జగన్ కు పెద్దాపురం ఫిట్టింగ్…!!

తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా మారాయి. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన నాయ‌కులు తీవ్ర అంత‌ర్మథ‌నంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఉన్న పార్టీల్లో సంతృప్తి లేక [more]

Update: 2019-07-23 05:00 GMT

తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా మారాయి. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన నాయ‌కులు తీవ్ర అంత‌ర్మథ‌నంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఉన్న పార్టీల్లో సంతృప్తి లేక కొంద‌రు, త‌మ రాజ‌కీయ భ‌విష్యత్తును నిర్ణయించుకునేందుకు మ‌రికొంద‌రు ఇలా ఎవ‌రికి వారు త‌మ త‌మ వ్యూహాలకు ప‌దును పెడుతున్నారు. దీంతో పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కసారిగా రాజ‌కీయం వేడెక్కింది. విష‌యంలోకి వెళ్తే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకుంది.

వరసగా గెలిచి….

టీడీపీ త‌ర‌ఫున మాజీ హోం మంత్రి చిన‌రాజ‌ప్ప వ‌రుస‌గా తాజా ఎన్నిక‌ల్లోనూ పెద్దాపురం నియోజకవర్గం నుంచి విజ‌యం సాధించారు. ఇక‌, ఈయ‌న‌పై పంతం ప‌ట్టి పోటీ చేసి గెలుపుగుర్రం ఎక్కాల‌ని భావించిన తోట వాణి.. చ‌తికిల ప‌డ్డారు. నిజానికి వీరిద్దరూ కూడా స్థానికులు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. రాజ‌ప్ప అమ‌లాపురానికి చెందిన నాయ‌కుడు. వాణి ఫ్యామిలీ కూడా నాన్‌లోక‌ల్‌. వీరు జ‌గ్గం పేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌వారు. అయిన‌ప్పటికీ.. ఇక్కడ నేత‌ల స‌హ‌కారంతో ఇద్దరూ తాజా ఎన్నిక‌ల్లో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో పోటీ ప‌డ్డారు. వీరిలో రాజ‌ప్ప గెలుపుకోసం ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీ పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న తోట సుబ్బారావు నాయుడు కృషి చేశారు.

రాజప్ప గెలుపుకోసం……

తోట సుబ్బారావు నాయుడు పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గానికి స్థానికుడు. దీంతో టికెట్ కోసం చివ‌రి నిముషం వ‌ర‌కు కూడా కృషి చేశారు. ఎన్నిక‌ల‌కు ముందే జ‌గ‌న్ ఆయ‌న్ను త‌ప్పించి ఎన్నారై ద‌వులూరి దొర‌బాబుకు బాధ్యత‌లు ఇచ్చారు. చివ‌ర‌కు వీరిద్దరిని కాద‌ని ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరిన తోట వాణికి సీటు ఇచ్చారు. దీంతో దొర‌బాబు పార్టీ కోసం ప‌నిచేసినా.. సుబ్బారావు నాయుడు మాత్రం రాజ‌ప్ప గెలుపుకోసం ప్రయ‌త్నించి స‌క్సెస్ అయ్యారు. ఇక‌, టీడీపీకే చెందిన బొడ్డు భాస్కర‌రామారావు… పార్టీలో త‌న‌కు ప్రయార్టీ ఇవ్వడం లేద‌ని అలిగి వైసీపీ అనుకూలంగా వ్యవ‌హ‌రించారు.

వైసీపీలో చేరేందుకు…

ఈ క్రమంలోనే ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున పెద్దాపురంలో పోటీ చేసిన తోట వాణికి అనుకూలంగా చ‌క్రం తిప్పారు. అయితే, ఆమె విజ‌యం సాధించ‌లేక పోయింది. ఈ క్రమంలో వాణి ఇప్పుడు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నార‌న్న ప్రచారం జ‌రుగుతోంది. ఆమె బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నారంటున్నారు. పార్టీ మార‌డం లేద‌ని ఆమె చెపుతున్నా న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని టాక్‌. జ‌గ‌న్ కూడా తోట ఫ్యామిలీని ప‌ట్టించుకోవడం లేద‌ట‌. ఇదిలా ఉంటే సంద‌ట్లో స‌డేమియాలా బొడ్డు భాస్కర‌రామారావు మాత్రం తోట వాణి సీటు ఖాళీ చేస్తే.. తాను వైసీపీలోకి చేరేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఎవరు ఎప్పుడు మారతారో..?

మ‌రోప‌క్క, టీడీపీ త‌ర‌పున రాజ‌ప్ప గెలిచేందుకు చ‌క్రం తిప్పిన సుబ్బారావు నాయుడు పార్టీ ప్రతిప‌క్షంలో ఉండ‌డంతో ఇక‌, ఆయ‌న కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవాల‌ని నిర్ణయించుకున్నాడు. ఇక ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు సీటు రేసులో ఉన్న ఎన్నారై ద‌వులూరి దొర‌బాబు కూడా వాణి పార్టీ మారిపోతే త‌న‌కు పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ లేదా ఎమ్మెల్సీ వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఉన్నారు. దీంతో పెద్దాపురం రాజ‌కీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏ నాయ‌కుడు ఏ పార్టీలో ఉంటారు? ఏ పార్టీకి రాజీనామా చేస్తార‌నే విష‌యం చ‌ర్చకు దారితీసింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News