పవన్ ను బాగా వేధిస్తున్నాడుగా

జనసేనకు ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నప్పటికీ ఇంకా గ్రీన్ సిగ్నల్ వైసీపీ అధిష్టానం నుంచి అందడం లేదని తెలుస్తోంది. మరోవైపు జనసేన [more]

Update: 2019-12-30 11:00 GMT

జనసేనకు ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నప్పటికీ ఇంకా గ్రీన్ సిగ్నల్ వైసీపీ అధిష్టానం నుంచి అందడం లేదని తెలుస్తోంది. మరోవైపు జనసేన కూడా రాపాక వరప్రసాద్ పై ఎటువంటి చర్యలు దిగకకపోవడం కూడా చేరిక జాప్యానికి కారణమని చెప్పాలి. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ గెలిచారు. రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ ఫలితాల అనంతరం కొంత వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.

జగన్ ను పదే పదే….

తనకు టిక్కెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వంపై విరుచుకు పుడుతుంటే, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పదే పదే జగన్ ను ప్రశంసించడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. పదే పదే జగన్ ను పొగుడుతుండటంతో జనసేన అగ్రనేతలకు కాలుతున్నా రాపాక వరప్రసాద్ పై చర్యలకు అధిష్టానం దిగడం లేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే నేరుగా రాపాక వరప్రసాద్ కు వైసీపీలో చేరేందుకు తామే అవకాశమిచ్చినట్లవుతుందని జనసేన పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

సస్పెండ్ చేస్తే…..

అందుకే రాపాక వరప్రసాద్ పై సస్పెన్షన్ వేటు వేయడం మంచిది కాదని, ఇది ఆ సామాజిక వర్గంలో తప్పుడు సంకేతాలు వెళతాయన్నది కూడా జనసేన అగ్రనేతలు వెనుకంజ వేయడానికి కారణమనే చెప్పాలి. ఇది అదనుగా చూసుకున్న రాపాక వరప్రసాద్ మళ్లీ మళ్లీ జగన్ ను పొగుడుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడాన్ని కూడా రాపాక వరప్రసాద్ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నారట. సొంత అన్నే తమ్ముడిని విభేదిస్తుంటే మనమెంత అంటూ రాపాక వరప్రసాద్ సెటైర్లు విసురుతున్నారట.

ముఖ్యనేతలందరూ….

ఇదిలా ఉండగా రాజోలు నియోజకవర్గంలో ముఖ్యమైన నేతలను, తన సన్నిహితులను క్రమంగా వైసీపీలోకి రాపాక వరప్రసాద్ పంపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజుతో పాటు తన సన్నిహితులను కూడా వైసీపీలోకి పంపడం వెనక రాపాక వరప్రసాద్ ఆలోచన ఉందంటున్నారు. మరోవైపు రాపాక వరప్రసాద్ రాకను స్థానిక వైసీపీ నాయకత్వం వ్యతిరేకిస్తుంది. దీంతోనే రాపాక వైసీపీ ఎంట్రీ లేట్ అవుతుందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తనపై చర్యలు తీసుకునేంత వరకూ రాపాక వరప్రసాద్ పవన్ ను రెచ్చగొడుతూనే ఉంటారట. మరి పవన్ కల్యాణ్ ఈ వేధింపులను తట్టుకోగలరా?

Tags:    

Similar News