ఒక్కడే … అన్నీ తానే అయి

హేమంత్ సోరెన్.. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న హేమంత్ సోరెన్ జార్భండ్ ముక్తి మోర్చాను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర [more]

Update: 2019-12-24 17:30 GMT

హేమంత్ సోరెన్.. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న హేమంత్ సోరెన్ జార్భండ్ ముక్తి మోర్చాను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. హేమంత్ సోరెన్ రెండోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్ కు హేమంత్ సోరెన్ రెండో కుమారుడు. పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ మరణంతో అనూహ్యంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.

చిన్న వయసులోనే……

హేమంత్ సోరెన్ 1975లో జన్మించారు. ఆయన పాట్నాలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. హేమంత్ కు భార్య, ఇద్దరు పిల్లలు. అతి చిన్న వయసులో గతంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన హేమంత్ సోరెన్ పధ్నాలుగు నెలలు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. హేమంత్ సోరెన్ గత దశాబ్దకాలంగా పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. తండ్రి ఆశయాలతో పాటు గిరిపుత్రుల సమస్యలను ఆయన ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు.

కూటమిగా ఏర్పడి…..

జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ కలసి కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో బరిలోకి దిగాయి. మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన స్థానాలు ఈ కూటమి సాధించడంతో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలో జేఎంఎం గెలిచినప్పటికీ హేమంత్ సోరెన్ దిగాలు పడలేదు. ఆయన దృష్టంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. అందుకే ఆయన గత మూడేళ్ల నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్నారు. ఆ చెమటోడ్చిన దానికి ప్రతిఫలం నేడు దక్కింది.

అత్యధిక స్థానాలు ఇచ్చి…..

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నా హేమంత్ సోరెన్ ఏమాత్రం జంకలేదు. ఆయన ఎక్కువగా స్థానిక సమస్యలనే ప్రచారంలో ప్రస్తావిించారు. బీజేపీ పాలనలో జరిగిన హత్యలు, అత్యాచారాలను ప్రధానంగా ఆయన ఎన్నికల ప్రచారంలో అస్త్రాలుగా మలుచుకున్నారు. కాంగ్రెస్ సహకారంతో విజయాన్ని హేమంత్ సోరెన్ సులువుగా అందుకున్నారు. ఒక్క జేఎంఎంకే 30 స్థానాలు దక్కడం ఆ కుటుంబాన్ని, పార్టీని జార్ఖండ్ ప్రజలు అక్కున చేర్చుకున్నారని చెప్పవచ్చు. ఈనెల 27వతేదీన హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవితో పాటు మరో ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని, ఆర్జేడీకి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని హేమంత్ సోరెన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆల్ ది బెస్ట్ హేమంత్ సోరెన్.

Tags:    

Similar News