జగన్ … ఇది ఏపీ ఉద్యోగి మనసులో మాట వినవూ?

మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు అనే సామెత ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులకు సరిగ్గా సరిపోతుంది. చాలావరకు ఉద్యోగులు నిరుపేద, రైతు కుటుంబాలనుండి వచ్చిన వారే అయితే [more]

;

Update: 2020-04-05 05:00 GMT

మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు అనే సామెత ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులకు సరిగ్గా సరిపోతుంది. చాలావరకు ఉద్యోగులు నిరుపేద, రైతు కుటుంబాలనుండి వచ్చిన వారే అయితే ఉద్యోగంలో చేరాక వీరికి కొంతవరకు ఆర్థికంగా భరోసా ఏర్పడింది. నెలకు ఠంచనుగా జీతం వస్తుందనే అభిప్రాయం సహజంగా వీరిలో ఉంటుంది. తమకి వచ్చే జీతం ఆధారంగా తమ జీవన విధానాన్ని మలచుకొని ఉంటారు. తన మీద ఆధారపడిన తల్లి, తండ్రి, భార్య, పిల్లలనుచూసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ, బాడుగ ఇంటిలో పెరుగుతున్న నిత్యావసర ధరలను తట్టుకుంటూ కాలం గడుపుతు వస్తున్నాడు సగటు ఉద్యోగి.

నల్లడబ్బు వెనకేసుకోరు….

ఉద్యోగులకు ఏం? నెలకు ఠంచనుగా జీతం చేతికి వస్తుంది. ఎలాంటి కష్టాలు లేవు. అని అసూయపడేవారు చాలామందే ఉన్నారు. కానీ అతను కష్టపడి చదివి ఉద్యోగంలో చేరాడని కష్టానికి తగిన ఫలితం పొందాడని అభినందించే వారు తక్కువగానే ఉంటారనేది వాస్తవం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఉద్యోగంలోకి చేరాక ప్రభుత్వం సామాన్య ప్రజలకు కల్పించే సకల సౌకర్యాలు ఉద్యోగి కోల్పోతాడు. ఉదాహరణకి ఉద్యోగి కుటుంబసభ్యులకి భరోసా పెన్షన్, రేషన్, ఉచిత ఇళ్ళు, ఉచిత ఆరోగ్యశ్రీ, ఉపాధిహామీ పథకాలు వంటి ఏపథకం ఉద్యోగికి వర్థించదు. ఇక్కడ గుర్తించు కోవాల్సిన విషయం ఏమంటే ఉద్యోగి తను తీసుకునే ప్రతి రూపాయి జీతంపై ఆణా పైసాతో సహ పన్నులు చెల్లిస్తాడు, వ్యాపారం చేసేవారిలా నల్లడబ్బు వెనకేసుకోవడానికి అవకాశం గాని(లంచగొండి ఉద్యోగులగురించి కాకుండా సాధారణ ఉద్యోగిని దృష్టిలో పెట్టుకొని), సామాన్య ప్రజలకు వచ్చే ఆదాయం పై పన్నురాయితీ వంటి అవకాశం ఉద్యోగికి ఉండదు. ఉద్యోగి తనకు ఆరోగ్య రక్షణ కావాలంటే నెలవారీ చందా చెల్లించాల్సిందే.అయితే ప్రస్తుతం ఉద్యోగుల ఆరోగ్య కార్డులు నాలక గీసుకోవడానికి కూడా పనికిరావు అన్న విమర్శ కూడా వినపడుతోంది.

ఉచిత పథకాలు పెరగడం వల్లనే….

ఇక మూలిగే నక్కపై తాటిపండు అని ఎందుకన్నానంటే వచ్చే నెల జీతంతో కుటుంబ జీవనం హాయిగా చేసే సగటు ఉద్యోగికి జేఏసీ ల నాయకుల నిర్వాకం వలన, సగటు ఉద్యోగుల సమస్యలు అవగాహన చేసుకోలేని ఏసి రూం సంఘ నాయకుల వలన, వారి బావిలో కప్ప ఆలోచన వలనప్రభుత్వం జేఏసీ నాయకుల అంగీకారంతో జీవో నంబర్ 26/31-03-2020 ని ఇవ్వడం జరిగింది దీనిప్రకారంగ్రూప్స్ కేడర్ వారికి 40శాతం ,ఇతర ఉద్యోగులకు 50శాతం, నాలగవతరగతి ఉద్యోగులకు 90శాతం జీతం ఒక విడతలో. మిగిలినది రెండవ విడతలో ఇస్తామని తెలిపింది. దీనికి కారణం కరోనా ఆర్థికమాంద్యం అని వివరించింది. ఇది ఎంత మాత్రం వాస్తవంకాదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంనుండి విడిపోయాక ఆర్థికవనరులకి గుండెకాయలాంటి హైదరాబాద్ ని వదలుకొని ఉత్తిచే తులతో ఏర్పడి నవ్యాంధ్రప్రదేశ్ లో ఎపుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు క్రమక్రమంగా ఆర్థికంగా ఎదిగి అటు ప్రజలకు ఇటు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. అయితే ఉచితపథకాలు పెరగడం వలన అప్పులు పెరిగాయనడం వాస్తవం. అయినా ఈ పథకాలు కొంతవరకు ప్రజలలో కష్టపడే తత్వం తగ్గించాయి.

