విశాఖ భూముల చుట్టూనే రాజకీయం ?

రాజకీయానికి కాదేదీ అనర్హం అని అంటారు. ఇపుడు దేన్ని అయినా అటునుంచి ఇటు తిప్పి రాజకీయం చేసే పెద్దలు ఉన్నారు. అయితే విశాఖ వంటి సిటీ పొలిటికల్ [more]

;

Update: 2020-09-18 00:30 GMT

రాజకీయానికి కాదేదీ అనర్హం అని అంటారు. ఇపుడు దేన్ని అయినా అటునుంచి ఇటు తిప్పి రాజకీయం చేసే పెద్దలు ఉన్నారు. అయితే విశాఖ వంటి సిటీ పొలిటికల్ సీన్ వేరుగా ఉంటుంది. ఇక్కడ రాజకీయం నడపడానికి కామందులు ఎవరూ లేరు. సెటిలర్లే ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. వారే విశాఖ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉంటున్నారు. దాంతో లోకల్ గా బలమైన నేతలు నిలిచి తొడగొట్టే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో అంతా కలసి భూముల మీద పడ్డారు. విశాఖలో గత అయిదేళ్ళలో భూదందా ఒక్క లెక్కన జరిగింది అన్నది తెలిసిందే. ఆనాడు ప్రభుత్వ భూములనే వేలల్లో ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు, పేదల భూములు, అసైన్డ్ లాండ్స్, దళితుల భూములు కూడా దందాలో మొత్తానికి కొట్టుకుపోయాయి.

ఆ ప్రకటనతోనే….?

విశాఖ సహజంగానే పెద్ద సిటీ, ఇపుడు పరిపాలనా రాజధాని అని జగన్ ప్రకటించారు. దాంతో విశాఖలో ఒక్కసారిగా భూములకు రెక్కలు వచ్చాయి. దానికి తోడు విశాఖలో భూముల కొరత కూడా ఉంది. ప్రభుత్వ భూమూలను చాలా కాలం క్రితమే చెరపట్టేశారు. మిగిలి ఉన్న అతి తక్కువ భూములలో కూడా ఇపుడు దందా జరుగుతోంది. దీంతో వైసీపీ సర్కార్ చాలా సీరియస్ గా భూ ఆక్రమణల మీద దృష్టి పెట్టిందని అంటున్నారు. రాజధాని కనుక వస్తే కచ్చితంగా భూములు పెద్ద ఎత్తున కావాల్సిఉంటుంది. అంటే అనివార్యంగా ప్రభుత్వం భూ ఆక్రమణల మీద కొరడా ఝలిపించాల్సివస్తోందన్నమాట.

ఇది చిత్రమే….?

విశాఖ అంటే మత్స్యకారే పల్లె అంటారు. దాదాపు వందేళ్ల క్రితం విశాఖలో ఉండే పెద్ద సామాజిక వర్గం మత్స్యకారులే. అలాగే యాదవులు, వెలమలు వంటి సామాజిక వర్గాలే విశాఖలో స్థానికులుగా చెబుతారు. కానీ చిత్రమేంటంటే ఇపుడు వీరికి రాజకీయంగా కూడా పెద్దగా వాటా లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే కీలక పదవుల్లో ఉన్నారు. ఇక సామాజికవర్గం పరంగా చూసుకుంటే తాను పేరుకే లోకల్ కానీ సెంట్ జాగా కూడా లేదని వీరంతా విలవిలలాడుతున్నారు. విశాఖలో దందాలు గత మూడు దశాబ్దాలుగా సాగుతున్నాయన్న బలమైన ఆరోపణలు ఉన్నాయి. అంటే ఎపుడైతే ఇతర ప్రాంతాల నుంచి రాజకీయం చేయడానికి విశాఖ వచ్చారో వారి వెన్నంటి వచ్చిన వారు, పెత్తందార్లు విశాఖలో విలువైన భూములను గుప్పిట పట్టారని చెబుతున్నారు. దీని మీద పక్కా ఆధారాలు ఉన్నా కూడా రాజకీయ బలంతో ఒక్క అంగుళం కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకోలేక‌పోతోంది.

సర్పయాగ‌మేనా….?

ఇపుడు మాత్రం వైసీపీ పెద్దలు తాము చిత్తశుద్ధితో ఈ విషయంలో పనిచేస్తామని చెబుతున్నారు. జగన్ మొత్తం విశాఖ బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఆయన విశాఖలో దురాక్రమణకు గురి అయిన భూములను తిరిగి ప్రభుత్వం ఖాతాలోకి వచ్చేలా చూస్తామని చెబుతున్నారు. కబ్జాకు పాల్పడిన వారు తమ పార్టీలో ఉన్నా కూడా చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యకంగా లీగల్ సెల్ ని కూడా ఓపెన్ చేసి పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా వాదించి మరీ భూ దందాలకు గురి అయిన భూములను వెనక్కు తీసుకుంటామని చెబుతున్నారు, ఇదిలా ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ భూములు కబ్జా అవుతున్నాయన్న ఆరోపణల మీద కూడా విచారణకు సిధ్ధమని విజయసాయిరెడ్డి లాంటి వారు చెబుతున్నారు. తమ నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని అంటున్నారు. మొత్తం మీద విశాఖ భూములను కాపాడుతామని వైసీపీ నేతలు చెబుతూంటే వారే కబ్జా చేసి ఈ నీతులు చెప్పడమేంటి అని టీడీపీ నేతలు నిందిస్తున్నారు. ఈ భూబాగోతం ఎంతదాకా వెళ్తుందో. రాజకీయ రచ్చ ఏ కొత్త చిచ్చుకు దారితీస్తుందో చూడాలి మరి.

Tags:    

Similar News