గోరంట్ల తప్పుకునే సమయం వచ్చిందట
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి ఆ పార్టీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. టిడిపి ఏర్పాటు [more]
;
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి ఆ పార్టీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. టిడిపి ఏర్పాటు [more]
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి ఆ పార్టీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. టిడిపి ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు పార్టీ మారకుండా జెండా మోస్తూ ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఎమ్యెల్యే టికెట్ ను ఒకే పార్టీ నుంచి అందుకున్న అతి తక్కువ మందిలో ఆయన కూడా ఒకరు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరుసార్లు గెలుపొంది చట్టసభలో తనదైన బాణి తో ఆకట్టుకుంటూ వస్తున్నారు. గత రెండు దఫాలుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ దక్కడం మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల్లో చాలా కష్టం అయ్యింది. లోకేష్ ప్రభంజనం మొదలయ్యాక సీనియర్లకు సెలవు ఇచ్చి కొత్త రక్తం ఎక్కించాలనే ప్రయత్నంలో గోరంట్లకు టికెట్ లేదనే చెప్పేశారు. అర్బన్ లో బిజెపి పొత్తు సైతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయ జీవితానికి బ్రేక్ పడేలా చేస్తుందనే అంతా అనుకున్నారు. అయితే అధిష్టానంలో తనకు ఉన్న పట్టును మరోసారి నిరూపించుకుంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎనిమిదోసారి టికెట్ దక్కించుకున్నారు. అయితే రూరల్ నియోజకవర్గానికి ఆయన షిఫ్ట్ కావాలిసివచ్చింది. అక్కడ గెలుపు తీరం చేరిన ఆయన తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని 2019 లో జగన్ సునామీని ఎదిరించి నిలిచిన 23 మందిలో ఒకరుగా నిలవడం గమనార్హం.
తాజా రాజకీయాలపై అసంతృప్తి తో..
ఇటీవలి రాజకీయ పరిణామాలు గత దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీ నడుస్తున్న తీరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తి రగిలిస్తూ వస్తుందన్నది పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తూ వచ్చాయి. వైసిపి నుంచి గత టిడిపి హయాంలో 23 మంది ఎమ్యెల్యేలను పార్టీలోకి తీసుకోవడం వారిలో కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టడం గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాహాటంగానే వ్యతిరేకించారు. ఇది టిడిపి కి నష్టం తెచ్చి పెడుతుందని అధినేతను హెచ్చరించారు కూడా. అలా పార్టీ అభివృద్ధికి ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే కొద్ది మందిలో ఒకరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చే ఎన్నికల్లో రాజకీయాలనుంచి తప్పుకుంటారు అనే ప్రచారం ఇటీవల ఎక్కువైంది. వయోభారం రీత్యా, ఎన్నికల్లో పెరిగిన ధన ప్రమేయం పార్టీలో పలు అంతర్గత అంశాలను విభేదిస్తున్న నేపథ్యంలో తన ప్రస్థానం ముగించాలని ఆయనకూడా భావిస్తున్నారని అంటున్నారు. ప్రతి ఎన్నికల ముందు ఇదే నా చివరి ఎన్నికలు అని ప్రకటించే గోరంట్ల మాటల్లో నిజం ఎంత అన్నది భవిష్యత్తులోనే చూడాలి.
వారసుడు రెడీ …
గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి ఇద్దరు కుమార్తెలు. వీరిద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. అలాగే భార్య జాన్సీ కి కానీ కుమార్తెలకు రాజకీయాలపై ఆసక్తి లేదంటారు. అయితే గోరంట్ల ఎన్నికల్లో నిలబడిన సమయంలో మాత్రం వారు ప్రచారంలో సహకరిస్తూ ఉంటారు. ఇక మరి ఆయన తదనంతరం రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునే వారిపై ఒక్కరిపైనే అందరిలో చర్చ సాగుతుంది. ఆయన సోదరుడు కుమారుడు డా. గోరంట్ల రవి రామ్ కిరణ్ రాజకీయాలపై ఆసక్తి తోగోరంట్ల బుచ్చయ్య చౌదరికి గత ఎన్నికలనుంచి చేదోడు వాదోడుగా నడుస్తున్నారు. ప్రత్యక్ష వేదికలపై ఎక్కడా కనిపించని రవి రామ్ కిరణ్ బుచ్చయ్య బ్యాక్ ఆఫీస్ సోషల్ మీడియా వ్యవహారాలు నడిపిస్తున్నారని తెలుస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజకీయ వారసుడిగా రవి రామ్ కిరణ్ ను దింపుతారని అంటున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల అర్బన్, రూరల్ రెండిటికి పార్టీ సారధ్యం తనదే అని చెబుతారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు అర్బన్ నుంచి రవి రామ్ కిరణ్ ను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. రూరల్ స్థానాన్ని బిసి సామాజిక వర్గానికి కేటాయించి గోరంట్లకు ఎంతో పట్టున్న అర్బన్ నుంచి తన వారసుడిని పోటీలో పెట్టె ఆలోచనలో ఉన్నారని సాగుతున్న ప్రచారం లో నిజం ఎంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు తేలదు.