బహుదూరపు బాటసారులు.. ?
జెపీ .. జయప్రకాశ్ నారాయణ… జేడీగా అంతా పిలిచే లక్ష్మీనారాయణ.. ఆర్ఎస్.. ప్రవీణ్ కుమార్.. ఐఏఎస్, ఐపీఎస్ లను కాదనుకుని ఈ ముగ్గురు ఉన్నతాధికారులు తమ సర్వీసులను [more]
;
జెపీ .. జయప్రకాశ్ నారాయణ… జేడీగా అంతా పిలిచే లక్ష్మీనారాయణ.. ఆర్ఎస్.. ప్రవీణ్ కుమార్.. ఐఏఎస్, ఐపీఎస్ లను కాదనుకుని ఈ ముగ్గురు ఉన్నతాధికారులు తమ సర్వీసులను [more]
జెపీ .. జయప్రకాశ్ నారాయణ… జేడీగా అంతా పిలిచే లక్ష్మీనారాయణ.. ఆర్ఎస్.. ప్రవీణ్ కుమార్.. ఐఏఎస్, ఐపీఎస్ లను కాదనుకుని ఈ ముగ్గురు ఉన్నతాధికారులు తమ సర్వీసులను మధ్యలోనే వదిలేసి సేవాబాట పట్టారు. అఖిలభారత సర్వీసులో మరింత ఉన్నత హోదాకు ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ వద్దనుకున్నారు. ముగ్గురి మద్య ఒక సారూప్యం మాత్రం కనిపిస్తోంది. చిత్తశుద్ది, అంకితభావంతో సేవ చేద్దామనుకున్నప్పటికీ నాయకుల ఒరవడి, ప్రభుత్వ విధానాలు స్వేచ్ఛ కల్పించకపోవడమే వారి రాజీనామాలకు కారణం. రెండు దశాబ్దాలకు పూర్వమే సర్వీసును విడిచిపెట్టి వచ్చేశారు జయప్రకాశ్ నారాయణ. లోక్ సత్తా స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి ముందుగా స్తానిక సంస్థల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించే పనిని మొదలు పెట్టారు. తర్వాత దానినే రాజకీయ పార్టీగా మార్చారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మహారాష్ట్రలో పోలీసు అధికారిగా పదవీ విరమణ చేసి , రాజకీయాల బాట పట్టారు. తాజాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ, గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం గవర్నమెంట్ సర్వీసు చాలించారు. కోట్లమంది కలలు కనే ఉద్యోగాలు , మరింత పెద్ద పోస్టులు కాదనుకోవడానికి కారణాలేమిటనేది ఒక ప్రశ్న. గవర్నమెంటు సర్వీసు విడిచిపెట్టిన తర్వాత అనుకున్న లక్ష్యాల దిశలో విజయం సాధిస్తున్నారా? అందుకు తగిన వాతావరణం ఉందా? అనేది మరో ప్రశ్న.
ప్రభుత్వ సేవలో లోపం…
ఈ ముగ్గురు అధికారుల ట్రాక్ రికార్డు పరిశీలిస్తే చాలా క్లీన్ గా కనిపిస్తుంది. అవినీతి మరకలు, ఆశ్రిత పక్ష పాతం వంటి ముద్ర పడలేదు. తాము పనిచేసిన రంగాల్లో రుజువర్తన నెలకొల్పేందుకు, తమకు అప్పగించిన పనిని నూటికి నూరుపాళ్లు సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నించారు. అయినా అసంతృప్తి. దానికి ప్రదాన కారణం రాజకీయ బాసులే. అందుకే గవర్నమెంట్ సర్వీసులో ఉండి, తాము పెద్దగా సాధించేది ఉండదనే ఉద్దేశంతోనే బయటికి వచ్చేశారు. నిజానికి ఉన్నతాధికారులుగా ప్రజలకు వారు చాలా చేయవచ్చు. ప్రభుత్వ రూపంలో ఉండే నాయకులు స్వేచ్ఛ కల్పించినప్పుడే అది సాద్యమవుతుంది. అది ప్రస్తుత ప్రభుత్వాల్లో కనిపించడం లేదు. అందుకే వారంతా తాము ఎంచుకున్న విధానంలో పబ్లిక్ లైఫ్ లో ఉండటానికే పదవులు విడిచిపెట్టేశారు. జయప్రకాశ్ నారాయణ విషయానికి వస్తే కలెక్టర్ గా, ప్రభుత్వ కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. అన్నిచోట్ల తనదైన ముద్ర వేయగలిగారు. కానీ ప్రభుత్వ నిబంధనల సంకెళ్లు, రాజకీయ నాయకుల పెత్తనం సహించలేకపోవడం వల్లనే ఆయన రాజీనామా చేశారని సన్నిహితులు చెబుతుంటారు. రెండు దశాబ్డాల ప్రజాక్షేత్రంలో ఆశించిన మార్పులను మాత్రం ఇంతవరకూ ఆయన సాధించలేకపోయారు.
