congress jagga reddy : జగ్గూ భాయ్… మామ్లా క్యా హై?

తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తులు మామూలే. అంతా సాఫీగా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ కాదు. నిత్యం వివాదాలు ఉంటేనే దానిని హస్తం పార్టీగా క్యాడర్ సయితం [more]

Update: 2021-09-26 09:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తులు మామూలే. అంతా సాఫీగా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ కాదు. నిత్యం వివాదాలు ఉంటేనే దానిని హస్తం పార్టీగా క్యాడర్ సయితం గుర్తిస్తుంది. ఇందులో చిన్నా పెద్దా తేడా లేదు. దిగువ స్థాయి నేత నుంచి ఉన్నత పదవులు దక్కించుకున్న వారందరూ దీనికి మినహాయింపు కాదు. ఏదైనా నేరుగానే చెప్పి పార్టీని ఇబ్బందుల్లో పడేయటం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా చెప్పాలి. పార్టీ ఒక అడుగు ముందుకు పోతుందనిపిస్తే, మూడడుగులు వెనక్కు లాగడనికి కూడా నేతలు వెనుకాడరు.

కాంగ్రెస్ చేజేతులా….

తెలంగాణ కాంగ్రెస్ చేజేతులా రాష్ట్రాన్ని టీఆర్ఎస్ కు అప్పగించింది. ఇక దానిని తెచ్చుకోలేక కిందా మీదా పడుతుంది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా దానికున్న మైలేజీని కూడా కాంగ్రెస్ నేతలు గుర్తించలేకపోయారు. పోనీ ఏడేళ్ల తర్వాతయినా నేతల్లో పశ్చాత్తాపం కనపడుతుందా? అంటే అదీ లేదు. తాజాగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. తాను అనుకున్న స్టయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు.

వెనక్కు లాగేందుకు…

ఇదే సమయంలో సీనియర్ నేతలు ఆయన్ను వెనక్కు లాగే ప్రయత్నంలో ఉన్నారు. పీసీసీ చీఫ్ పదవికి పోటీ పడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఒక దారి. అయితే ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల కాలంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పీసీసీ చీఫ్ నియామకం అయిన నాటి నుంచి జగ్గారెడ్డిలో అసహనం కనిపిస్తుంది. పీసీసీ చీఫ్ ప్రకటన రాగానే తాను నియోజకవర్గానికే ఎక్కువ సమయం కేటాయిస్తానని, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు తక్కువ సమయం కేటాయిస్తానని జగ్గారెడ్డి చెప్పారు.

అసంతృప్తిలో….

దీంతో పాటు రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు జగ్గారెడ్డి దూరంగా ఉంటున్నారు. జగ్గారెడ్డి తన భార్యను పంపి ప్రతినిధిగా అనుకోవాలని చెబుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశాలకు కూడా జగ్గారెడ్డి హాజరు కావడం లేదు. ముఖ్యమైన సమావేశాలకు కూడా డుమ్మా కొడుతున్నారు. జగ్గారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిరిగి పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని కోరారు. దీంతో పాటు రేవంత్ రెడ్డి అనుచరులు తనను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని కూడా జగ్గారెడ్డి పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి పార్టీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News