జగన్ ఇక మాకు దరువేనా…?

విశాఖ రాజధాని అంటే కొన్ని వర్గాలు మాత్రమే స్వాగతించే పరిస్థితి ఉంది. విశాఖలో ఇప్పటికే మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు ఆర్ధికంగా గట్టిగా నిలదొక్కుకునే పరిస్థితి లేదు [more]

;

Update: 2019-12-28 15:30 GMT

విశాఖ రాజధాని అంటే కొన్ని వర్గాలు మాత్రమే స్వాగతించే పరిస్థితి ఉంది. విశాఖలో ఇప్పటికే మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు ఆర్ధికంగా గట్టిగా నిలదొక్కుకునే పరిస్థితి లేదు అన్న మాట ఉంది. విశాఖ మామూలు కార్పోరేషన్ గా ఉంటే 2005లో దాన్ని మహా విశాఖ నగర పాలక సంస్థగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ చేశారు. దాంతో విశాఖలో ఒక్కసారిగా జన జీవితం కాస్టిలీగా మారిపోయింది. ఆ తరువాత స్మార్ట్ సిటీ అనడంతోటే ఇంటి అద్దె ధరలు దారుణంగా పెరిగిపోయాయి.

అదే భయం…

విశాఖలో పదేళ్ల క్రితం వరకూ కేవలం మూడు వేలు నుంచి అయిదు వేలు మాత్రమే ఉండే ఇంటి అద్దెలు స్మార్ట్ సిటీ పేరు చెప్పుకుని డబల్, త్రిబులు గా పెరిగిపోయాయి. ఇక విశాఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉండదం, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో లక్షల జీతాల వారు అద్దె ఎంతైనా చెల్లించే పరిస్థితి ఉంది. ఇక విద్యాసంస్థలు ఉండడంతో కూడా ఫ్లోటింగ్ బాగానే పెరిగింది. దాని వల్ల కూడా అద్దెల దరువు బాగా మోగుతూ వచ్చింది.

రాజ మార్గమే…

ఇపుడు విశాఖను ఏకంగా రాజధాని అంటున్నారు. అదే కనుక చేస్తే కనీసం ఇంటి ధర పదివేలకు ఎగబాకడం ఖాయమని చెబుతున్నారు. విశాఖ హార్ట్ ఆఫ్ ది సిటీ మాత్రమే కాదు, అన్ని చోట్లా కూడా ఇదే పరిస్థితి ఉంది. దానికి తోడు సచివాలయం అంటే యాభై వేల మంది ఉద్యోగులు ఇక్కడకు దిగుమతి అవుతారు. వారితో పాటు కుటుంబాలు, రాకపోకలు, ఆ బిజినెస్ వేరేగా ఉంటుంది. దాంతో విశాఖతో పాటు శివారు ప్రాంతాలలో కూడా అద్దె ఇల్లు అంటే అదిరిపోయే రేటు ఉంటుందని అంటున్నారు.

రెక్కలు విప్పుతాయా…?

ఇప్పటికే విశాఖలో సామాన్యుడు గజం జాగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. విశాఖకు దాదాపు ముప్పయి కిలోమీటర్ల దూరంలో కూడా గజం పదివేలకు పై చిలుకు రేటు ఉంది. రాజధాని పేరు చెప్పుకుని దాన్ని రెట్టింపు చేస్తే ఇక మధ్యతరగతి వర్గాలకు సొంత ఇల్లు కలగానే మిగిలిపోతుందన్న ఆందోళన కూడా ఉంది. అంతే కాదు, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాలలో గజం ఇపుడు పదివేలు ఉంది. అక్కడ ఈ దెబ్బకు రియల్ రేట్లు డబుల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

దొరికిపోతారా…?

ఇక మూడు జిల్లాల్లో ఎనభై శాతం మంది పేదలు, మధ్యతరగతి వర్గాలే. సర్కార్ కొలువులు చేసుకునే వారు, ధనవంతులు బాగానే ఉంటారు కానీ ఈ వర్గాలే రాజధాని పేరిట జరిగే దందాలకు, దరువులకు దొరికిపోతారని అంటున్నారు. దీంతోనే విశాఖలో రాజధాని అంటే ఈ వర్గాలు మౌనంగానే ఉంటున్నాయి. రాజధాని ఫలాలు కూడా కొందరికే అందుతాయన్న బలమైన అభిప్రాయం కూడా జనంలో ఉంది.

Tags:    

Similar News