ఆ పదవి వద్దంటే వద్దట

కల్వకుంట్ల కవిత ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయ్యారు. కవిత ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలు కావడంతో అప్పటి [more]

;

Update: 2020-02-19 09:30 GMT

కల్వకుంట్ల కవిత ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయ్యారు. కవిత ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలు కావడంతో అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ప్రయివేటు కార్యక్రమాల్లో తప్ప బయట ఎక్కడా కవిత కన్పించడం లేదు. అధికారంలో తమ పార్టీ ఉన్నప్పటికీ కవితక్క బయటకు రాకపోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. తాను అమితంగా ప్రేమించి, అభివృద్ధి దిశగా నిజామాబాద్ పార్లమెంటును తీసుకెళదామని భావిస్తే మెట్టినింట తనను ఓడించారని కవిత బాధపడుతున్నారట.

రాజ్యసభకు వెళతారని….

అలాగే తమ పార్టీకి చెందిన నేతలే కొందరు సక్రమంగా తన గెలుపు కోసం పనిచేయలేదని నమ్ముతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే నిన్న మొన్నటి వరకూ కవితకు రాజ్యసభ పదవి ఖాయమని అన్నారు. త్వరలోనే రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో కవితకు కేసీఆర్ ఖచ్చితంగా రాజ్యసభ పదవి ఇస్తారని గట్టిగా ప్రచారం జరిగింది. కవిత కూడా రాజ్యసభకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారని కూడా వార్తలొచ్చాయి. దీంతో కవితక్క మళ్లీ ఢిల్లీ రాజకీయాలకు వెళతారని అందరూ భావించారు.

తనకు వద్దని…..

అయితే కవిత మాత్రం తనకు రాజ్యసభ పదవి వద్దంటే వద్దంటున్నారట. తిరిగి తాను నిజామాబాద్ పార్లమెంటు నుంచి ఎన్నికయ్యే వరకూ ఢిల్లీ గడప తొక్కేది లేదని కవిత తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట. దీంతో కవిత రాజకీయ భవిష్యత్ పై మరోరకం ప్రచారం జరుగుతోంది. కవితక్కకు త్వరలోనే మంత్రి పదవి దక్కుతుందని ఆమె సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా వారు ధీమాగా చెబుతుండటం విశేషం.

మంత్రిని చేస్తారా?

కవిత రాజకీయ భవిష్యత్తుపై గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తన కుటుంబ సభ్యులతోనూ చర్చించారట. కవితను రాజ్యసభ కు పంపేకన్నా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంచితే అన్న కేటీఆర్ కు అండగా ఉంటుందని కూడా సూచనలు రావడంతో కవితను ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేయాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద కవిత రాజకీయాలకు దూరంగా ఉండటం వల్లనే రోజుకో ప్రచారం జరుగుతోంది. అయితే కొద్దిరోజుల్లోనే కవితకు ముఖ్య పదవి మాత్రం ఖాయమంటున్నారు. అది రాజ్యసభ? లేదా మండలికి పంపి మంత్రిని చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News