jakkampudi : మళ్లీ మొదలయింది…పార్టీకి నష్టమే

వరస విజయాలు పార్టీని సంతోషంతో ముంచెత్తుతున్నాయి. ప్రజలు తమ వెంట ఉన్నారన్న నమ్మకం మరింత బలపడింది. అయితే నేతల్లో మాత్రం సయోధ్య కుదరడం లేదు. ఆధిపత్య పోరుతో [more]

;

Update: 2021-09-21 02:00 GMT

వరస విజయాలు పార్టీని సంతోషంతో ముంచెత్తుతున్నాయి. ప్రజలు తమ వెంట ఉన్నారన్న నమ్మకం మరింత బలపడింది. అయితే నేతల్లో మాత్రం సయోధ్య కుదరడం లేదు. ఆధిపత్య పోరుతో పార్టీని వీధుల్లోకి లాగుతున్నారు. రాజమండ్రిలో వైసీపీలో విభేదాలు రోడ్డుకెక్కుతున్నాయి. ఇన్నాళ్లూ సర్దుకుపోయిందటుకుంటున్న వివాదం మరోసారి రచ్చకెక్కింది. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్ ల మధ్య వార్ ముదిరిందనే చెప్పాలి.

ఇద్దరూ తొలిసారి…..

ఇద్దరూ యువనేతలే. తొలిసారి గెలిచిన వాళ్లే. జక్కంపూడి రాజా తొలిసారి రాజానగరం నియోజకవర్గం నుంచి గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. అలాగే మార్గాని భరత్ సయితం తొలిసారి రాజమండ్రి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇద్దరి మధ్య అనేక అంశాల్లో వివాదాలు ముదురుతున్నాయి. రాజానగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జక్కంపూడి రాజా రాజమండ్రి లో వేలు పెడుతున్నారన్నది భరత్ ఆరోపణ. రాజానగరం వెళ్లినా తాము రాజమండ్రి రాజకీయాలు వదులుకోబోమంటున్నారు జక్కంపూడి రాజా.

ఒకరి నియోజకవర్గంలో మరొకరు….

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం ఇద్దరూ సయోధ్యగానే ఉన్నారు. ఏడాది లోనే ఇద్దరి మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భరత్ ను అవమానించేలా వ్యవహరించడం, జక్కంపూడి రాజాకు సంబంధించిన ఫ్లెక్సీలను భరత్ వర్గం వారు చించేయడం వంటి సంఘటనలు ఇద్దరి మధ్య దూరం పెంచాయి. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. ఫలితం కనపడిందనే తరుణంలో మళ్లీ వివాదాలు ప్రారంభమయ్యాయి.

బలమైన ఓటు బ్యాంకు…..

బీసీ ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు భరత్ ను జగన్ ఎంపీ బరిలో దింపారు. వర్క్ అవుట్ అయింది. కాపు సామాజికవర్గం కూడా ఇక్కడ బలంగా ఉంది. ఇద్దరు ఒక్కటిగా ఉంటే రాజకీయంగా పార్టీకి ఇబ్బంది ఉండదు. ఇక ఇప్పుడు జక్కంపూడి రాజా నేరుగా భరత్ పై విమర్శలకు దిగడం చర్చనీయాంశమైంది. గోరంట్లతో కలసి భరత్ రాజకీయాలు చేస్తున్నారని జక్కంపూడి రాజా ఆరోపించారు. జగన్ ను జైలుకు పంపిన జేడీ లక్ష్మీనారాయణతో కలసి ఫొటోలు ఎందుకు దిగారని ప్రశ్నిస్తున్నారు. తన నియోజకవర్గలో బీసీలను భరత్ రెచ్చగొడుతున్నారని జక్కంపూడి ఆరోపణ. మొత్తం మీద రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇద్దరి మధ్య విభేదాలు ఎటు దారితీస్తాయో అన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది.

Tags:    

Similar News