పేదలకు ఇళ్లు కలిసొచ్చినా… వైసీపీకి కలిసి రావడం లేదా..?
రాష్ట్రంలో వైసీపీ సర్కారు తీసుకువచ్చిన పేదలకు ఇళ్లు పథకం.. నిజంగానే పేదలకు శాశ్వత లబ్ధిని ఏర్పా టు చేస్తోంది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా దాదాపు [more]
;
రాష్ట్రంలో వైసీపీ సర్కారు తీసుకువచ్చిన పేదలకు ఇళ్లు పథకం.. నిజంగానే పేదలకు శాశ్వత లబ్ధిని ఏర్పా టు చేస్తోంది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా దాదాపు [more]
రాష్ట్రంలో వైసీపీ సర్కారు తీసుకువచ్చిన పేదలకు ఇళ్లు పథకం.. నిజంగానే పేదలకు శాశ్వత లబ్ధిని ఏర్పా టు చేస్తోంది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా దాదాపు పాతిక లక్షల మందికి ప్రత్యక్ష లబ్ధిని చేకూరుస్తున్న ఈ పథకం రాజకీయంగా వైసీపీకి మంచి మార్కులు వేస్తుందని ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ భావించారు. నిజానికి ఇంతటి బృహత్తర పథకం అమలు చేస్తున్నందున వైసీపీ నేతలు దీనిని ప్రతిష్టాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కానీ, అలా ఎక్కడా జరగకపోవడం గమనార్హం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
పార్టీలతో సంబంధం లేకుండా…..
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు ఏ చిన్న లబ్ధి జరిగినా ఎమ్మెల్యేల కనుసన్నల్లో, ద్వితీయ శ్రేణి నాయకుల ఆధ్వర్యంలోనే జరిగాయి. అయితే ఇప్పుడు వలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలోనే ఏ సంక్షేమ పథకం అయినా, ఇళ్ల పట్టాల పంపిణీ అయినా జరుగుతోంది. సీఎం జగన్ సైతం పార్టీలు చూడకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ,ఇళ్లు ఇవ్వాలని సూచించారు. దీంతో వలంటీర్లు కూడా పార్టీలతో సంబంధం లేకుండా లబ్ధిదారుల పేర్లు నమోదు చేసేస్తున్నారు. దీంతో స్థానికంగా పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు కొన్ని తెలియకుండానే జరిగిపోతున్నాయి.
వైసీపీ నేతల్లోనే….
ఇదిలా ఉంటే ఇటీవల కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో తమకు లబ్ధి చేకూరలేదని ఆరోపిస్తూ.. పలువురు సొంత పార్టీ నాయకులే పార్టీ జెండాలను తగలబెట్టారు. కొందరు జగన్‌పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇళ్ల కేటాయింపుల్లో నాయకులు, ఎమ్మెల్యేల ప్రాధాన్యత తగ్గడమే. ముందుగా ఎవరు అప్లై చేసుకుంటే వారికే పథకాలు మంజూరు అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల సొంత పార్టీ వాళ్లకు పథకాలు రాకపోతే వారు పార్టీపై విరుచుకు పడుతున్నారు.
అన్యాయం జరిగిందని…..
అదే సమయంలో లబ్ధి జరిగిన పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మైలవరం పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే చెప్పిన వారికి కూడా ఇళ్లు ఇవ్వకుండా కొందరు స్థానిక నేతలు చక్రం తిప్పారనే వాదన వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు తెచ్చే ఈ పథకంపై పెద్దగా ప్రచారం లభించడం లేదు. ఎవరిని కదిపినా.. మాకు రాలేదు.. అనే మాటే వినిపిస్తోంది. ఇంకొన్ని చోట్ల.. ముందు అర్హుల జాబితాలో మేం ఉన్నాం.. తర్వాత తీసేశారు.. మాకు అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అర్హులెక్కువ.. లబ్దిపొందిన…..
కొన్ని చోట్ల ఒక్కో పంచాయితీలో 2 వేలమంది అర్హులు ఉంటే కేవలం మూడు, నాలుగు వందల మందికి మాత్రమే పట్టాలు వచ్చాయి. ప్రభుత్వ భూములు ఉన్న చోట మాత్రమే.. వాటిని తీసుకుని పట్టాలు ఇచ్చిన ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనేందుకు ఇష్టపడడం లేదు… దీనికి ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం కూడా ఓ కారణం కావొచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుందని చెపుతున్నా.. ప్రస్తుతం ఇళ్లు మంజూరు కాని లబ్ధిదారులకు వస్తోన్న అనేకానేక సందేహాలపై ఎమ్మెల్యేలు ఎవరూ స్పందించడం లేదు. దీంతో ప్రతిష్టాత్మక పథకమే అయినా..కూడా ఆశించిన మేరకు వైసీపీకి మేలు చేయడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత, సీఎం జగన్.. ఈ కార్యక్రమానికి బూమ్ తీసుకురావాలని అనుకున్నా.. అది సాధ్యం కావడం లేదు. దీంతో పేదలకు ఇళ్ల పథకం సాధారణ పథకంగానే అమలు జరిగిపోతుండడం గమనార్హం.