తీర్పులు – వ్యాఖ్యలు పరిధులు దాటుతున్నాయా?
కోర్టుల్లో కేసుల విచారణ సందర్భంలో న్యాయమూర్తులు ప్రశ్నలు వేయడం, వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణం. అయితే ప్రశ్నలు కేసు లోతుపాతులు తెలుసుకునేందుకు, వ్యాఖ్యలు కేసు విచారణకు మరింత ఉపయోగపడేందుకు [more]
కోర్టుల్లో కేసుల విచారణ సందర్భంలో న్యాయమూర్తులు ప్రశ్నలు వేయడం, వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణం. అయితే ప్రశ్నలు కేసు లోతుపాతులు తెలుసుకునేందుకు, వ్యాఖ్యలు కేసు విచారణకు మరింత ఉపయోగపడేందుకు [more]
కోర్టుల్లో కేసుల విచారణ సందర్భంలో న్యాయమూర్తులు ప్రశ్నలు వేయడం, వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణం. అయితే ప్రశ్నలు కేసు లోతుపాతులు తెలుసుకునేందుకు, వ్యాఖ్యలు కేసు విచారణకు మరింత ఉపయోగపడేందుకు సహకరించే దిశగా ఉండాలి. న్యాయమూర్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, ఆచి తూచి వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో విచారణ దశలో కొందరు న్యాయమూర్తులు పరిధి దాటి వ్యాఖ్యలు చేయడం, ప్రశ్నలు సంధించడం చూస్తూనే ఉన్నాం. న్యాయమూర్తులు వేసే ప్రశ్నలు, చేసే వ్యాఖ్యలు వరివ్వబోయే తీర్పును ప్రతిబింబించడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే, ఈ వ్యాఖ్యలేవీ చాలా సందర్భాల్లో తీర్పులో భాగంగా ఉండవు. అంటే అంతిమంగా వచ్చే తీర్పు వేరు. విచారణ సమయంలో వచ్చే ప్రశ్నలు, వ్యాఖ్యలు వేరు.
సమీక్షించుకుంటే….?
దురదృష్టవశాత్తు ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని కేసుల విచారణ సమయంలో కొందరున్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈరోజు పతాక శీర్షికల్లో వచ్చిన వ్యాఖ్యలు మరింత అభ్యంతరకరంగా కనిపిస్తున్నాయి. సదరు న్యాయమూర్తి ఏదో బాధ పడుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ఆయనోసారి నిష్పక్షపాతంగా పునరాలోచన చేసుకుంటే తనకు కలిగిన మనస్తాపానికి జవాబు దొరకొచ్చు. జవాబు దొరికితే కొంత ఉపశమనం ఖచ్చితంగా కలుగుతుంది.
అవతల వారికీ బాధే కదా?
ఎగ్జిక్యూటివ్ మీద, లెజిస్లేచర్ మీద ఈ మధ్యకాలంలో ఎలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో, ఆ వ్యాఖ్యలు డీజీపీ, చీఫ్ సెక్రటరీ లాంటి అధికారులను కూడా ఎంత బాధించి ఉంటాయో ఆత్మావలోకనం చేసుకుంటే తనకు కలుగుతుందనుకుంటున్న క్షోభకు కారణం దొరుకు తుందేమో. డీజీపీ, చీఫ్ సెక్రటరీ తదితరులు తప్పులు చేయరని, చేయలేదని కాదు. కానీ విచారణ సందర్భంలో వారినుద్దేశించి సదరు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు వారి మనోఫలకంపై ఎలాంటి ప్రభావం చూపి ఉంటాయో ఆలోచన చేసి తనకు తాను ఉపశమనం కలిగించుకోవచ్చు.
వ్యాఖ్యలు కొత్త కాదు…..
కేసుల విచారణ సందర్భంలో న్యాయమూర్తులు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, లేదా తమ తీర్పును సూచనగా తెలియజేస్తూ వ్యాఖ్యలు చేయడం, వ్యాఖ్యల్లో కఠినమైన పదజాలం ఉపయోగించడం కొత్తేమీ కాదు. ప్రతిష్టాత్మకమైన కేశవానంద భారతి కేసు విచారణ సందర్భంలో జస్టిస్ ద్వివేది వ్యక్తి ప్రాధమిక హక్కులకు సంబంధించి కోర్టు పరిధి దాటి వ్యాఖ్య చేసి, ఆ తర్వాత సహచర న్యాయమూర్తులతో తన వ్యాఖ్యపట్ల విచారం వ్యక్తం చేశారు. జస్టిస్ ద్వివేది చేసిన వ్యాఖ్య అప్పట్లో కాస్త సంచలనమే అయింది. ఆ తర్వాత సహచర న్యాయమూర్తులకు వ్యక్తిగతంగా తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే విచారణ సమయంలో న్యాయమూర్తులు ఆచి తూచి మాట్లాడాలని, తక్కువ మాట్లాడితే ఇంకా మంచిదని, కేసు విచారణకు అవసరమైన మేరకే ప్రశ్నలు అడగాలని, అలాగే అంతిమంగా వచ్చే తీర్పుతో అనుసంధానంగా మాత్రమే వ్యాఖ్యలు ఉండాలని, వ్యాఖ్యల తీవ్రత ఉండకూడదని జస్టిస్ జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ రే తదితరులు సూచన చేశారు.
నియంత్రించుకోగలిగితే….?
విచారణ సమయంలో న్యాయమూర్తులు తమ వ్యాఖ్యల తీవ్రత స్థాయిని నియంత్రించుకోవడం అవసరం. అలా నియంత్రించుకోలేని పక్షంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ న్యాయమూర్తులు పలు కేసుల్లో విచారణ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు తీవ్రంగానే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ వ్యాఖ్యలను మీడియా మరికొంత తీవ్రమైనవిగా చూపించిన విషయం కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తులు గమనంలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఓ న్యాయమూర్తి తన పదవీకాలం చివరి దశలో ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేయడం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్నాళ్ళుగా సదరు న్యాయమూర్తి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ పై చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్ధులు చేసే వ్యాఖ్యల స్థాయిలో ఉన్నాయని, అలాంటప్పుడు ప్రతి వ్యాఖ్యలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయని భావించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మానసిక వేదనకు…?
ఏమైనప్పటికీ కొందరు న్యాయమూర్తుల వ్యాఖ్యల తీవ్రత కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో సాధారణ ప్రజలు కూడా మొదటిసారి న్యాయవ్యవస్థపై దృష్టి పెట్టారు. ఇంతకాలం వ్యాఖ్య చేయడానికి భయపడే ప్రజలు మొదటిసారి ఇతర వ్యవస్థల్లాగే న్యాయవ్యవస్థపై కూడా బహిరంగ ఆరోపణలు చేశారు. వ్యవస్థను ఈ స్థాయికి తీసుకొచ్చిందెవరు? ఇలా ఆత్మావలోకనం చేసుకుంటే చివరి దశలో కలిగిన మనోవేదనకు, మనస్తాపానికి జవాబు దొరుకుతుందేమో. మనస్తాపం, మనోవేదన, ఆవేదన వంటివి మానసిక ఆరోగ్యానికి మంచివి కాదు కాబట్టి ఆ ఆవేదన తొలగేందుకు ఆత్మావలోకనం అవసరమేమో మానసిక నిపుణులు తేల్చాలి.
-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్