పెరుగుదల ప్రభావం అభివృద్ధి చెందినా దేశాల మీద ఎక్కువ ఉంది కాబటి కార్బన్ ఉద్గారాలను తగ్గించే విధానాల కొరకు ఒత్తిడి ఆ దేశాల నుంచే రావాలి. చిన్న ద్వీపాలు, ఆఫ్రికన్ దేశాలకు అంతర్జాతీయ రాజకీయాలలో బలం లేదు. అదే, ఆసియా దేశాలైన భారత్ , చైనా నుంచి ఒత్తిడి పెరుగుతుంది అని భావించారు. అందుకే జి20 కూటమి మీద చాలా  ఆశలు ఉన్నాయి.

అనూహ్యంగా, 2020 నుంచి ప్రకృతి ప్రకోపం పశ్చిమ దేశాలలో కూడా కనపడసాగింది. ఐరోపా ఖండంలో ఈ మూడు ఏండ్లలో వరదలు, వేడి, ఉక్కపోత, వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. అడవులు కాలిపోతున్నాయి. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క కొత్త డేటా ప్రకారం, 2023 లో, ఇప్పటివరకు అమెరికా 23 విపత్తులను ఎదుర్కొంది. ప్రతి విపత్తు వల్ల కనీసం 1 బిలియన్ డాలర్లు నష్టం అయ్యింది. ఇది 2020 లో 22 విపత్తుల వార్షిక రికార్డును అధిగమించింది.

ఇటు ప్రకృతి నుంచి పెరుగుతున్న ఒత్తిడి, అటు ఆర్థిక రంగంలో అనుకోని మార్పుల నేపధ్యంలో జి20 పర్యావరణ మంత్రుల సదస్సు ప్రకటన నిరాశ కలిగించింది. అత్యవసర నిర్ణయాలను ఆవశ్యకతను మొదటి వ్యాక్యంలో గుర్తిస్తూనే ఈ ప్రకటన తదుపరి చర్యల మీద స్థూల, నిర్దిష్ట అభిప్రాయానికి రాలేకపోయింది. కార్బన్  ఉద్గారాల తగ్గింపు మీద నేరుగా ప్రభావం చూపగలిగే రెండు అంశాల మీద చర్చ జరిగినా ఏకాభిప్రాయం రాలేదు. శిలాజ ఇంధనాలు అయినా పెట్రోల్, డిజిల్, గ్యాస్, బొగ్గు వాడకం తగ్గించే నిర్ణయం ఏది తీసుకోలేదు. అట్లాగే, ప్రత్యామ్న్యాయ శక్తి వనరులను మూడింతలు పెంచాలనే లక్ష్యం చర్చకు వచ్చినా, నిర్ణయం మాత్రం రాలేదు. ప్రత్యామ్న్యాయ శక్తి వనరులను మూడింతలు పెంచితే 2030 నాటికి 7 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించ వచ్చు. దీని మీద కూడా ఎందుకు ఏకాభిప్రాయం రాలేదో తెలియదు.

భారత ప్రభుత్వం జీవనశైలి మార్పుల గురించి 2015 ప్యారిస్ సదస్సు నుంచి మాట్లాడుతున్నది. అనేక ఉపన్యాసాలలో ప్రస్తావించిన భారత దేశం, జీవన శైలి ఒక పరిష్కారంగా భావిస్తున్నా, జి20 పర్యావరణ మంత్రుల ప్రకటనలో ప్రతిబింబించే ప్రయత్నం చేయలేదు. Lifestyle for Environment (LIFE) పేరిట కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. ఈ జి20 ప్రకటనలో వస్తు, ఖనిజాల వినియోగం  తగ్గించాలని కోరి ఉంటె, సంప్రదాయ జీవన విధానంలో మనం ముందున్నాం అని లోకానికి చెప్పెగలిగేవాళ్ళం. వసుదైవ కుటుంబకం కేవలం కాగితాలు, వాణిజ్య ప్రకటనలకే పరిమితం అయ్యింది. ఈ పర్యావరణ ప్రకటనలో దాని ప్రాశస్త్యం గుర్తించలేదు.

