పొగిడినా మంత్రికి కోపమేనా?

విశాఖ రాజకీయాలు వింతగా ఉంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ విషయంలో సానుకూలంగా ఉంటున్నారు. ఆయన ఆరు నెలలు అయింది అసలు పెదవి [more]

Update: 2019-12-23 00:30 GMT

విశాఖ రాజకీయాలు వింతగా ఉంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ విషయంలో సానుకూలంగా ఉంటున్నారు. ఆయన ఆరు నెలలు అయింది అసలు పెదవి విప్పడంలేదు. తన పనేదో తానేంటో అన్నట్లుగా ఉన్నారు. ఇక టీడీపీ అధినేత జగన్ మీద ఒంటి కాలు మీద లేస్తూంటే గంటా శ్రీనివాసరావు మాత్రం కూల్ గా విశాఖలోనే ఉంటున్నారు. ఏ ఆందోళనలోనూ పాలుపంచుకోవడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే ఆయన పార్టీ మారుతారని కూడా ప్రచారంలో ఉంది. అవన్నీ అలా ఉంచితే ఇపుడు గంటా శ్రీనివాసరావు జగన్ ని తెగ పొగిడేస్తున్నారు.

విశాఖ కాపిటల్ కి జై….

విశాఖ పౌరుడిగా క్యాపిటల్ పెడతామను అంటే తాను తప్పకుండా స్వాగతిస్తానని గంటా శ్రీనివాసరావు అంటున్నారు. ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. విశాఖకు రాజధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని కూడా గంటా శ్రీనివాసరావు అంటున్నారు. ఆ విషయం తాను మంత్రిగా ఉన్నపుడు కూడా బాబుకు చెప్పానని ఆయన గుర్తు చేస్తున్నారు. ఆర్ధిక రాజధానిగా విశాఖను చేయమని తాను నాడే టీడీపీ సర్కార్ని కోరానని కూడా చెప్పుకొచ్చారు. అవన్నీ పక్కనపెడితే జగన్ విశాఖను క్యాపిటల్ సిటీని చేయడం మాత్రం మంచి పరిణామమని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ విషయంలో తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా కూడా చెప్పారు.

అవంతి గుస్సా…..

ఇలా ఒకటికి రెండుసార్లు గంటా శ్రీనివాసరావు జగన్ ని పొగొడుతూంటే జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చికాకుగా ఉంటోందట. గంటా శ్రీనివాసరావు ఏమైనా మాట్లాడుతారు, ఆయనకు అధికారం లేకపోతే నిద్రపట్టదంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి గంటా శ్రీనివాసరావు మద్దతు ఇచ్చింది ప్రజల కోసం, వారికి సంబంధించిన అంశం. అయితే ఇందులో మంత్రిగారికి కొత్త విషయాలు, రాజకీయాలు మరేమి కనబడ్డాయో తెలియదు కానీ గంటా శ్రీనివాసరావు మీద మండిపడుతున్నారు. ఎవరు ఏమనుకున్నా తమ నాయకుడు జగన్ విశాఖ అభివ్రుధ్ధికి కట్టుబడిఉన్నారని ఆయన అంటున్నారు.

ఆ భయమేనా…?

విశాఖ కనుక క్యాపిటల్ అయితే గంటా శ్రీనివాసరావు వంటి వారు వైసీపీలో చేరడం ఖాయమని అంటున్నారు. రాజధానిలో హవా చలాయించడానికి గంటా శ్రీనివాసరావు తప్పకుండా వైసీపీ గూటికి వస్తారని అంటున్నారు. ఆయన చాలాకాలం క్రితమే రావాలనుకున్నా ఆ ప్రయత్నాలకు అవంతి గండికొట్టారు. ఇపుడు వైసీపీకి కూడా గట్టి నేతలు విశాఖలో కావాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్ర రాజకీయమే విశాఖ నుంచి మొదలవుతూంటే గంటా శ్రీనివాసరావు వంటి వారిని చేర్చుకోవడానికి జగన్ సైతం ఒకే అంటారని విశ్లేషణలు ఉన్నాయి. బహుశా ఇవన్నీ ముందే ఊహించి గంటా శ్రీనివాసరావు కామెంట్స్ పాజిటివ్ గా చేసినా కూడా అవంతి ఘాటుగా రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు. మొత్తానికి విశాఖ రాజధాని కాదు కానీ రాజకీయ రగడ కూడా ఇకపై పీక్స్ లో ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News