ఓవర్ టూ విశాఖ..రచ్చ స్టార్ట్..!

అమరావతి రాజకీయం పాతదైపోయింది. ఇక నేడో రేపో జగన్ కూడా అక్కడ నుంచి తట్టా బుట్టా సర్దేసి వచ్చేస్తున్నారు. కోర్టులో విచారణ పూర్తై క్లియరెన్స్ వస్తే విశాఖను [more]

;

Update: 2020-08-30 14:30 GMT

అమరావతి రాజకీయం పాతదైపోయింది. ఇక నేడో రేపో జగన్ కూడా అక్కడ నుంచి తట్టా బుట్టా సర్దేసి వచ్చేస్తున్నారు. కోర్టులో విచారణ పూర్తై క్లియరెన్స్ వస్తే విశాఖను పరిపాలనారాజధానిగా చేసుకుని పాలించాలన్నది జగన్ సంకల్పం. ఇక విశాఖలో కొత్త నిర్మాణాలకు కూడా జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ పేరిట తొలి నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ గెస్ట్ హౌస్ ప్రధానులు, రాష్ట్రపతులు విశాఖ‌ వచ్చినపుడు విడిది చేయడానికి ఉద్దేశించింది. ఇందుకోసం విశాఖ సాగరతీరంలో ముప్పయి ఎకరాల స్థలంలో సకల సదుపాయాలతో నిర్మాణం చేస్తారన్న మాట. ఓ విధంగా సీ వ్యూను దృష్టిలో పెట్టుకుని నిర్మించే ఈ గెస్ట్ హౌస్ దేశంలోని మిగిలిన అతిధి గృహాల కంటే ధీటుగా ఉండాలని జగన్ భావిస్తున్నారు

రచ్చ షురూ ….

ఎపుడైతే జగన్ గెస్ట్ హౌస్ అన్నారో నాటి నుంచే రచ్చ మొదలైంది. ఈ గెస్ట్ హౌస్ నిర్మించే ప్రాంతంలో బౌధ్ధుల ఆనవాళ్ళు ఉన్నాయని, వాటిని విద్వంసం చేసి నిర్మాణం చేపడతారా అంటూ అపుడే రాజకీయ పార్టీలు గొడవకు సిధ్ధపడిపోతున్నాయి. టీడీపీ అయితే బుధ్ధుల మనోభావలతో చెలగాటం ఆడడం తగదు అంటున్నారు. మరో వైపు బౌధ్ధ సంఘాల ప్రతినిధులు కూడా ఇది మంచి విధానం కాదు అని ఆందోళన చేపట్టారు. బుద్ధులు మైనారిటీలు అని వారికి ఈ రాష్ట్రంలో చోటు లేదా అన్న చర్చకు కూడా తెర తీస్తున్నారు. ఇంకో వైపు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు అయితే కేంద్రానికి ఒక లేఖ కూడా రాశారు. బుధ్ధుల మాన్యుమెంట్ ని పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

కావాలనే ఇలా …..

దీని మీద వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫైర్ అవుతున్నారు. బుద్ధుల మాన్యుమెంట్ గా భావించే తొట్లకొండకు తాము నిర్మించబోయే స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంతానికి ఏ విధమైన సంబంధం లేదని కూడా ఆయన అంటున్నారు. అసలు తొట్ల కొండ కూడా ఎక్కడ ఉందో తెలియని రఘురామ క్రిష్ణం రాజు లాంటి వారు లేఖలు రాయడమేంటి అని ఆయన మండిపడుతున్నారు. విశాఖ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని కూడా గద్దించారు. విశాఖను తాము అభివ్రుధ్ధి చేస్తూంటే ఓర్వలేక తెలుగుదేశం డ్రామాలు మొదలుపెట్టిందని కూడా మంత్రి అంటున్నారు. తమకు అన్ని మతాలూ, మనోభావాలు చాలా ప్రధానమేనని కూడా అంటున్నారు.

కోట్లు దండుగ ….

నాడు చంద్రబాబు విశాఖలో విడిది చేసినపుడల్లా స్టార్ హొటళ్ళకు కోట్లు తగలేసి ప్రభుత్వం సొమ్ము వేస్ట్ చేశారని మంత్రి అంటున్నారు. ఇపుడు అలా కాకుండా తాము ప్రభుత్వ అతిధి గృహాన్ని నిర్మించి శాశ్వతమైన ప్రగతి చూపించాలనుకుంటే అడ్డు తగలడం భావ్యమా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. విశాఖ అభివృధ్ధి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా ఆయన అంటున్నారు. కాగా స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం మీద కూడా కోర్టుకు వెళ్ళే ఆలోచనలో కొంతమంది ఉన్నారని తెలుస్తోంది. అంటే అమరావతి అయిపోయింది ఇపుడు విశాఖ నుంచు మొదలుపెడుతున్నారా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా జగన్ చేసే ప్రతీ కార్యక్రమాన్ని టీడీపీ అడ్డుకుంటోందని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చూడాలి ఈ కధ ఎందాకా పోతుందో.

Tags:    

Similar News