ప్రత్యామ్న్యాయ టెక్నాలజీల గురించి సహకారం, నిధులు అందించాలని క్లైమేట్ చేంజ్ సదస్సులలో ధనిక దేశాల మీద తీవ్ర ఒత్తిడి ఉన్నది. వారు పట్టించుకోలేదు. వర్ధమాన దేశాల ప్రతినిధిగా భారత జి20 సదస్సుల ద్వార దీని మీద దృష్తి కేంద్రీకరించి ఉంటె మనకు మద్దతుతో పాటు, ధనిక దేశాల స్పందన వచ్చేది. ఆ అవకాశం కూడా కోల్పోయినాము. దాని మీద ఒక ప్రతిపాదన కూడా లేదు. జి20 పర్యావరణ సదస్సులు ధనిక దేశాలు, వాళ్ళ సంస్థల కనుసన్నలలో జరిగినట్లు కనిపిస్తున్నది.

ప్లాస్టిక్, ఇంకా ఇతర పదార్థాలలో వినియోగం తగ్గిస్తూ, పర్యావరణానికి హితం చేసే పదార్థాలు, వస్తువులు, నూలు మన దేశ సంప్రదాయ జీవన విధానంలో భాగం. చేతివృత్తుల టెక్నాలజీ మన దగ్గర ఇంకా సజీవంగా ఉన్నది. కోట్ల కుటుంబాలు ఇప్పటికీ శక్తి వనరులు, ప్రకృతి వనరులను పరిమితంగా ఉపయోగించి వస్తు, సేవలను అందించే చేనేత, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి తదితర జీవనోపాధుల గురించి ప్రస్తావిస్తూ ఒక ప్రతిపాదన చేసి ఉంటె ఉపయుక్తంగా ఉండేది. ప్రతిపాదన లేకపోగా, కనీసం ఉమ్మడి ప్రకటనలో ఉన్న సూత్రాలలో కూడా వీటికి, ఈ ఆలోచనలకూ, ఇటువంటి ప్రత్యామ్నయ జీవన విధానాలకు చోటు కల్పించలేదు. పర్యావరణ పరిరక్షణతో పాటు, జీవనోపాధుల కొనసాగింపు, దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే సంప్రదాయ వస్తు, సేవల వృత్తులను అంతర్జాతీయ వేదికలలో, ప్రకటనలలో ప్రస్తావించే అవకాశం జి20 సారధ్య బాధ్యతలు చేపట్టిన భారత్ కు వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ అవకాశం ఉపయోగించలేదు.

ఈ మూడింటిని, జీవనశైలి మార్పులు, వసుదైవ కుటుంబకం, పర్యావరణ-హిత వస్తు ఉత్పత్తి సేవల జీవనోపాధులను, జి20 కూటమికి సారధ్యం వహించిన ఏడాదిలో, సదస్సుల ద్వార ప్రపంచానికి చాటి చెప్పే విధంగా భారత ప్రభుత్వం, ప్రతినిధులు, షెర్పాలు ప్రయత్నించక పోవటం శోచనీయం. గర్హనీయం.

ఈ సదస్సు రాబోయే COP28 సదస్సు ముందున్న అంశాల మీద స్పష్టత ఇస్తుంది అనుకుంటే అది ఆశగానే మిగిలింది. COP28, అంతకు ముంది గ్లాస్గో, షర్మ్-అల్-షేక్ లో COP26, 27, సదస్సుల నుంచి పుట్టుకు వచ్చిన కొన్ని ప్రతిపాదనలు చిన్న దేశాలు, వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆకాంక్షలు, జి20 పర్యావరణ సదస్సులో చర్చ కూడా చేయలేదు. Loss and Damage (ప్రకృతి వైపరీత్యాల వల్ల జరుగుతున్న నష్టాలు) పేద, చిన్న దేశాల మీద భారంగా పరిణమించిన దరిమిలా కార్బన్ ఉద్గారాలకు కారణమైన ధనిక దేశాలు భరించాలని డిమాండ్ ఉన్నది. గత సదస్సులలో ఒప్పుకున్నా, దానికి ఏర్పాటు చేస్తామన్న నిధి గురించి అడుగులు ముందుకు పడలేదు. జి20 కూటమిలో ఉన్న ధనిక దేశాల మీద ఈ విషయంగా భారత ప్రభుత్వం ఒత్తిడి చేయకపోగా, శుష్కమైన ప్రస్తావన మాత్రం చేశారు. కొత్త ప్రతిపాదన ఏమి చేయలేదు. COP సదస్సులలో ఆర్థిక సమానతలను పెంచుతున్న విధానాలు, పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న అంశాల మీద చర్చకు జి20 తగిన వేదిక. ఆ విధంగా మలిచే ప్రయత్నం భారత ప్రభుత్వం చేయలేదు.

