ఈ ఎంపీగారు… అలా మారిపోయార‌ట‌.. హిందూపురం టాక్

గోరంట్ల మాధ‌వ్ పోలీసు ఆఫీస‌ర్‌గా ఉంటూ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. వైసీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. పోలీస్‌గా ఉన్నప్పుడే.. రెబ‌ల్‌గా పేరు తెచ్చుకున్న గోరంట్ల మాధ‌వ్ సాక్షాత్తూ అప్పటి [more]

Update: 2020-06-29 14:30 GMT

గోరంట్ల మాధ‌వ్ పోలీసు ఆఫీస‌ర్‌గా ఉంటూ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. వైసీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. పోలీస్‌గా ఉన్నప్పుడే.. రెబ‌ల్‌గా పేరు తెచ్చుకున్న గోరంట్ల మాధ‌వ్ సాక్షాత్తూ అప్పటి అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డిపైనే మీసం మెలేశారు. ఈ క్రమంలోనే రాజ‌కీయ బాట ప‌ట్టారు. హిందూపురం నుంచి అనూహ్య రీతిలో ఎంపీ టికెట్ సంపాయించుకుని వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఇప్పటికీ.. గోరంట్ల మాధ‌వ్ లో పోలీసు ల‌క్షణాలు పోలేద‌ని అంటున్నారు ఇక్కడి నాయ‌కులు. దురుసు ప్రవ‌ర్తన‌, క‌రుకుగా మాట్లాడ‌డం వంటివి ఆయ‌న‌ను ప్ర‌జ‌ల‌కు దూరం చేస్తున్నాయ‌ని చెబుతున్నారు.

ప్రజలకు చేరువ కావడంలో….

నిజానికి పోలీస్‌గా ప్రజ‌ల‌కు చేరువ కావ‌డం వేరు. ఓ ప్రజాప్రతినిధిగా ప్రజ‌ల‌కు చేరువ కావ‌డం వేరు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. నేనున్నాన‌నే ధీమాను ప్రజ‌ల‌కు క‌లిగించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిపై ఉంటుంది. కానీ, హిందూపురం నుంచి గెలిచిన గోరంట్ల మాధ‌వ్ మాత్రం ఈ విధానాన్ని ప‌క్కన పెట్టార‌ని అంటున్నారు. ప్రజ‌ల‌ను క‌లిసేందుకు ముందు.. త‌న అనుచ‌రుల అనుమ‌తి కావాల‌ని అంటున్నారు. అదే స‌మయంలో స‌మ‌స్య ఏంటో ముందుగానే వివ‌రించాల‌ని ష‌ర‌తు పెడుతున్నార‌ట‌. అదే స‌మ‌యంలో కింది స్థాయి అనుచ‌రుల చేతి వాటం విష‌యాన్ని గ‌మ‌నించినా.. చూస్తూ ఊరుకుంటున్నార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద చ‌ర్చ సాగుతోంది.

నిమ్మల కిష్టప్ప ఒకవైపు….

ఈ ప‌రిణామాలు ఇలా ఉంటే.. త‌న‌కు సంబంధం లేని విష‌యాల‌ను కూడా గోరంట్ల మాధ‌వ్ భుజాన వేసుకుంటున్నారు. పార్లమెంటులో గ‌ళం వినిపించ‌డంలో వెనుక‌బ‌డిపోయార‌ని, ఇటీవ‌ల లోక్‌స‌భ విడుద‌ల చేసిన ఎంపీల ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టు స్పష్టం చేస్తున్నా.. గోరంట్ల మాధ‌వ్ మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు చేయ‌డంలో మాత్రం దూకుడుగా ఉంటున్నారని అంటున్నారు. దీంతో.. టీడీపీ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. చాప కింద నీరు మాదిరిగా ప్రజ‌ల‌కు మ‌ళ్లీ చేరువ అవుతున్నారు. వారి త‌ర‌ఫున గ‌ళం వినిపిస్తున్నారు. ప్రభుత్వ ప‌థ‌కాల‌పై విమ‌ర్శలు చేస్తున్నారు.

ఆన్ లైన్ సర్వేలోనూ…..

కానీ గోరంట్ల మాధ‌వ్ మాత్రం ఈ విష‌యాల‌ను ప‌క్కన పెట్టి జేసీ వ‌ర్గంపై దాడులు చేయ‌డం ఎలా? పైచేయి సాధించ‌డం ఎలా? అనే విష‌యాలతోనే కాలం గ‌డుపుతున్నార‌ని, వెన‌క‌ప‌డిన హిందూపురం ప్రాంతానికి ఏయే ప‌నులు చేయాలి ? ఇక్కడ అభివృద్ది ప‌నులు ఎలా చేప‌ట్టాలి ? అనే విష‌యంపై గోరంట్ల మాధ‌వ్ ఏ మాత్రం దృష్టి పెట్టడం లేద‌న్న విమ‌ర్శలు ఉన్నాయి. తాము భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆయ‌న ఇలా మార‌తార‌ని తాము ఊహించ‌లేద‌ని స్థానికులు అభిప్రాయ‌పడుతున్నారు. ఇటీవ‌ల ఆన్‌లైన్ మీడియా ఒక‌టి చేసిన ఇంట‌ర్వ్యూలోనూ ప్రజ‌లు ఇదే అభిప్రాయం చెప్పడంతో గోరంట్ల మాధ‌వ్ వ్యవ‌హారం ఆల‌స్యంగా వెలుగు చూసింది. మ‌రి.. దీనిపైనా ఆయ‌న రుస‌రుస‌లాడ‌తారో.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను విశ్లేషించుకుని మార్చుకుంటారో చూడాలి.

Tags:    

Similar News