వైసీపీలో లుక‌లుక‌లు.. లేడీ ఎమ్మెల్యేకు ఎస‌రు పెడుతున్నారా…?

రాజ‌కీయాల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక రూపంలో ప్రత్యర్థులు పోరు పెడుతూనే ఉంటారు. అది మండ‌ల స్థాయి నుంచి జిల్లా , నియోజ‌క‌వ‌ర్గం రాష్ట్ర స్థాయి [more]

Update: 2020-06-04 11:00 GMT

రాజ‌కీయాల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక రూపంలో ప్రత్యర్థులు పోరు పెడుతూనే ఉంటారు. అది మండ‌ల స్థాయి నుంచి జిల్లా , నియోజ‌క‌వ‌ర్గం రాష్ట్ర స్థాయి వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి. నాయ‌కులకు ఇవి అనుభవ‌మే. కానీ, కొంద‌రు కోరి కోరి కొరివి కొని తెచ్చుకుంటారు. ప్రశాంతంగా సాగుతున్న రాజ‌కీయ లైఫ్‌ను పొయ్యిలోకి నెట్టుకుంటారు. ఇలాంటి వాటిలో ఇప్పుడు అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అతి క‌ష్టం మీద‌.. అనేక వ్యయ ప్రయాస‌ల‌కు ఓర్చుకుని ఇక్కడ నుంచి వైసీపీ జెండా ఎగుర‌వేశారు.. జొన్నలగ‌డ్డ ప‌ద్మావ‌తి. 2014 ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన ప‌ద్మావ‌తి.. గత ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు.

ఒకే ఒక్క తప్పటడుగుతో….

ఈ విజ‌యాన్ని ఆస్వాదించి.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ప‌టిష్టమైన ఓటు బ్యాంకును సిద్దం చేసుకునే వ్యూహంలో భాగంగా వేసిన ఒకే ఒక్క త‌ప్పట‌డుగు.. ఇప్పుడు ప‌ద్మావ‌తి రాజ‌కీయాల‌కు ప్రతిబంధకంగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన శ‌మంత‌క‌మ‌ణి, ఆమె కుమార్తె యామినీ బాల‌ల ‌ను వైసీపీలోకి తీసుకువ‌చ్చారు ప‌ద్మావ‌తి. తాను గెలిచిన ఆరు మాసాల లోపే.. ఇంత వ్యూహాత్మకంగా టీడీపీ కేడ‌ర్ మొత్తాన్ని కూడా వైసీపీవైపు తీసుకురావ‌డం గొప్ప విష‌య‌మేన‌ని అంద‌రూ అనుకున్నారు. దీనిని చూసి ప‌ద్మావ‌తిని పార్టీలో అంద‌రూ మెచ్చుకున్నారు. అయితే, ఈ ప‌రిణామ‌మే ఇప్పుడు జొన్నలగ‌డ్డ ప‌ద్మావ‌తికి సంకటంగా మారిపోయింది.

తల్లీ కూతుళ్లు ఏకమై….

నియోజ‌క‌వ‌ర్గంలో ఆది నుంచి ప‌ట్టున్న శ‌మంత‌క‌మ‌ణి, గ‌త ఐదేళ్లు ఇక్కడ తిరిగి.. ప‌ట్టు సంపాయించుకున్న యామినీ బాల ఇప్పుడు వైసీపీలో చేర‌డంతో వారు కూడా లోపాయికారీగా చ‌క్రం తిప్పడం ప్రారంభించారు. అంటే దాదాపు శింగ‌న‌మ‌ల‌లో రెండు వైసీపీ అధికార కేంద్రాలు ఏర్ప‌డ్డాయి. ఎమ్మెల్యే జొన్నలగ‌డ్డ ప‌ద్మావ‌తి క‌నుస‌న్నల్లో జ‌ర‌గాల్సిన కొన్ని కార్యక్రమాల వివ‌రాల‌ను ముందుగానే సేక‌రించి.. వాటిపై ముందుగానే మీడియాకు లీక్ చేస్తూ.. తాము ఈ స‌మ‌స్యల‌పై పోరాడిన కార‌ణంగానే వాటిని సాకారం చేసుకునేందుకు అవ‌కాశం ఏర్పడిందంటూ.. త‌ల్లీకూతుళ్లు ఇద్దరూ కూడా చెబుతున్నారు.

ఎమ్మెల్యేకు ఇబ్బందే మరి….

అదే స‌మ‌యంలో కొంద‌రు అధికారుల‌తోనూ నేరుగా మాట్లాడుతూ.. స‌మ‌స్యలు ప‌రిష్కరించే విష‌యంలో దూకుడుగా ఉన్నారు. దీంతో తొలిసారి గెలిచిన జొన్నలగ‌డ్డ ప‌ద్మావ‌తి ప‌ట్టు పెంచుకునేందుకు ఉన్న అవ‌కాశం త‌గ్గి పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్పటికీ కూడా చాలా మంది త‌మ స‌మ‌స్యలు చెప్పుకొనేందుకు శ‌మంత‌క‌మ‌ణిని ఆశ్రయిస్తున్నారు. గ‌తంలో త‌ళ్లీ కూతుళ్లు ఇద్దరూ ఇక్కడ టీడీపీలో ఉండ‌డంతో ఆ ప‌రిచ‌యాల‌తో త‌మకంటూ ఓ వ‌ర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ వ‌ర్గం వారిని ఈ త‌ల్లికూతుళ్లు ప్రోత్సహిస్తుండ‌డంతో పాటు ప‌ట్టు పెంచుకుంటున్నారు.

డమ్మీగా మారిపోతారా?

ఇక ఇప్పుడు శమంత‌క‌మ‌ణి కుటుంబంలోనే త‌ల్లికూతుళ్లతో పాటు శ‌మంత‌క‌మ‌ణి కుమారుడు సైతం వైసీపీలో ఎదిగేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఈ ప‌రిణామం జొన్నలగ‌డ్డ ప‌ద్మావ‌తిని డ‌మ్మీగా మార్చింద‌నే భావ‌న ఎదుర‌వుతోంది. స్థానికంగా ఒకింత బ‌లంగా ఉన్న వైసీపీ నేత‌లు ఇదే విష‌యాన్ని ప్రచారం చేస్తున్నారు. వైసీపీలో కొంద‌రు రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌ల‌తో పాటు స‌హ‌జంగా ఉండే రెండో గ్రూపు కూడా ఇప్పుడు శమంత‌క‌మ‌ణి కుటుంబానికి మ‌ద్దతు ఇస్తోంద‌ట‌. నిజానికి వీళ్లు పార్టీలోకి వ‌స్తే త‌మ‌కు బలం అవుతార‌ని అనుకు‌న్న జొన్నలగ‌డ్డ ప‌ద్మావ‌తి ఎప్పుడూ ఇలా ఊహించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాలు నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తాయో ? చూడాలి.

Tags:    

Similar News