పెట్టే బేడా సర్దేస్తున్నారా? అన్నీ రెడీ అయిపోయాయి…!

విశాఖ మన రాజధాని వైసీపీ గట్టిగా చెప్పేక ఇక ఎదురేముందు. కోర్టు తీర్పు కోసమే ఇపుడు ఎదురుచూస్తున్నారు. ఆ లాంచనం పూర్తి అయితే విశాఖకు మొత్తం పెట్టే [more]

;

Update: 2021-02-04 09:30 GMT

విశాఖ మన రాజధాని వైసీపీ గట్టిగా చెప్పేక ఇక ఎదురేముందు. కోర్టు తీర్పు కోసమే ఇపుడు ఎదురుచూస్తున్నారు. ఆ లాంచనం పూర్తి అయితే విశాఖకు మొత్తం పెట్టే బేడా సహా అన్నీ సర్దేసినట్లేనని అంటున్నారు. ఇదిలా ఉంటే విశాఖకు రాజధానిని ఈ ఏడాది షిఫ్ట్ చేయాలని జగన్ చాలా పట్టుదల మీద ఉన్నారు. దాంతో అధికారుల స్థాయిలో గట్టిగానే కసరత్తు సాగుతోందిట. విశాఖలో భవనాల ఎంపిక నుంచి ఎక్కడ ఏమేమి కార్యాలయాలు ఉండాలి అన్న దాని మీద ఒక భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టారని అంటున్నారు.

భవనాలు రెడీ….

విశాఖలో ఎన్ని భవనాలు ఖాళీగా ఉన్నాయి.మరెన్ని అవసరం అవుతాయి అన్న దాని మీద అధికారులు నివేదికను పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించారు అంటున్నారు. రాజధాని భవనాలు విశాఖ నగర శివారు మధురవాడతో పాటు, ఆనందపురం, భీమునిపట్నం వద్ద వస్తాయని చెబుతున్నారు. కాపులుప్పాడ వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భవనాలను అధికారులు గుర్తించారని తాజా భోగట్టా. ఇక భీమిలీ వద్ద గిరిజన మ్యూజియం భవనంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ ఆఫీస్ ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు.

లీజుకు తీసుకుంటారా …?

ఇక అనేక శాఖలు, వాటి పాలనా కార్యాలయాలు పెద్ద ఎత్తున విశాఖకు రాజధాని పేరిట తరలిరానున్నాయి. వాటికి అకామిడేట్ చేయడం ఇపుడు పెద్ద పనిగా ఉందిట. ఉన్న భవనాలకు అదనంగా కొత్తవి కూడా కావాలి. వాటిని నిర్మించాలంటే ప్రభుత్వ స్థలాల్లోనే అని ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి దీర్ఘకాలం ప్రాతిపదికన స్థలాన్ని తీసుకుని మరీ భవనాలు కడతారు అంటున్నారు. అలా స్టీల్ ప్లాంట్ నుంచి స్థలాన్ని తీసుకుని కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర కార్యాలయం అక్కడ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

మంత్రుల భవనాలూ రెడీ….

ఇక కృష్ణా నదీ యాజమాన్య బోర్డ్ ని హైదరాబాద్ నుంచి విశాఖకు తరలించడానికి కేంద్రం అనుమతించింది. దానిని విశాఖలోని ఉత్తరాంధ్రా జలవనరుల చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో ఏర్పాటు చేస్తారట. అక్కడే మరో భవనం నిర్మించి రాష్ట్ర జలవనరుల ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారని అంటున్నారు. అదే విధంగా మంత్రుల ఆఫీసుల కోసం అన్ని సదుపాయాలు ఉన్న ఆధునాతన భవనాలను కూడా వెతుకుతున్నారు. మొత్తానికి రాజధాని విశాఖ నగర శివారు నుంచి భీమిలీ వరకూ విస్తరించేలా భవనాలు అన్నీ ఒక్కోటీ వరసగా వస్తాయట. మొత్తానికి పెద్దగా ఖర్చు చేయకుండానే ఈ షిఫ్టింగ్ ప్రక్రియను ముగించాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉందని అంటున్నారు.

Tags:    

Similar News