గిడ్డి మళ్లీ ఛేంజ్… టీడీపీలో ఉండలేరట.?

విశాఖ జిల్లా రాజకీయాల్లో బలం పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీ ఫిరాయింపు నాయకుల కోసం సెర్చ్ లైట్ పెట్టి మరీ వెతికేస్తోంది. సోము వీర్రాజు ఏపీ ప్రెసిడెంట్ అయ్యాక [more]

Update: 2021-01-18 08:00 GMT

విశాఖ జిల్లా రాజకీయాల్లో బలం పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీ ఫిరాయింపు నాయకుల కోసం సెర్చ్ లైట్ పెట్టి మరీ వెతికేస్తోంది. సోము వీర్రాజు ఏపీ ప్రెసిడెంట్ అయ్యాక ఉత్తరాంధ్రా జిల్లాల్లోనే ఎక్కువ టూర్లు వేశారు. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర అయిదు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తే ఏపీలో పటిష్టమైన శక్తిగా ముందుకు దూసుకు రావచ్చు అని మాస్టర్ ప్లాన్ వేశారు. అయితే అది పెద్దగా వర్కౌట్ కావడంలేదు. అతి రధ మహారధులందరికీ బీజేపీ నుంచి ఆహ్వానం వెళ్ళినప్పటికీ వారు ఇప్పటికీ సైలెంట్ గానే ఉన్నారు.

ఏజెన్సీ నుంచే బోణీ …

ఇక బీజేపీ మరో కొత్త ప్లాన్ వేస్తోంది. ఏజెన్సీ నుంచే ఎదగాలన్నదే బీజేపీ లేటెస్ట్ అజెండా. జార్ఖండ్ మాదిరిగా ఏపీలో కూడా గిరిజన వర్గాల్లో పట్టు సాధిస్తే బీజేపీకి బలం దానంతట అదే వస్తుందని కూడా ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ వైసీపీలలో ఉన్న నేతలకు గేలం వేస్తున్నారు. ఈ గేలానికి విశాఖ జిల్లా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చిక్కిందని అంటున్నారు. ఆమె వైసీపీలో ఉన్నపుడు ఫైర్ బ్రాండ్ గా ఉండేవారు. జగనన్నకు అచ్చమైన చెల్లిగా కూడా వ్యవహరించారు. ఎపుడైతే టీడీపీలోకి వెళ్లారో నాటి నుంచి ఆమె ప్రాభవం ఒక్కసారిగా తగ్గిపోయింది.

అలా వదిలేశారుగా……?

ఇక టీడీపీలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి సైకిల్ ఎక్కించిన పార్టీ పెద్దలు తీరా కండువా కప్పుకున్నాక మాత్రం అలాగే వదిలేశారు. రాజకీయంగా ఏమీ కానీ ఎమ్మెల్యే గా కూడా లేని కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కి మంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనుకున్న బాబు గిడ్డి ఈశ్వరిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక 2019 ఎన్నికల్లో టికెట్ మాత్రం ఇచ్చారు. జగన్ వేవ్ లో ఆమె ఓటమి పాలు అయ్యారు. నాటి నుంచి చంద్రబాబు సహా పార్టీ పెద్దలు ఆమె గురించి వాకబు చేయలేదు అంటున్నారు. పార్టీ పదవులు అందరికీ పంచినా కూడా గిడ్డి ఈశ్వరికి ఉత్త చేయే చూపించారు. దీంతో రగిలిపోతున్న గిడ్డి ఈశ్వరి వైసీపీలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నం చేశారు.

అదే సేఫ్ ప్లేస్ గా…?

ఇక జగన్ అయితే గిడ్డి ఈశ్వరిని పార్టీలోకి తీసుకోవడానికి నో చెప్పేసి డోర్స్ క్లోజ్ చేసేశారు. ఈ పరిణామాలతో ఎటూ తోచకుండా ఉన్న ఆమెను బీజేపీ వైపు నడిపించడంతో కమలం పార్టీ పెద్దలు సక్సెస్ అయ్యారని అంటున్నారు. గిడ్డి ఈశ్వరికి కూడా ఇపుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించిన ఆఫర్ వేరేది లేదు అని కూడా అంటున్నారు. మొత్తానికి గిడ్డి ఈశ్వరి బీజేపీకి చేరడం అన్నది ఖాయమైపోయిందని అంటున్నారు. ఆమె బీజేపీలో చేరితే పార్టీ ఏజెన్సీలో ఎంతో కొంత బతుకుతుదని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. నోరున్న నేత కావడమే కాదు, వైసీపీ, టీడీపీలో పనిచేయడం వల్ల నరుగా ఆ పార్టీ అధినాయకత్వాల మీద దూకుడుగా బాణాలు వేయగలదు అని కూడా కమలం పార్టీ వ్యూహ కర్తలు భావిస్తున్నారు. మొత్తానికి గిడ్డి ఈశ్వరికి కమల తీర్ధం ఇప్పించడమే తరువాయి అంటున్నారు.

Tags:    

Similar News