గంటా బ్యాచ్ చెల్లా చెదురు…?

టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును బలమైన నాయకుడు అంటారు. ఏ నాయకుడికైనా బలం అతని బలగమే. 2009 ఎన్నికల నాటికి గంటా శ్రీనివాసరావు కొంతమంది ఎమ్మెల్యేలను [more]

Update: 2020-08-28 05:00 GMT

టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును బలమైన నాయకుడు అంటారు. ఏ నాయకుడికైనా బలం అతని బలగమే. 2009 ఎన్నికల నాటికి గంటా శ్రీనివాసరావు కొంతమంది ఎమ్మెల్యేలను కూడగట్టి ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తాను స్వయంగా కొందరికి టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. అలాంటి వారిలో ప్రస్తుత వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, గాజువాకకు చెందిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తదితరులు ఉన్నారు. వీరంతా ప్రజారాజ్యం ద్వారానే రాజకీయ అరంగేట్రం చేశారు. వీరిని తన వెంట ఉంచుకునే గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ లో మంత్రి పదవి కోసం బేరమాడారు. ఆ తరువాత వీరిని వెంటబెట్టుకుని టీడీపీలో రీ ఎంట్రీ ఇచ్చి మరీ అక్కడా అయిదేళ్ల పాటు మంత్రిగా దర్జా చేశారు.

ఎదగమనే అలా…..

అయితే రాజకీయాల్లో బంధాలన్నీ బలహీనమే. తన వారు అనుకున్న వారు ఏదో రోజున దూరం అవుతారు. గంటా శ్రీనివాసరావు తాను మాత్రమే ఎదుగుతూ అనుచరులను మాత్రం వాడుకుంటూ చేస్తున్న రాజకీయాన్ని మొదట పసిగట్టిన వారు అవంతి శ్రీనివాస్. పైగా గంటా శ్రీనివాసరావు తన రాజకీయం కోసం సీట్లను అటూ ఇటూ మార్చేస్తూ అనుచరులకు తీరని అన్యాయమే చేశారన్న విమర్శలు ఉన్నాయి. అలా భీమిలీ సీటు 2014లో కోల్పోయిన అవంతి గంటా శ్రీనివాసరావు గూట్లో ఉంటే ఇంతే సంగతులు అని బయటకు వచ్చేశారు, వైసీపీలో మంత్రి అయి తాను చేసింది కరెక్ట్ అని రుజువు చేసుకున్నారు.

ఈయనా బాధితుడే…..

ఇక విశాఖ రూరల్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు నిబధ్ధతతో కూడిన రాజకీయమే చేశారు. ఆయన మొదట 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచారు, 2014 నాటికి ఆయన్ని గంటా శ్రీనివాసరావు ఎలమంచిలికి షిఫ్ట్ చేశారు. బలవంతంగానే అయినా వెళ్ళి మరీ పోటీ చేసి గెలుచుకునివచ్చారు. అయిదేళ్ళ టీడీపీ ఏలుబడిలో పంచకర్లకు ఏ రకమైన పదవులూ లేవు, గంటా శ్రీనివాసరావు అనుచరుడిగానే ముద్ర వేసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం సీటు కోరుకున్నారు. కానీ గంటా శ్రీనివాసరావు అక్కడ పోటీ చేసి మళ్ళీ పంచకర్లను ఎలమంచిలికి పంపించేశారు. అక్కడ ఓడిన పంచకర్ల టీడీపీకి, గంటాకు కూడా గుడ్ బై కొట్టేశారు.

అన్నీ విడాకులే….

ఇక గంటా శ్రీనివాసరావుతో ఆ మధ్యదాకా ఉన్నవారంతా విడాకులు ఇచ్చేసి వైసీపీలోకి వచ్చేశారు. మైనారిటీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ కూడా గంటా శ్రీనివాసరావుకు ఒకప్పుడు సన్నిహితుడు, ఆయన ఇపుడు వైసీపీలో ఉన్నారు. అలాగే, గాజువాక నుంచి ప్రజారాజ్యం తరఫున గెలిచిన వెంకటరామయ్యను పట్టించుకోకపోవడంతో ఆయన ఎపుడో వైసీపీలో చేరిపోయారు. ఇపుడు పంచకర్ల వంతు. ఆయన కూడా వైసీపీకే ఓటేశారు. ఈ పరిణామాల నేపధ్యంలో మరింతమంది గంటా అనుచరులు వైసీపీ వైపు చూస్తున్నట్లుగా భోగట్టా. గంటా శ్రీనివాసరావుకు వైసీపీలో నో ఎంట్రీ అని తేలిపోవడంతో వారంతా అధికార పార్టీలోకి దూకేస్తున్నారు. ఇదే వరసలో మరింతమంది మాజీ ఎమ్మెల్యేలు, తాజాగా ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీ బాట పడ‌తారు అంటున్నారు, ఇలా అందరూ వెళ్ళిపోతే గంటా శ్రీనివాసరావు ఒంటరే అవుతారు, చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News