స్వేచ్ఛకు విఘాతం…
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ సర్దుకుపోవడమనేది ఒక నియమంగా మారిపోయింది. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నా, నాయకుల ఆదేశాలు అడ్డగోలుగా ఉంటున్నా పెద్ద స్థాయి అధికారులు చూసీ చూడనట్లు పోవాలి. అప్పుడే వారికి కీలకమైన పోస్టులు దక్కుతాయి. లేకపోతే అప్రాధాన్య జాబితాలో చేరిపోతారు. నాయకులు దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకోకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ అధికార సాధనకు అనువైన రీతిలో వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఫలితంగానే సెన్సిటివిటీ ఉన్న అధికారులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఉత్తమ స్తాయి పరిపాలన వ్యవస్థ లోపిస్తోంది. గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ సైతం అట్టడుగు వర్గాల పిల్లలలో మంచి స్ఫూర్తిని నింపగలిగారు. విద్యాభ్యాసం, పోటీవాతావరణంలో సమూల మార్పులు తేగలిగారు. కానీ ఇటీవల కొన్ని వివాదాలలో చిక్కుకున్నారు. ప్రభుత్వం నుంచి తగినంత మద్దతు లోపించింది. ఫలితంగానే ఆయన ప్రభుత్వ సర్వీసు నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.
రాజకీయ లక్ష్యం…
అయితే ముగ్గురి నిర్ణయం వెనక ఒక నిజం మాత్రం ఆలోచింపచేస్తోంది. అంతిమంగా దేశం మారాలంటే రాజకీయాలు మారాలి. నాయకుల్లో మార్పు రావాలి. ప్రభుత్వ ఉద్యోగమూ ప్రజాజీవితమే అయినా ప్రజాప్రాతినిధ్య పదవులే విధాననిర్ణయకంగా ఉంటాయి. అప్పడే అవసరమైన సంస్కరణలకు, మార్పులకు వీలవుతుంది. అందుకు తామే రంగంలోకి దిగాలనే లక్ష్యంతోనే జేపీ, జేడీలు రాజీనామాలు చేశారు. ప్రవీణ్ కుమార్ మాటల్లోనూ అదే లక్ష్యం తొంగి చూస్తోంది. అయితే వారి సేవలను అందుకునేందుకు దేశరాజకీయ రంగం సిద్దంగా ఉందా? ప్రజలు సన్నద్ధులై ఉన్నారా? అంటే సందేహమే. లోక్ సత్తా స్వచ్ఛంద సంస్థగా, సంస్ఖరణల చర్చా వేదికగా సక్సెస్ అయ్యింది. కానీ పార్టీగా ఫెయిల్ అయ్యింది. జేడీ లక్ష్మీనారాయణ వ్యక్తిగతంగా మంచి పేరుతెచ్చుకున్నారు. కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని స్వయం ఉపాధి, మహిళా చేతన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. కానీ రాజకీయ నాయకుడిగా విజయం అందుకోలేకపోయారు. ప్రవీణ్ కుమార్ మహాత్మాఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్ ల బాటలో పనిచేస్తానని చెబుతున్నారు. దళిత వర్గాల రాజకీయ లక్ష్యాల కోసం ఆయన సిద్దమవుతున్నారని అర్థమవుతోంది. ఇటువంటి అధికారులను ప్రజలు ఆహ్వానించి , ఆదరించినప్పుడే మరింతమంది పాలిటిక్స్ లోకి రావడానికి వీలవుతుంది. లేకపోతే ఉన్నత హోదాలు వదిలేసుకుని వచ్చినా ఫలితం కనిపించకపోతే పాలిటిక్స్ అన్నది వారసత్వాలకు, అవినీతి దందాలకు అడ్గాగానే మిగిలిపోతుంది. మార్పు కోసం ప్రయత్నించేవారిని మనసారా ఆశీర్వదించడం, గెలిపించడం ప్రజల చేతుల్లోనే ఉంది.
-ఎడిటోరియల్ డెస్క్