జక్కంపూడికి పరీక్ష పెట్టారా..?
తన కుటుంబం పట్ల, పార్టీ పట్ల విధేయత తో వున్న వారికి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి కల్పించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తండ్రి వైఎస్ [more]
;
తన కుటుంబం పట్ల, పార్టీ పట్ల విధేయత తో వున్న వారికి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి కల్పించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తండ్రి వైఎస్ [more]
తన కుటుంబం పట్ల, పార్టీ పట్ల విధేయత తో వున్న వారికి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి కల్పించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఆయన లాగే తనను నమ్ముకున్నవారికి అండాదండా కల్పిస్తూ రావడం ఆయన సర్కార్ ఏర్పాటు అయ్యాకా జరుగుతున్న పరిణామాలు చెప్పక చెబుతున్నాయి. తాజాగా రాజానగరం ఎమ్యెల్యే గా ఎన్నికైన జక్కంపూడి రాజా ను ప్రతిష్టాకరమైన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇవ్వడం వెనుక ఆ కుటుంబం తమకోసం చేసిన త్యాగాలను, విధేయతను లెక్కపెట్టుకునే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని ఫ్యాన్ పార్టీ టాక్. కాపుల కోటాలో మంత్రి పదవి ఇస్తారని ఆశించిన జక్కంపూడి కుటుంబానికి క్యాబినెట్ లో చోటు ఇవ్వని లోటు ను సిఎం ఇలా తీర్చేసుకున్నట్లు తెలుస్తుంది.
జిల్లా అధ్యక్షుడు ఆశిస్తే ….
ఎన్నికలకు ముందు వైసిపి జిల్లా అధ్యక్ష బాధ్యతలను తనకు అప్పగించాలని జక్కంపూడి రాజా స్వయంగా అధినేత జగన్ ను కోరారు. కానీ జగన్ ఆ పదవిని కురసాల కన్నబాబు కి ఇచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకు వైసిపి యువజన విభాగం అధ్యక్ష పదవిని జక్కంపూడి రాజా కు ఇచ్చి అనుకున్న దానికన్నా జగన్ ఎక్కువే చేశారు. అదే రీతిలో జగన్ తొలి క్యాబినెట్ లో చోటు దక్కుతుందని జక్కంపూడి రాజా ఆశించినా కీలకమైన కాపు కార్పొరేషన్ పదవిని రాజాకు ఇచ్చి తన మనసులో తండ్రి స్నేహితుడి కుటుంబం పట్ల వున్న విలువను వైసిపి అధినేత చాటిచెప్పారు.
వైఎస్ ను నమ్ముకుని జక్కంపూడి ….
జక్కంపూడి రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన రావు తొలి నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రూప్ కి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని తానై వ్యవహరించారు. తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి – ఉండవల్లి అరుణ కుమార్ మాటే వైఎస్ జమానాలో ఫైనల్ గా వుంటూ వచ్చేది. టికెట్ల కేటాయింపులో కానీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రామ్మోహన రావు వైఎస్ విధేయులకే పెద్ద పీట వేసేవారు. అందుకే తన తొలి క్యాబినెట్ లో రామ్మోహన్ కి మంత్రి పదవిని ఇవ్వడమే కాదు ఆయన అనారోగ్యానికి గురైనా మంత్రి హోదాలో కొనసాగిస్తూ మెరుగైన వైద్యం కోసం అమెరికా సైతం పంపించారు వైఎస్. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏ మంత్రి వెళ్ళినా జక్కంపూడి ని కలిసి రావాలన్న రూల్ కూడా పెట్టారు రాజశేఖర రెడ్డి.
