గిడ్డిని సైడ్ చేస్తున్నారే ?

ఒకనాడు వైసీపీ అధినేత జగన్ పక్కన వెలిగిపోయిన గిరిజన నాయకురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. జగన్ అన్నను ఒక్క మాట అంటే గొడ్డలి పెట్టి [more]

;

Update: 2020-06-14 03:30 GMT

ఒకనాడు వైసీపీ అధినేత జగన్ పక్కన వెలిగిపోయిన గిరిజన నాయకురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. జగన్ అన్నను ఒక్క మాట అంటే గొడ్డలి పెట్టి నరికేస్తాను అంటూ ఏకంగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకే హెచ్చరికలు జారీ చేసిన సాహస చరిత్ర గిడ్డి ఈశ్వరిది. జగన్ ని పాడేరు రప్పించి అతి పెద్ద సభ జరిపి ఆయనకు విల్లూ బల్లెం బహుమతిగా ఇచ్చింది. వచ్చీ ఎన్నికల్లో మా జగనన్నే సీఎం అంటూ ముందుగానే జోస్యం చెప్పింది. తీరా అది ఫలించిన వేళకు గిడ్డి ఈశ్వరి ఫ్యాన్ నీడకు కాకుండా పోయారు. రాజకీయ అంచనాలు తప్పి పసుపు పార్టీలో పెద్దగా పట్టింపు లేని నేతగా మిగిలిపోయారు.

ఆమె వెనకనే ….?

గిడ్డి ఈశ్వరి వైసీపీ నుంచి శాసనసభా పక్ష ఉప నేతగా పనిచేశారు. ఆమె అసెంబ్లీలో ఉంటే అధికార టీడీపీకి వణుకేనని చెప్పాలి. ఇక టీడీపీలో అప్పటి ఎమ్మెల్యే వంగలపూడి అనితకు గట్టి సవాల్ చేయాలంటే గిడ్డి ఈశ్వరిని వైసీపీ తరఫున జగన్ రంగంలోకి దింపేవారు. అనిత దూకుడుకు సరైన జవాబు గిడ్డి అని వైసీపీలో అంతా అంగీకరించేవారు. అటువంటి గిడ్డి ఈశ్వరి ఇపుడు టీడీపీలో అనిత పక్కన సాధారణ నాయకురాలిగా నిలబడి ఉండడాన్ని ఆమె అనుచరులు సహించలేకపోతున్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా అనితను చంద్రబాబు నియమించారు. ఆమెకు పార్టీలో ప్రాధాన్యత అలా ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరి అక్కడే ఉండిపోయారు.

అదైనా దక్కుతుందా…?

ఇక చంద్రబాబు పార్టీ జిల్లా కమిటీలను ఇకపైన పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి వంతున ఏర్పాటు చేయలనుకుంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే అరకు పార్లమెంట్ కి ఒక కమిటీ ఏర్పాటు అవుతుంది. ఆ కమిటీ ప్రెసిడెంట్ గా గిడ్డి ఈశ్వరికి చాన్స్ దక్కుతుందా అని ఆమె అనుచరులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గిడ్డి ఈశ్వరి కూడా తనకు టీడీపీలో ప్రాధాన్యత‌ ఉందని తెలియాలంటే అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారుట. అయితే ఆమె కంటే ముందు ఈ పదవి కోసం అదే పార్లమెంట్ పరిధిలోకి వచ్చే విజయనరగం జిల్లా సాలూరు, కురుపాం వంటి చోట్ల నుంచి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు పోటీ పడుతున్నారుట.

వారికేనా…?

సాలూరు నుంచి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన సీనియర్ నేత భంజ్ దేవ్ ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నందువల్ల పార్టీ పదవి చేతిలో ఉంటే రాజకీయం చేయడం సులువుగా ఉంటుందని భంజ్ దేవ్ ఈ పదవి కోసం పట్టుపడుతున్నారు. ఇక మరో వైపు చూసుకుంటే ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కూడా అరకు కమిటీ ప్రెసిడెంట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక కురుపాం నుంచి శత్రుచర్ల కుటుంబం కూడా ఇదే పదవి కోసం పావులు కదుపుతోంది. వీరంతా పాత కాపులు కావడంతో చంద్రబాబు వీరివైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే గిడ్డి ఈశ్వరి మాజీ ఎమ్మెల్యేగానే ఉండిపోతారు. పార్టీ పదవులు కూడా దక్కకపోతే విపక్షంలో ఉన్నా రాజకీయంగా రాణింపు ఉండదని ఆమె వర్గం ఆవేదన చెందుతోంది. మొత్తానికి బంపర్ మెజారిటీతో 2014 ఎన్నికల్లో పాడేరు నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వరి తన అనుభవ రాహిత్యంతో అయిదేళ్లకే రాజకీయ సిరిని కాలదన్నుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News