తేల్చుకునే సమయం దగ్గరపడినట్లే ఉందిగా?

సమయం వచ్చేసిందా. ఎటువైపు ఉండాలో తేల్చుకునే వేళ వచ్చేసిందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లౌక్యంగా [more]

Update: 2020-06-24 06:30 GMT

సమయం వచ్చేసిందా. ఎటువైపు ఉండాలో తేల్చుకునే వేళ వచ్చేసిందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయన టీడీపీ గట్టు దాటడంలేదు. అలాగని ఇతర తమ్ముళ్ల మాదిరిగా జగన్ మీద హాట్ కామెంట్స్ చేయడం లేదు. ఇక అదే తీరున చంద్రబాబును కూడా కీలక వేళ ఆదుకుంటున్నారు. అండగా ఉంటున్నారు. శాసనసభలో చంద్రబాబుకు విపక్ష కుర్చీ లేకుండా చేయాలని వైసీపీ రాజకీయ మంత్రాంగం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మంత్రాంగంలో గంటా శ్రీనివాసరావు కూడా భాగమవుతారని అనుకున్నారు. కానీ గంటా మీనమేషాలు లెక్కబెడుతున్నారు. అంతే కాదు, బాబుకే మద్దతు ప్రకటించి తన ఓటు అటే అని చెప్పారు. దాంతో ఇపుడు గంటా గురించి వైసీపీ ఆలోచన చేస్తోందా అన్న విధంగా ఆయన అతి ముఖ్య అనుచరుడిని టార్గెట్ చేసారు.

గొంతు సవరించారు….

ఇన్నాళ్ళూ గంటా శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారోనని అంతా అనుకున్నారు. ఈ మధ్యనే అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన బీసీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ అయితే గంటా శ్రీనివాసరావు ఇదేమని ప్రశ్నించలేదు. అదే సమయంలో నోటి దురుసు సహజ లక్షణం కలిగిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మీద నిర్భయ కేసు పెడితే అయ్యో అని ముందుకురాలేదు. ఇక అనేక విషయాల మీద జగన్ సర్కార్ని టీడీపీ నేతలు నిలదీసినపుడైనా కూడా గంటా శ్రీనివాసరావు కిమ్మనలేదు. అటువంటి గంటాకు మౌనభంగం జరిగింది. ఆయనకు అత్యంత సన్నిహితుడు నలందా కిషోర్ ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేయగానే రెక్కలు కట్టుకుని వాలిపోయారు. సీఐడీ ఆఫీసు దాకా వచ్చి పరామర్శ చేయబోయారు.

కూపీ తీయడానికే….

తన అనుచరుడు బుధ్ధిమంతుడు ఏమీ తెలియని వాడు అని చంద్రబాబు మాదిరిగానే గంటా శ్రీనివాసరావు సమర్ధిస్తున్నారు. నిజానికి సోషల్ మీడియా పోస్టింగుల మీదనే ఆయన్ని అరెస్ట్ చేయలేదు, తెలుగుదేశం హయాంలో జరిగిన భూ దందాల వెనక నలందా కిషోర్ పాత్ర ఉందని నమ్మి అరెస్ట్ చేశారు. నాటి అధికార పెద్దల వెనక నీడలా ఉంటూ ఎవరి ప్రయోజనాల కోసం ఆయన చాలా పెద్ద పనులు చేశారో వాటి కూపీ లాగడానికే పిలిచారు అంటున్నారు. వైసీపీ హయాంలో కూడా ఏకంగా విజయసాయిరెడ్డినే టార్గెట్ చేయడంతోనే నలందా కిషోర్ ని సీఐడీ అధికారులు తీసుకువచ్చారని అంటున్నారు.

సవాల్ చేస్తున్నారా…?

ఇక గంటా శ్రీనివాసరావు తనతో పెట్టుకోమని వైసీపీ సర్కార్ని సవాల్ చేస్తున్నట్లుగా మాట్లాడారు. రాజకీయంగా తేల్చుకుందామని అంటున్నారు. నిజానికి గంటా మంత్రిగా ఉన్నపుడు జరిగిన భూ కబ్జాలకు ఆయన్ని బాధ్యుని చేసి నాటి టీడీపీలోని ఒక వర్గం నేతలు సహా అన్ని పార్టీలు వేలెత్తిచూపాయి. ఇక గంటా శ్రీనివాసరావు అధికారంలో ఉన్నపుడు ఆయన అనుచరులు చాలానే ఘనకార్యాలు చేశారని, వాటికి ఆయన మద్దతు ఉందని నాడు ప్రచారంలో ఉంది.గంటా శ్రీనివాసరావు మీద ఆరోపణలు వచ్చినా నాడు చంద్రబాబు సిట్ విచారణకు ఆదేశించి ఊరుకున్నారు. ఇపుడు అదే నివేదిక జగన్ చేతిలో ఉంది. ఈ సర్కార్ కూడా కొత్తగా సిట్ నియమించింది. విచారణ చేసింది. ఆ నివేదిక కూడా జగన్ వద్దనే ఉంటుంది కదా. అందువల్ల తీగ లాగారనుకోవాలి. మరి గంటా గట్టిగా వైసీపీని సవాల్ చేయడం లేదు. స్మూత్ గానే చెబుతున్నారు. ఇపుడు ఇక్కడ రాజకీయమే నడుస్తోంది. గంటా ఏ గట్టున ఉండి ఏ వాణిని వినిపిస్తున్నారు,ఏ బాణీలో వెళ్తున్నారు అన్నదే ముఖ్యం. మరి ఈ కధ కంచికి చేరుతుందా, మధ్యలో ఆగుతుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా గంటా శ్రీనివాసరావు అన్నట్లుగానే నిజంగా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Tags:    

Similar News