ఒక్క నియోజ‌క‌వ‌ర్గం ఇద్దరు వైసీపీ లేడీ నేత‌లు… వార్ ముదిరిందిగా

అనంత‌పురం జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం శింగ‌న‌మ‌లలో అధికార పార్టీ రాజ‌కీయాలు ఇటీవ‌ల కాలంలో చ‌ర్చకు వ‌స్తున్నాయి. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ నాయ‌కురాలు [more]

;

Update: 2020-09-17 02:00 GMT

అనంత‌పురం జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం శింగ‌న‌మ‌లలో అధికార పార్టీ రాజ‌కీయాలు ఇటీవ‌ల కాలంలో చ‌ర్చకు వ‌స్తున్నాయి. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ నాయ‌కురాలు జొన్నల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి.. సొంత పార్టీలోనే ఎదురీదాల్సి వ‌స్తొంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత ప‌ద్మావ‌తి.. జ‌గ‌న్ ద‌గ్గర మార్కులు వేయించుకునేందుకు దూకుడు ప్రద‌ర్శించారు. మ‌హిళా ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తున్న నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది అనంత‌రం జ‌రిగ‌నున్న మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో త‌న‌కు కూడా ప్రాధాన్యం ఉండాల‌ని ప‌ద్మావ‌తి కొరుకుంటున్నారు. ఎస్సీ + మ‌హిళా కోటాలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌ల‌తో ఆమె చాలా యాక్టివ్‌గా ఉండ‌డంతో పాటు రాష్ట్ర స్థాయి అంశాల‌పై సైతం ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. జిల్లాలో జేసీ దివాక‌ర్ రెడ్డి లాంటి నేత‌ల‌తో పాటు చంద్రబాబు లాంటి వారిపై ఘాటు విమ‌ర్శలే చేస్తున్నారు. ఇక ప‌ద్మావ‌తి భ‌ర్త రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డం కూడా ఆమె త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌న్న ఆశ‌ల‌తో ఉన్నార‌ట‌.

జగన్ దృష్టిలో పడి….

పార్టీ విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో తాను ఓడిపోయినా.. పార్టీ త‌ర‌ఫున నియోజ‌క‌వ‌ర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఒకానొక ద‌శ‌లో టీడీపీ అభ్యర్థి, అప్పటి ప్రభుత్వ విప్ యామినీ బాల‌పై జొన్నలగడ్డ తీవ్ర విమ‌ర్శలు సైతం గుప్పించారు. అబివృద్ది అంటే.. తిని ప‌డుకోవ‌డం కాదంటూ మీడియా ముందు తీవ్ర విమ‌ర్శలు చేశారు. పార్టీ త‌ర‌ఫున కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక‌, జ‌గ‌న్ పాదయాత్ర చేసిన స‌మ‌యంలో జిల్లాలో ఆయ‌న ప‌ర్యటించిన‌ప్పుడే ఆమె జ‌గ‌న్ దృష్టిని ఆక‌ర్షించారు. దీంతో జ‌గ‌న్ ప‌ద్మావ‌తి నాయ‌క‌త్వంపై వీరలెవ‌ల్లో ప్రశంస‌లు కురిపించేశారు. ఆమె భ‌విష్యత్ వైసీపీ రాజ‌కీయాల్లో కీల‌క మ‌హిళా నేత అవుతార‌ని మెచ్చుకున్నారు.

తానే స్వయంగా….

ఇలా పార్టీలో దూకుడు పెంచిన జొన్నలగడ్డ ప‌ద్మావ‌తి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే, జ‌గ‌న్ ద‌గ్గర మార్కులు కొట్టేసే నేప‌థ్యంలో వేసిన అడుగు ఇప్పుడు ఆమెకు ప్రతి బంధ‌కంగా మారింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీడీపీని బల‌హీనం చేయడం ద్వారా వైసీపీని మ‌రింత బ‌లోపేతం చేయొచ్చని భావించిన జొన్నలగడ్డ గ‌త ఏడాది టీడీపీ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ శ‌మంత‌క‌మ‌ణి, ఆమె కుమార్తె, మాజీ విప్ యామినీ బాల‌ల‌ను వైసీపీలోకి తీసుకువ‌చ్చారు. స్వయంగా త‌న ప‌క్కనే కూర్చోబెట్టుకుని మ‌రీ జొన్నలగడ్డ పద్మావతి తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్రకార్యాల‌యానికి తీసుకువ‌చ్చి.. కండువా కప్పించారు. ఇది అప్పట్లో సంచ‌ల‌నంగా మారింది.

కోరి తెచ్చుకున్నా….

అయితే, ఇప్పుడు శ‌మంత‌క‌మ‌ణి కుటుంబం నుంచే జొన్నలగడ్డ పద్మావతికి త‌ల‌నొప్పులు ఎదురవుతున్నాయి. పార్టీలో వారు గ్రూపు రాజ‌కీయాలు చేయ‌డంతోపాటు.. అధికార పార్టీలోనే ఇద్దరు నేత‌ల కేంద్రంగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. గ‌తంలో వీరు టీడీపీలో ఉన్నప్పుడు వీరికి బ‌ల‌మైన గ్రూపు ఉంది. ఇప్పుడు వారితో పాటు వైసీపీలో జొన్నలగడ్డ పద్మావతికి వ్యతిరేకంగా ఉన్నవారిని కూడ‌గ‌డుతూ చాప‌కింద నీరులా గ్రూపు రాజ‌కీయం చేస్తున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టే టార్గెట్‌గా వీరు ప‌ద్మావ‌తికి ఎర్త్ పెట్టే ప్రయ‌త్నాలు ప్రారంభించార‌న్న టాక్ స్థానికంగా వినిపిస్తోంది. కోరి తెచ్చుకున్న శ‌మంత‌క మ‌ణి కుటుంబం ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంద‌ని స్థానిక రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా వైసీపీలో ఈ ఇద్దరి మ‌హిళా ( ప‌ద్మావ‌తి, యామినీబాల‌) నేత‌ల పోరు ముదిరి పాకాన ప‌డ‌డం ఖాయంగానే ఉంది.

Tags:    

Similar News