రెండో విడత ఎప్పుడు?

మరి రెండు విడతల జీతం వలన ఉద్యోగికి వచ్చే నష్టం ఏంటి? ఎపుడైనా జీతం వస్తుందిగా? అని కొందరి వాదన. కాదనడంలేదు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఆర్థిక పరిస్థితి బాగుపడ్డాక రెండవ విడత ఇస్తాం అని ప్రభుత్వం చెబుతోంది. ఇది ఎపుడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా సగటు ఉద్యోగికి మిగిలి పోతోంది. ఒకవేల 50 శాతం విడతల వారిగా ఇస్తాం అని చెప్పే అవకాశాలు లేకపోలేదు…అపుడు సగటు ఉద్యోగి పరిస్థితి ఏమిటి రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువలేదు కదా?

మాకు ఎందుకు బాధంటే…?

ఇంతకీ ఉద్యోగి ఎందుకు బాధ పడుతున్నాడు? అసలే గత నెల ఇన్ కంటాక్స్ పోను చేతికందిన జీతం సగంక న్నా తక్కువ కొందరికి నెలజీతం మొత్తం టాక్స్ కే సరిపోయింది. పైగా సేవింగ్స్ పాలసీలు కట్టేందుకు అంతకు ముందు జీతం సరిపోయింది. కొందరు అప్పులుకూడా చేశారు. వీటికి తోడు పర్సనల్ లోన్లు ,ఇంటిలోను వాయిదాలు వంటివి కలిసి ఉద్యోగిని అప్పులపాలు చేశాయి. అంటే జనవరి నెలనుండి ఉద్యోగికి జీతం మిగలక అప్పులు చేసేపరిస్థితి ఉంటే…ఇపుడు మొత్తం జీతం చేతికి వస్తుంది కొంచెం వెసులుబాటు వస్తుంది అని ఆలోచించే లోగా జేఏసీ నాయకుల రూపంలో సగటు ఉద్యోగి గొంతులో వెలక్కాయ పడింది. చాలామంది కోట్లరూపాయలు చందాగా ఇస్తున్నారు (ఉద్యోగులుకూడా ఒకరోజు మూలవేతనం 100కోట్లు చందా ఇవ్వడానికి ఒప్పుకున్నారు) కేంద్రప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజి తో పాటు మూడునెలల రేషన్ ఇస్తోంది, కరోనా కట్టడికి కృషి చేసేవారు ప్రభుత్వ ఉద్యగులే, అదీకాక కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వేతనంలో ఎలాంటి కోత లేకుండా ఇవ్వాలని చెబుతోన్నా…. ఎన్నో విపత్కర సమయాలలో ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలిచినా కూడా ఈ రెండు విడతల జీతం జీవో ఇవ్వడంపై ఉద్యోగులు పెదవి విరస్తున్నారు.

ఎన్ని వాగ్దానాలు చేసి…..

ఉద్యోగులు స్వేచ్చగా పనిచేసే వాతావరణం కల్పించడంతో పాటు సమయానికి కరువుభత్యం, పీఆర్సీ లు ఇస్తామని అధికారంలోకి వచ్చి నాలుగు కరువుభత్యాలు, పే రివిజన్ కమిషన్ కాలపరిమితి గడచి రెండేళ్ళు అవుతున్నా స్పందన లేకపోవడం, మాట ఇచ్చినట్లు సీపీఎస్ రద్దుకి ముందడుగు పడక పోవడం, ఏకీకృత సర్వీస్ రూల్స్ వంటి ఉద్యోగ సమస్యల ముందు ఐఆర్ 27 శాతం ఇచ్చి వృధాగా మారింది.. నిక్కచ్చిగా చెప్పాలంటే సలహాలు ఇచ్చే వారి స్వంత ఆలోచనల వలన ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య దూరం పెరుగుతుందన్నది వాస్తవం కావున ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలపై ఆచితూచి ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సోషల్ మీడియాలో ఈ లేఖ వైరల్ అవుతుంది.

 

– ఏపీలోని ఒక ప్రభుత్వ ఉద్యోగి

Tags:    

Similar News