వైఎస్ మరణం తరువాత …
వైఎస్ నే నమ్ముకున్న జక్కంపూడి కుటుంబానికి షాక్ ల మీద షాక్ లు రాజకీయంగా తగిలాయి. వైఎస్ హయాంలో 2009 లో జరిగిన ఎన్నికల్లో రామ్మోహన రావు భార్య విజయలక్ష్మి కడియం అసెంబ్లీ నుంచి ఓటమి చెందడం ఆ తరువాత వైఎస్ అకాల మృత్యువు మరో పక్క జక్కంపూడి రామ్మోహన రావు కి తీవ్ర అస్వస్థత తో ఆయన కాలం చేయడం ఇలా అన్ని దురదృష్టకర సంఘటనలు పీడకలల్లా మిగిలాయి. వైఎస్ మరణం తరువాత దశాబ్దాలుగా వున్న కాంగ్రెస్ ను విడిచిపెట్టి జక్కంపూడి కుటుంబం జగన్ వెంటే నడిచింది. ఎన్నో ఇబ్బందులు వత్తిడులు ఎదురైనా వైఎస్ కుటుంబంతోనే జీవితాంతం రాజకీయ ప్రయాణం అని ఆ కుటుంబం ప్రకటించడంతో జగన్ అంతే నమ్మకాన్ని వారిపై ఉంచారు. 2014 ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుంచి వైసిపి టికెట్ రామ్మోహన్ సతీమణికి ఇచ్చినా ఆమె మరోసారి ఓటమి చెందారు.
2019 లో రాజా ఎంట్రన్స్ తో ….
జక్కంపూడి విజయ లక్ష్మిని కాదని ఆమె కుమారుడు జక్కంపూడి రాజా కు టికెట్ మార్చి జగన్ ఇవ్వడం మంచి ఫలితాన్నే ఇచ్చింది. రాజానగరం లో ఓటమి తరువాత ఐదేళ్ళు పార్టీనే అంటిపెట్టుకుని వుంటూ నియోజకవర్గంలో అన్ని వర్గాలను జక్కంపూడి రాజా కలుపుకుపోయారు. అంతే కాదు ఏ చిన్న సమస్య ప్రజలకు వచ్చినా దానిపై ఉద్యమాలు చేయడం అలవాటుగా మార్చుకుని రామ్మోహన్ బాటలో వెళ్ళాడు జక్కంపూడి రాజా. ఈ పోరాటాల్లో అనేక కేసులు, జైలుకు వెళ్లడం రావడం కూడా జరిగాయి. ఇలా నిత్యం జనంలో ఉండటం పోరాట వైఖరి జక్కంపూడి రాజాకు అఖండ మెజారిటీని మొన్నటి ఎన్నికల్లో నియోజక వర్గం ఇచ్చింది. అంతే కాదు జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని జక్కంపూడి రాజా వమ్ము చేయలేదు.
కత్తిమీద సామే కాపు కార్పొరేషన్ …
కాపు కార్పొరేషన్ ఛైర్మన్ బాధ్యతలు సంతృప్తకరంగా నిర్వహించడం కత్తిమీద సామే అనే చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాపులకు జగన్ సర్కార్ 2000 కోట్ల రూపాయలను కార్పొరేషన్ కి కేటాయించింది. ఈ నిధులను కోస్తా లో అత్యధిక జనాభా వున్న కాపు సామాజిక వర్గంలోని పేదవారిని గుర్తించి సక్రమంగా ఖర్చు చేయాలి. ఈ క్రమంలో వచ్చే విమర్శలు ఆరోపణలను తిప్పికొడుతూ ప్రభుత్వం తనపై పెట్టిన బాధ్యతను జక్కంపూడి రాజా నిర్వర్తించాలిసి వుంది. గత సర్కార్ హయాంలో కాపు కార్పొరేషన్ లో అవకతవకలు జరిగాయంటూ వైసిపి గగ్గోలు పెట్టింది. అధికారులకు నేతలకు మధ్య విభేదాలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. లక్షలాదిగా వున్న వారిని సంతృప్తి పరిచే విధంగా వున్న నిధులతో నెట్టుకు రావడం చిన్న విషయం కాదు. ఈ ఆటంకాలన్ని అధిగమిస్తే రెండున్నరేళ్ల తరువాత మార్చనున్న మంత్రి వర్గంలో జక్కంపూడి రాజాకు స్థానం లభించే అవకాశం వుంది. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను జక్కంపూడి రాజా నెత్తిన పెట్టడానికి సమర్ధత ను పరీక్షించేందుకు కూడా అని వైసిపి వర్గాల్లో సాగుతున్న ప్రచారం కి కొత్త కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ ఎలా జవాబు ఇస్తారో చూడాలి.