జి20 పర్యావరణ మంత్రులు సముద్రాల పరిరక్షణకు 7 ‘చెన్నై హై లెవల్ సూత్రాలను' ఆమోదించారు. ఈ సూత్రాలు కూడా జీ20 సభ్యదేశాలు స్వచ్ఛంద ప్రాతిపదికన అమలు చేసుకునే అవకాశం కల్పించారు. ఇవి ఆచరణాత్మక చర్యలు కావు. ఈ సూత్రాలు సముద్రాల పరిరక్షణకు, సముద్ర జలచరాల సంరక్షణకు, సముద్రాలలో జీవ వైవిధ్యం కాపాడుకోవటానికి ఉపయోగపడినా, జి20 దేశాలు కలిసికట్టుగా చేపట్టే చర్యలు ఏమి లేవు. సముద్రాల పరిరక్షణకు COP28 సదస్సులో ప్రత్యెక కార్యాచరణ దిశగా చర్చించాలని జి20 పిలుపు ఇచ్చి ఉంటే బాగుండేది. అట్లాంటి వ్యాఖ్యలు ఏమి లేవు.

కార్బన్ ఉద్గారాలను పెంపొందించే ఆర్థికాభివృద్ధి నమూనాలను, భూమి వాతావరణాన్ని కలుషితం చేసే మానవ చర్యలను, సంపద ఉపయోగంలో ఉన్న ఆర్థిక అసమానతలను, ప్రకృతి వనరుల అందుబాటులో ఉన్న వ్యత్యాసాలను ప్రస్తావించే విధంగా జి20 సదస్సును భారత ప్రభుత్వం ఉపయోగించి ఉంటె, పేద, వర్ధమాన దేశాలకు నాయకత్వం వహించే సామర్థ్యం సర్వామోదం వచ్చి ఉండేది. ఆఫ్రికన్ యూనియన్ కు జి20 కూటమిలో సభ్యత్వం ఇచ్చినంత నేపధ్యంలో భారత దేశానికి గౌరవం పెరిగి ఉండేది. ప్రపంచమంతటా ఉన్న ప్రజాస్వామ్యవాదుల మద్దతు లభించి ఉండేది.

జి20 పర్యావరణ మంత్రుల ఉమ్మడి ప్రకటనలలో లేని ప్రతిపాదన ప్రధాన మంత్రి జి20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఏకపక్షంగా ప్రకటించిన Global Biofuel Alliance ఆశ్చర్యం కలిగించింది. ఆకలిని తీర్చే ఆహారం, ధాన్యాన్ని, వాహనాల ఇంధనంగా మార్చే బయోఫ్యూయల్ ప్రక్రియకు భారత దేశ సారధ్యంలో అంతర్జాతీయంగా ఊతం ఇచ్చే కొత్త ప్రతిపాదన చాలా  నికృష్టమైనది. స్పష్టంగా, అమెరికా దేశం ఒత్తిడి మేరకు, లేదా ఆ దేశాన్ని మచ్చిక చేసుకునేందుకు, ఈ ప్రతిపాదన చేసినట్టు అర్థం అవుతున్నది. ఈ భావజాల వైరుద్ధ్యాన్ని బహిర్గతం చేస్తున్నది. భారత దేశానికి ప్రపంచ దేశాలలో ఒక స్వతంత్ర, ప్రజాస్వామ్య, సార్వభౌమ, హేతుబద్ధమైన దేశంగా గుర్తింపు ఉన్నది. ఈ ప్రతిపాదన ఆ గౌరవాన్ని బలహీనం చేసింది.



Tags:    

Similar News