ఆమె ఆశలకు గుమ్మడి కాయ కొట్టేశారట ?

విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనది. ఇక్కడ మొదట్లో టీడీపీ ప్రభంజనమే సాగింది. గిరిజన దొర అయిన భంజ్ దేవ్ వరసగా గెలిచారు. అయితే ఆయన [more]

;

Update: 2020-10-14 00:30 GMT

విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనది. ఇక్కడ మొదట్లో టీడీపీ ప్రభంజనమే సాగింది. గిరిజన దొర అయిన భంజ్ దేవ్ వరసగా గెలిచారు. అయితే ఆయన 2004 ఎన్నికల్లో గెలిచినా కోర్టు తీర్పుతో పదవి పోయింది. దాంతో నడి మధ్యలో ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజన్నదొర ఇప్పటికి దశాబ్దన్నర కాలంగా పట్టు బిగించేశారు. గిరిజన దేవుడిగా మారిపోయారు. ఆయనతో పోటీకి దిగిన ప్రతీసారి ఓడుతున్న ఆర్ పీ భంజ్ దేవ్ రాజకీయం ఇపుడు చరమాంకానికి చేరుకుంది. దాంతో ఈ సీటు నుంచి పోటీకి టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తయారుగా ఉన్నారు.

అభ్యర్ధించినా…..

తనకు సాలూరు టీడీపీ ఇంచార్జి పదవి కావాలని ఆమె నేరుగా అభ్యర్ధించినా కూడా టీడీపీ అధినాయకత్వం అసలు పట్టించుకోలేదు. ఆమెను ఏకంగా అరకు ఎంపీ సీటుకు ప్రెసిడెంట్ చేసింది. అరకు ఎంపీ సీటుకు గతంలో పోటీ పడి ఓడిన సంధ్యారాణీ ఎమ్మెల్యే మీదనే గురి పెట్టి ఉన్నారు. ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వం కూడా వచ్చే ఏడాది మార్చితో పూర్తి అయిపోతుంది. దాంతో తానే కాబోయే ఎమ్మెల్యే అని ఆమె కలలు కన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎంపీ సీటు ఇచ్చి ఆశలకు గుమ్మడి కాయ కొట్టేసారు.

దిగులుతోనే అలా……

అరకు పార్లమెంట్ సీటు అంటేనే చాలా పెద్దది, ఇక రేపటి రోజున మళ్ళీ ఎన్నికలు జరిగినా టీడీపీ గెలిచేటంత సీన్ లేదు. అక్కడ వైసీపీకి గట్టి పట్టు ఉంది ఆ మాటకు వస్తే సాలూరులోనూ రాజన్న దొరకే జనం జై అంటారు. కానీ పరిస్థితులు ఏమైనా మారితే మూడుసార్లు గెలిపించిన జనంలో మార్పు రావచ్చునని గుమ్మడి సంధ్యారాణి భావిస్తున్నారుట. అంతే కాదు సాలూరు నియోజకవర్గం పరిధిలో రాజకీయాలు చేసుకోవాలని కూడా ముందే ఫిక్స్ అయ్యారుట. కానీ చంద్రబాబు మాత్రం ఆమెను సాలూరు నుంచి కదిపేసారు. కోరిన పదవి ఇవ్వకుండా పంపేశారు అని ఆమె అభిమానులైతే మండిపడుతున్నారుట.

కొత్తవారికేనా….?

మరో వైపు భంజదేవ్ వర్గానికి కూడా నిరాశ కలిగించేలా టీడీపీ అధినాయకత్వం నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఈసారి సాలూరు నుంచి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, ఆ విధంగా నూతన తరాన్ని ముందుకు తేవాలని పెదబాబు, చినబాబు ఆలోచిస్తున్నారుట. అందుకే అక్కడ ఇంచార్జి పదవికి ఖాళీగా ఉంచారని టాక్. సాలూరులో రానున్న రోజుల్లో కొత్త ముఖాన్ని పెట్టి ప్రయోగం చేయాలని బాబు భావించడంతో వెనక ఒక రాజకీయ మంత్రాంగం కూడా ఉందని అంటున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా రెండవ వారు ఓడిస్తున్నారు కాబట్టి మధ్యేమార్గంగా మరో నాయకుడిని బరిలోకి దింపాలన్నది ఆలోచనగా ఉందిట. చూడాలి మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే సాలూరు టీడీపీ అసంతృప్తితో సలసలమని మరుగుతోంది.

Tags:    

Similar News