ఈ వైసీపీ మ‌హిళా ఎంపీకి మంచి మార్కులే ?

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎంపీల్లో కొంద‌రు చాలా కూల్‌గా ప‌నిచేస్తున్నార‌నేది అధిష్టానం మాట‌. చాలా మంది ఎంపీలు వారి సొంత వ్యవ‌హారాలు, వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారు. [more]

;

Update: 2021-05-24 02:00 GMT

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎంపీల్లో కొంద‌రు చాలా కూల్‌గా ప‌నిచేస్తున్నార‌నేది అధిష్టానం మాట‌. చాలా మంది ఎంపీలు వారి సొంత వ్యవ‌హారాలు, వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారు. న‌లుగురైదుగురు ఎంపీలు మాత్రమే కాస్త ప్రజ‌ల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. వారిలో ఒకరిద్దరికి పార్టీ అధిష్టానం ద‌గ్గర మంచి మార్కులు కూడా ప‌డ్డాయి. ఈ క్రమంలోనే ఓ మ‌హిళా ఎంపీ కూడా అధిష్టానం ద‌గ్గర మంచి మార్కుల లిస్టులో ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఆమె ఎవ‌రో కాదు అర‌కు ఎంపీ గొట్టేటి మాధ‌వి. విద్యావంతురాలు అయిన ఆమె పాడేరు క‌మ్యూనిస్టు యోధుడు, మాజీ ఎమ్మెల్యే దేవుడు కుమార్తె. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి రావ‌డంతోనే ఎంపీ అయిన గొట్టేటి మాధ‌వి వివాదాల‌కు అత్యంత దూరంగా ఉంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా ప‌ర్యట‌న‌లు చేస్తూ… ఎప్పుడూ స్థానికంగానే ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు.

ఇచ్చిన హామీలను….?

ముఖ్యంగా పార్లమెంటులో గిరిజ‌న స‌మ‌స్యల‌పై ప్రశ్నలు సంధిస్తున్నారు. అర‌కు పార్లమెంటు ప‌రిధి నిజానికి చాలా పెద్దది. మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. సుదూర ప్రాంతాల్లోని గిరిజ‌నుల‌కు ఇప్పటికీ ర‌హ‌దారుల సౌక‌ర్యం లేదు. అదేస‌మయంలో వారికి మౌలిక స‌దుపాయాలు, విద్య వైద్యం వంటివి కూడా చాలా వ‌ర‌కు అంద‌డం లేదు. తాను ఎంపీ అయితే..ఈ స‌మ‌స్యల‌పై దృష్టి పెడ‌తాన‌ని గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో గొట్టేటి మాధ‌వి ప్రక‌టించారు. అనుకున్నట్టుగానే ఆమె.. ఈ ఏడాది ప్రారంభం నుంచి కొన్ని గిరిజ‌న గ్రామాల‌కు ర‌హ‌దారులు వేయించే ప‌నిప్రారంభించారు.

స్థానికంగానే ఉంటూ…

అదే స‌మ‌యంలో ప్రభుత్వం తీసుకువ‌చ్చిన వ‌లంటీర్ల వ్యవ‌స్థను గిరిజ‌న ప్రాంతాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ప‌థ‌కాలు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందేలా చేయ‌డంలో గొట్టేటి మాధ‌వి బాగా కృషి చేస్తుండ‌డంతో ఎంపీ విజ‌య‌సాయి సైతం ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. నిజానికి ఇక్కడ 2009లో గెలిచి కేంద్ర మంత్రి అయిన సీనియ‌ర్ నేత కిషోర్ చంద్రదేవ్‌, 2014లోనూ వైసీపీ నుంచి కొత్తప‌ల్లి గీత ఎంపీలుగా గెలిచినా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్పుడూ ఉండ‌లేదనే అప‌వాదు ఎదుర్కొన్నారు. గొట్టేటి మాధ‌వి స్థానికంగానే నివాసం ఉండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారు.

అందరితో కలుపుగోలుగా?

కేవ‌లం పార్లమెంటు స‌మావేశాల స‌మ‌యంలోనే గొట్టేటి మాధ‌వి ఢిల్లీలో ఉంటున్నారు త‌ప్ప.. మిగిలిన స‌మ‌యంలో ఆమె నియోజ‌క‌వ‌వ‌ర్గంలోనే ఉంటున్నారు. జిల్లా పార్టీ నేత‌ల‌తో పాటు నాలుగు జిల్లాల్లో ఉన్న ఆమె పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌తో ఎలాంటి వివాదాల‌కు తావివ్వనివిధంగా అందరితోనూ క‌లుపుగోలుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇటు పార్టీలోను, అటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ మ‌చ్చలేని నాయ‌కురాలిగా ముందుకు సాగుతున్నారు. ఏ ప‌ని ఉన్నా.. త‌న‌కు స‌మాచారం అందిస్తే.. స్వయంగా గొట్టేటి మాధ‌విఆ ప‌నిచేస్తున్నార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో ఆమెకు జ‌గ‌న్ ద‌గ్గర మంచి మార్కులు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు సీనియ‌ర్లు.

Tags:    

Similar News